వైద్యం చేసి ప్రాణాలు నిలిపేవారే కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోంది. తాజాగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్లు, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. వీరందరినీ ఐసోలేషన్లలో చికిత్స అందిస్తున్నారు.. దీంతో హాస్పిటల్‌లో పని చేస్తున్న మిగతా సిబ్బందికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ హాస్పిటల్‌లో నాన్ కోవిడ్ అడ్మిషన్లు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కరోనా కలకలం రేపింది.. దాదాపు 25 మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ విద్యార్థులు, మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇతర వైద్యులు, సిబ్బంది, రోగులు ఆందోళనకు గురవుతున్నారు.
