NTV Telugu Site icon

మారని సన్‌రైజర్స్ తీరు.. టాప్‌ స్పాట్‌కు ఢిల్లీ..

ఐపీఎల్ 2021 సైన్‌ రైజర్స్‌ తీరు మారడంలేదు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో రాణించినా, మనీశ్ పాండే బెటర్ పర్ఫామెన్సే ఇచ్చినా… గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత ఉన్నట్టుండి కేప్టెన్‌ను కూడా మార్చేసింది. ఆరు మ్యాచుల తర్వాత జట్టు కెప్టెన్‌ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను పక్కనబెట్టి, కేన్‌ విలియమ్సన్‌కు బాధ్యతలు అప్పగించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్‌ టీమ్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్లాట్‌లో సరైన ఆటగాళ్లు లేరు. మిడిల్ ఆర్డర్ విఫలమవుతుండటం.. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గెలుపు ఓటములు సహజమే. ఆడిన ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన అవసరం లేదు. కానీ, కనీసం పోటీ ఇవ్వాలి. హైదరాబాద్‌లో అది కన్పించడం లేదు. రెండో ఎడిషన్‌లో ప్రతిమ్యాచ్‌ హైదరాబాద్‌కు చివరిదే. ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశాలు సజీవంగా ఉంటాయి.

ఇక, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది హైదరాబాద్‌.. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 రన్స్ చేసింది. డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ వెంట వెంటనే ఔటవ్వడంతో స్కోరుపై తీవ్ర ప్రభావం పడింది. సాహా, మనీశ్‌ పాండే, కేదార్‌, హోల్డర్‌ మళ్లీ విఫలమయ్యారు. అబ్దుల్‌ సమద్‌ 28, రషీద్‌ ఖాన్‌ 22 రాణించడంతో పరువు దక్కింది. హైదరాబాద్‌ టార్గెట్‌ను ఈజీగా చేధించింది ఢిల్లీ. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్ రాణించడంతో ఈజీగా గెలిచింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ఢిల్లీ.