NTV Telugu Site icon

కేజీ నుండి పీజీ వరకు ప్రత్యక్ష బోధనే.. కేసీఆర్‌ కీలక ఆదేశాలు

కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోన్నాయి.. అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునర్‌ ప్రారంభించాలని ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ఇవాళ జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్ తదితరలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు తల్లిదండ్రులు సహా ప్రైవేట్‌ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు.

ఇక, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థలను పునర్‌ ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించామన్నారు సీఎం కేసీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్థుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది. అదే సందర్భంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక వత్తిడి పెరిగుతున్నదని, అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపే పరిస్థితి వున్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా, ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని, పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పునర్‌ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు సీఎం కేసీఆర్.

మరోవైపు.. ఇన్ని రోజుల పాటు పాఠశాలలు మూతబడి వుండడం మూలాన, గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లదేనన్న ఆయన.. మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి సానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు సీఎం. ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యతతీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విద్యాసంస్థలు తెరిచిన తర్వాత స్కూళ్లలోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను కోరారు సీఎం కేసీఆర్.