NTV Telugu Site icon

ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక మరికొందరిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: చంద్రబాబుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సెటైర్లు

మరోవైపు త్వరలో నెల్లూరు నగర టీడీపీకి కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయాలంటే యువరక్తం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై టీడీపీలో ఇకపై కుమ్మక్కు రాజకీయాలు సాగవని చంద్రబాబు స్పష్టం చేశారు. కోవర్టులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పారు.