తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండని కోరారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండని, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు.
వెంటనే సరవణలు చేయాలి’ అని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతుండగా.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ లతో పాటు ఇత రాష్ట్రాల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.