గతంలో హడావిడి ఎక్కువగా ఉండేది.. పని తక్కువగా ఉండేది.. పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు.. కాగితాల మీద మాత్రమే అగ్రిమెంట్లు కనబడేవి అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్ స్పిన్నింగ్ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలు, స్పిన్నింగ్ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అన్నారు.. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్‌ఎంఈలు చేస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారని.. మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వెల్లడించిన ఆయన.. మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవారు సహా, వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడినట్టు అవుతుందన్నారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమలు కూడా జీడీపీకి దోహదపడతాయన్నారు సీఎం వైఎస్ జగన్.
గతంలో ఏమీ జరగకముందే మైక్రోసాఫ్ట్ వచ్చేసింది, ఎయిర్‌బస్ వచ్చేసింది అని హడావుడి చేసేవారు.. బుల్లెట్ రైలు వచ్చేసిందని మరో రోజు ఇలా హెడ్‌లైన్స్‌పెట్టి రాసేవారని ఎద్దేవా చేశారు సీఎం జగన్.. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి అడుగులు ముందుకేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ అని చెప్తే ఇచ్చేలా ఉండాలని.. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోందన్న సీఎం.. అనుకూలత లేని పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలన్నారు.. పరిశ్రమలు రావడమే కాదు, కొనుగోలు శక్తి ప్రజలకు ఉన్నప్పుడే ఆ పరిశ్రమలు నిలబడతాయని.. ఈ 27 నెలల కాలంలో ఇచ్చిన డబ్బు కుటీర, మధ్యతరహా పరిశ్రమలను, ఉపాధిని నిలబెట్టగలిగాయన్నారు. ఇలాంటి కష్ట కాలంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి నిలబెట్టగలిగామన్నారు. అప్పో, సప్పో చేసైనా సరే అందించిన డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు చెప్పినమాట అని గుర్తు చేశారు సీఎం వైఎస్ జగన్. ఇక, 12 లక్షలమందికి ఉపాధిని ఇస్తున్న పరిశ్రమలకు చేయూతనిస్తున్నామని తెలిపారు సీఎం జగన్.. ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు, టెక్స్‌టైల్ స్పిన్నింగ్‌మిల్స్‌కు రూ.684 కోట్లు నేరుగా వారి అక్కౌంట్లోకి వెళ్తాయన్న ఆయన.. 27 నెలలకాలంలోనే ఇప్పటివరకూ ఈ రంగాలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.2,087 కోట్లు అన్నారు. ఆసరా, చేయూత, తోడు లాంటి కార్యక్రమాలు కాకుండా ఇవి అదనంగా ఇచ్చామని.. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు పెట్టిన బకాయి రూ.904 కోట్లు అని.. సిన్నింగ్‌మిల్స్‌కు పెట్టిన బకాయి రూ.684 కోట్లు, మొత్తంగా రూ. 1,588కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు..