Site icon NTV Telugu

ఒమిక్రాన్‌పై హై అలర్ట్… సీఎం జగన్ కీలక ఆదేశాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు.

ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్‌ విషయంలో మళ్ళీ డ్రైవ్‌…గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, ఫీవర్‌ సర్వే రెండూ చేయండి. ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోవాలన్నారు.

ఎంప్యానల్‌ ఆసుపత్రులు‌, క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్‌లను తిరిగి పరిశీలించాలి. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలన్నారు సీఎం జగన్. జిల్లా స్ధాయిలో కలెక్టర్‌లను, లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను సిద్దం చేయండన్నారు. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం. వ్యాక్సినేషన్‌ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం అన్నారు జగన్.

డిసెంబర్‌ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నదే టార్గెట్‌ అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ మాక్‌ డ్రిల్‌ చేయాలి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయాలన్నారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే చేయాలి, ర్యాపిడ్‌ టెస్ట్‌లు వద్దన్నారు సీఎం జగన్. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలన్నారు జగన్.

Exit mobile version