NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్‌ ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్’ ఏర్పాటు.. పీకేపై మౌనం..!

Randeep Singh Surjewala

Randeep Singh Surjewala

దేశంలో కాంగ్రెస్‌ పని అయిపోయింది..! ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.. సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు.. గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిలదీయలేని పరిస్థితి..! అంటే రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ.. అయితే, వరుస సమావేశాలు, సీనియర్లతో కూడా మంతనాలు జరిపి.. అందరినీ గాడీలోపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీలు.. ఆయన ప్రతిపాదనలపై కీలక చర్చలు సాగుతున్నాయి.. అయితే, పీకే విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి కాంగ్రెస్‌ నేతలు మౌనం వహిస్తున్నారు.. ఆ ప్రశ్నలను దాటవేస్తున్నారు. ఇవాళ కూడా కొందరు సీనియర్లతో సమావేశం నిర్వహించారు సోనియా గాంధీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ నేత సుర్జేవాలా.. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ.. నివేదికను ఏప్రిల్ 21న సోనియా గాంధీకి సమర్పించడం జరిగిందన్న ఆయన.. ఈ నివేదికపై ఈ రోజు కూలంకషంగా చర్చ జరిగిందన్నారు.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం “ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్”ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Read Also: Harish Rao: ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది..

ఇక, మే 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు “నవసంకల్ప్ చింతన్ శిబిర్” నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రణదీప్ సింగ్ సూర్జేవాలా.. నవసంకల్ప్ చింతన్ శిబిర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 400 కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని.. వర్తమాన, సాంఘిక, రాజకీయ అంశాలపై చర్చలు సాగనున్నట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనారిటీ, యవత ఎదుర్కుంటున్న సమస్యలపై ఇతర ప్రజా సమస్యలపై కూడా చర్చించనున్నట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ప్రశాంత్‌ కిషోర్ పాత్రపై మీడియా ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా సుర్జేవాలా దాటవేశారు.. ఇక, న్యూఢిల్లీలోని 10 జనపథ్‌లో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, సూర్జేవాలా, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పీకే సూచించిన విధంగా పునరుజ్జీవన ప్రణాళికను రూపొందించడానికి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్యానెల్ శుక్రవారం తన నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే.. చాలా సూచనలు ఆచరణాత్మకమైనవి మరియు ఉపయోగకరమైనవిగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. కిషోర్ “బ్రాండ్” అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలోకి కిషోర్ రాకను వ్యతిరేకించే వారు సంస్కరణల వ్యతిరేకులు అని అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప మొయిలీ వ్యాఖ్యానించారు.