డబ్బెవరికి చేదు. ఎంత ఉన్నా ..ఫ్రీగా డబ్బొస్తుంటే వద్దంటారా. పైగా వారు అణగారిన వర్గాలకు చెందినవారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు వద్దుపొమ్మంటున్నారు ఈ దళితులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు దళిత కుటుంబాలు దళిత బంధు ద్వారా వచ్చే సొమ్ముని నిరాకరించారు. తాము ఆర్థికంగా బాగానే ఉన్నామని ..అవసరంలో ఉన్న తోటి దళిత సోదరులకు ఆ సొమ్ము అందించాలన్నారు. దాంతో రాత్రికి రాత్రి వారు దళిత బంధు రోల్ మోడల్ గా మారిపోయారు. ఈ పథకం అమలులో భాగంగా దళిత కుటుంబాలను అధికారులు కలుస్తున్నారు. ఆ సందర్భంలోనే ఈ విషయం తెలిసింది.
దళితబంధు సొమ్మును నిరాకరించిన వారిలో ఇద్దరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు..ఇద్దరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు. అందరూ స్కీంకు అర్హులే. అయితే ..నో..థ్యాంక్యూ ..అంటూ అధికారులకు చెప్పారు. దాంతో బిత్తరపోవటం వచ్చిన వారి వంతైంది. ఇలా అంటారని కనీసం వారు ఊహించి కూడా ఉండరు.
నలుగురిలో ఒకరు కర్రె నరసింహ స్వామి హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన ముగ్గురు కుమారులు ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్, నవీన్ కుమార్. వీరిలో ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మరో కుమారుడు కిరణ్ కుమార్ రైల్వేస్‌లో డివిజనల్ ఇంజనీర్ కాగా నవీన్ కుమార్ ములుగులో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నరసింహ స్వామి భార్య అనసూయ కూడా రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. హుజూరాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ కాలనీలో నివాసముంటున్నారు.
దళితులు ఎంత కష్టపడుతున్నారో తనకు స్వయంగా తెలుసని..తానూ ఎన్నో కష్టాలు పడ్డానని నరసింహస్వామి అంటున్నారు. తాను అంబేద్కర్ వాదినని చెప్పారాయన. బాగా స్థిరపడిన వారు తోటి వారి అభ్యున్నతికి పాటుపడాలన్న అంబేద్కర్ మాటలను పాటిస్తామని చెప్పిరు. తాను తన భార్యకు కలిపి చాలినంత పెన్షన్ వస్తోందని ..తమ పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారని అందుకే దళిత బంధును నిరాకరిస్తున్నామని చెప్పారు నారాయణ స్వామి.
ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ దళితబంధు ప్రారంభించింది. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇ్దందులో భాగంగా అధికారులు సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించారు. వీరికోసం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసినట్టు సమాచారం.
ఉచితంగా అంత భారీ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉన్నా వీరు ఆశకు పోలేదు. ఆశయమే ముఖ్యమన్నారు. అ్దుకే వీరు సిసలైన శ్రీమంతులు. నరసింహస్వామి ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా అభినందనీయులు.