హైదరాబాద్‌లోని కొంపల్లిలో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ముందే రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. తమకు శిక్షణ తరగతుల పాసులు ఇవ్వలేదని ఆందోళన చేశాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని ఆరోపించాయి. బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కాదని కొత్త వారికి ఇచ్చారని మండిపడ్డాయి. పొన్నాల లక్ష్మయ్య మనుషులకు మాత్రమే ఇచ్చి తమను దూరం పెట్టారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గంగా ఉన్న తమను దూరం పెట్టారంటూ కొందరు విమర్శలు చేశారు.
Read Also: కేంద్రానికి తెలంగాణ వ్యవసాయ శాఖ లేఖ
అయితే ఆందోళనకారులకు రేవంత్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మనలో మనం ఒకరుపై ఒకరు కొట్లాడే దాంట్లో కొంతైనా టీఆర్ఎస్, బీజేపీలపై పోరాడాలని రేవంత్ సూచించారు. నిన్న ఒక తాగు బోతు కాంగ్రెస్ ఎక్కడా అని చిల్లర మల్లర మాటలు మాట్లాడాడని.. ఆయనకు మనం గుణపాఠం చెప్పేలా పనిచేయాలి కానీ ఇలా మన ఇంట్లోనే మనం గొడవ పడేలా చేయవద్దన్నారు. ఇష్టారాజ్యంగా ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులకు ఏవైనా సమస్యలు ఉంటే మండల, జిల్లా అధ్యక్షులకు చెప్పాలని పేర్కొన్నారు. మన పార్టీ వీడిపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని రేవంత్ అన్నారు. సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల అధ్యక్షులకు రాహుల్ గాంధీ చేత సన్మానం చేయిస్తాననిపేర్కొన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దొంగల ముఠా చేతుల్లో ఉందని.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు.
