NTV Telugu Site icon

జేసీపై జీవన్‌రెడ్డి సీరియస్‌.. తప్పైపోయిందన్న జేసీ..

ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్‌ చల్‌ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్‌ అయ్యారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్‌ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం లేదన్న ఆయన.. మంచి ఏదైనా ఉంటే చెప్పాలి.. కానీ, పార్టీ డ్యామేజ్‌ అయ్యేలా కామెంట్ చేయొద్దని జేసీకి సూచించారు. పార్టీకి మంచి చేయని మాటలు దయజేసి ఇక్కడ మాట్లాడొద్దు అంటూ రెండు చేతులు జోడించి జేసీని కోరారు జీవన్ రెడ్డి.. ఇక, దీనికి బదులిచ్చిన జేసీ.. ఇకపై మాట్లాడను.. నాకు దండం పెట్టొద్దు.. మాట్లాడను అంతే.. తప్పు అయిపోయిందన్నారు జేసీ.

కాగా, తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రత్యక్షమైన జేసీ.. సీఎం కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానన్నారు.. మంత్రి కేటీఆర్ ను కలిసానని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానన్న ఆయన.. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవన్నారు.. ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్నారు జేసీ.