NTV Telugu Site icon

మాజీ మంత్రి దేవినేని ఇంట విషాదం..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో పాల్గొన్నారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె.. ఇక, ఇవాళ కంచికచర్లలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు.. శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన మరణవార్త విన్న దేవినేని అవినాష్‌.. విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు.. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మి, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ, దేవినేని చందు, వినయ్‌ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు.. ఇక, కంచికచర్లలో పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.. తెలుగుదేశం పార్టీ నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.