గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్‌లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్‌ఎస్‌కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లడం లేదని మేయర్‌పై గులాబీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేటర్ల వంతు రావడంతో అధికారపార్టీలో కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలతో సఖ్యత అంతంతమాత్రం..!
గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి మధ్య అస్సలు పొసగడం లేదు. మిగలిన ఎమ్మెల్యేలతోనూ అంతంతమాత్రంగానే సఖ్యత ఉందట. ఇలాంటి తరుణంలో కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పేరుతో మేయర్ నగరబాట.. నగుబాటు అవుతోందట.
కార్పొరేటర్లు లేకుండానే మేయర్ నగరబాట..!
మేయర్ సుధారాణి డివిజన్లకు వస్తుంటే.. కార్పొరేటర్లు కనిపించడం లేదు. ఆమె వెంట కమిషనర్, ఇతర అధికారులే ఉంటున్నారు. ప్రజలు కూడా సమస్యలు చెప్పడానికి ముందుకు రావడం లేదట. 13 నుంచి 18 డివిజన్లలో నగరబాట నిర్వహించాల్సి ఉండగా.. మూడుచోట్లే మేయర్ పర్యటన సాగింది. ఎమ్మెల్యే రాని కారణంగా మరో మూడుచోట్ల నగరబాట వాయిదా పడింది. కేవలం అభివృద్ధి జరిగిన కాలనీల్లోనే మేయర్ పర్యటిస్తున్నారన్నది పార్టీ వర్గాల ఆరోపణ. సుధారాణి మేయర్‌గా బాధ్యతలు చేపట్టాక ఒంటరిగానే కాలనీల్లో పర్యటిస్తున్నారని కార్పొరేటర్ల ఆరోపణ. అభివృద్ధి పనులపైనా కార్పొరేటర్లతో చర్చించడం లేదనే విమర్శలున్నాయి.
మేయర్ తీరుపై ఎమ్మెల్యేలకు కార్పొరేటర్ల ఫిర్యాదు..!
మేయర్ సుధారాణి తీరుపై కొందరు కార్పొరేటర్లు తమ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారట. దీంతో తమ డివిజన్లలో నగరబాట జరగకుండా ఎమ్మెల్యేలు వాయిదా వేయించారని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు… కార్పొరేటర్లు ఒక అవగాహనకు వచ్చి కాలనీల్లో పర్యటిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అధికారపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలు.. నిరసనల్లో నాయకుల మధ్య పొరపచ్చాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడా విభేదాలు.. క్షేత్రస్థాయి వరకు వ్యాపించడంతో శ్రేణుల్లో కలవరం మొదలైందట. మరి.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారో.. లేక పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ముందుగానే చర్యలు చేపడతారో చూడాలి.
