ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ సహా న్యాయమైన 71 డిమాండ్లను పరిష్కరిస్తేనే పోరాటం ఆపుతామని వారు స్పష్టం చేశారు.
సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తీరుపై వారు మండిపడ్డారు. 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టవద్దని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉద్యోగ సంగాల నేతలు సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో ఉండాలని సజ్జల సూచించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఏపీ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నట్లు సమాచారం.