NTV Telugu Site icon

Encounter Pradesh: యోగి హయాంలో ఎన్‌కౌంటర్లు.. యూపీ పోలీసుల లెక్కలు ఇవే..

Yogi

Yogi

ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి. యూపీ పోలీసుల నివేదిక ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 183 మంది నేరస్థులు మరణించారు. ఇందులో ఇటీవల ఝాన్సీలో జరిగిన కాల్పుల్లో మరణించిన గ్యాంగ్ స్టర్ అతిక్, ఆయన సోదరుడు అష్రఫ్ కూడా ఉన్నారు. 2017 మార్చిలో యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో 10,900 పోలీసు ఎన్‌కౌంటర్‌లు జరిగాయని యూపీ పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 23,300 మంది నేరస్థులను అరెస్టు చేయగా.. 5,046 మంది గాయపడ్డారు. లెక్కల ప్రకారం 1,443 మంది పోలీసులు గాయపడగా, 13 మంది మరణించారు. హత్యకు గురైన 13 మంది పోలీసులలో ఎనిమిది మందిని కాన్పూర్‌లోని ఇరుకైన సందులో దాక్కున్నప్పుడు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులు హతమార్చారు.

2017 మార్చి 20 నుంచి రాష్ట్రంలో పోలీసు ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరస్థులను కాల్చిచంపినట్లు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ కూడా తెలిపారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్లలో చాలా బూటకమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసలు నిజాలు బయటకు రావాలంటే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వం ఈ ఆరోపణలను అసలు పట్టించుకోలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు మెరుగయ్యాయనే వాదన వినిపిస్తోంది.
Also Read:KLRahul: డికాక్‌ను చాలా మిస్‌ అవుతున్నా..

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 13న అతీక్ అహ్మద్ కుమారుడు ఉమేష్‌పాల్ హత్య కేసులో నిందితుడు, అసద్, అతని సహాయకుడు గులామ్‌లు యుపి ప్రత్యేక దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించారు. బూటకపు గొడవలు పెట్టి అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదన్నారు. అసద్ హత్య , ఇతర ఇటీవలి ఘర్షణలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నేరస్తులు తప్పించుకోకూడదన్న అఖిలేష్.. అది సరియైనదా తప్పా అని నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు.

ఎన్‌కౌంటర్‌ల గురించి అనేక చర్చలు జరుగుతున్నందున, సంఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి మాయావతి కూడా ఉన్నత స్థాయి విచారణను డిమాండ్ చేశారు. అయితే, మీరు నేరం చేయకపోతే మిమ్మల్ని ఎవరూ ముట్టుకోరు, నేరం చేసిన వారెవరూ తప్పించుకోలేరంటూ యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సమర్థించుకున్నారు.
Also Read:Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?