దేశంలో కీలకమయిన ఎన్నికల సంస్కరణలకు రంగం సిద్ధం అయింది. ఎన్నికల ప్రక్రియ సంస్కరణలకు కీలక సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సులకు ఆమోదం లభించింది. ఓటర్ల జాబితాలను పటిష్టం చేసేందుకు 4 ప్రధాన సంస్కరణలు రానున్నాయి. దొంగ ఓటర్ల పేర్లు) ల బెడదను తొలగించేందుకు సన్నధ్దమౌతున్న కేంద్ర ఎన్నికల సంఘం.
ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డు తో అనుసంధానం చేసుకోనేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకటి, రెండు రోజులలో ఈ మేరకు పార్లమెంట్ లో “ప్రజాప్రాతినిధ్య చట్టం”కు సవరణలు చేస్తూ బిల్లు ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే, స్వఛ్చందంగా ఓటర్లు అనుసంధానం చేసుకోనేందుకు వెసులుబాటు కల్పించనుంది.
గతంలో వ్యక్తి “గోప్యత” హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టి లో పెట్టుకుని, ఓటరు స్వఛ్చందంగా తన “ఓటర్ కార్డు”ను ఆధార్ కార్డు తో అనుసంధానం చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటర్లు గా వచ్చే జనవరి 1 వ తేదీ నుంచి వివిధ తేదీల్లో నమోదు చేసుకునేందుకు ఏడాది కి నాలుగు సార్లు అవకాశం. ఎన్నికలను నిర్వహించేందుకు ఏ ప్రాంగణాన్ని అయినా స్వాధీనం చేసుకునే విధంగా ఎన్నికల సంఘంకు మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది. ఎన్నికల సమయంలో విద్యా సంస్థలు, ఇతర ముఖ్య సంస్థలను స్వాధీనం చేసుకునే విషయంలో గతంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఈ చర్యల వల్ల చాలా సానుకూల, సత్ఫలితాలు వచ్చాయని, తాము నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులలో స్పస్టమైనట్లు పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ చర్యల వల్ల దొంగ ఓటర్లను తొలగించి, పకడ్బందీగా ఓటర్ల జాబితాలను రూపొందించవచ్చని భావిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. రాబోయే ఎన్నికల నాటికి ఈ సంస్కరణలు కార్యరూపం దాల్చనున్నాయి.