NTV Telugu Site icon

పడగ విప్పిన ‘ఒమిక్రాన్’.. ఊహించని విధంగా వ్యాప్తి..!

కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్‌ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్‌’ యావత్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 13 దేశాలకు వ్యాప్తి చెందింది.. అంటే.. అది ఎంతవేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.. దీంతో కట్టడికి పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.. సరిహద్దులను మూసివేశాయి. ఇదే సమయంలో విదేశాల్లోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది భారత ప్రభుత్వం.. వచ్చే నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఆ నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని భావిస్తోంది.. ఇతర దేశాల్లో వరుసగా కొత్త వేరియంట్‌ కేసులు వెలుగు చూస్తుండడంతో.. రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… ఇక, వైరస్‌ భయాలతో పలు రాష్ర్టాలు కూడా కఠిన ఆంక్షలకు పూనుకుంటున్నాయి.

ఇప్పటికే 13 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది.. సౌతాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన 600 మందిలో 61 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని నెదర్లాండ్స్‌ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే కాగా.. అందులో 13 మందికి ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ వెలుగుచూశాక ఒక దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా నుంచి రాకపోకలపై ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, ఈయూ, ఇరాన్‌, జపాన్‌, న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్‌, అమెరికా, సింగపూర్‌, దక్షిణ కొరియా, నేపాల్‌ తదితర దేశాలు నిషేధం కూడా విధించాయి. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను దేశంలోకి అనుమతించబోమని ఆదివారం ఇజ్రాయెల్‌, మొరాకో వెల్లడించాయి. అయితే, వచ్చే నెలలో నిర్వహించనున్న ప్రపంచ సుందరీమనుల పోటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, బోట్స్‌వానా, బెల్జియం, చెక్‌రిపబ్లిక్‌, బవేరియా, ఆస్ట్రియా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అంటే ఆసక్తి చూపించనివారు కూడా ఇప్పుడు వ్యాక్సిన్‌ కోసం పరుగులు పెడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక, వ్యాక్సిన్‌ వేసుకున్నవారిపై కూడా ఈ వేరియంట్‌ తీవ్ర ప్రభావమే చూపుతుందని హెచ్చరికలు ఉన్నాయి.. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. దాని బారినపడకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.