రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. దీంతో ఆమె నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెంది లచ్చవ్వ అనే మహిళ తీవ్ర నడుం నొప్పితో బాధపడుతోంది. దీంతో స్థానిక వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అయినా తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలంగా మారింది. కానీ వైద్యులకు ఆమె సమస్య అంతుబట్టలేదు. ఆమెది సహజ నొప్పి అని భావించి మెడిసిన్స్ ఇస్తున్నారు. సుమారు రూ.4 లక్షలు ఖర్చుపెట్టినా చివరకు ఫలితం దక్కలేదు.
అయితే ఓ వైద్యుడు మాత్రం లచ్చవ్వ నడుం నొప్పికి సమస్య ఏంటో తెలుసుకోవాలంటే ఎక్సరే తీయాలని సూచించాడు. దీంతో ఆమె వెన్నుపూసలో సూది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గతంలో ఏవైనా ఆపరేషన్‌లు జరిగాయా అంటూ లచ్చవ్వను వైద్యులు ప్రశ్నించారు. ఆమె జరిగినట్లు సమాధానం చెప్పడంతో ఆ సూది ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేశారు. లచ్చవ్వకు నాలుగేళ్ల క్రితం గర్భాశయంలో గడ్డలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2017 అక్టోబర్‌లో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యులు.. కుట్లు వేసే సమయంలో సూది, దారం మహిళ కడుపులోనే మరిచిపోయారు. రెండేళ్ల తర్వాత లచ్చవ్వకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సూది మొల్లగా వెన్నుపూసలోకి జారి ఆగిపోయింది. అప్పటి నుంచి నడుము నొప్పి ప్రారంభమైనట్టు వైద్యులు గ్రహించారు. అయితే ఆ వెన్నుపూస నుంచి సూదిని బయటకు తీయాలంటే చాలా ఖర్చు అవుతుందని లచ్చవ్వకు తెలిపారు. దీంతో లచ్చవ్వ ఆగ్రహం చెంది గతంలో తనకు ఆపరేషన్ చేసిన వైద్యుడిపై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గర వాపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: ఎంపీలకు కేంద్రం మరో షాక్.. ఉచిత విమాన ప్రయాణం రద్దు