NTV Telugu Site icon

తెలుగు రాష్ట్రాల్లో రేపటి ఉపఎన్నికలకు సర్వం సిద్ధం

తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్‌లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత లేదని అధికార పార్టీ టీఆర్‌ఎస్ నిరూపించుకోవాలని భావిస్తుండగా… తనను అవమానించి బయటకు పంపిన పార్టీకి తన సత్తా ఏంటో చూపించాలని బీజేపీ అభ్యర్థి ఈటెల ఉవ్విళ్లూరుతున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 1,715 మంది సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 3,880 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఫేక్ న్యూస్ నమ్మవద్దని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద శానిటైజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు ఉంటాయని, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ కర్ణన్ వివరించారు.

Read Also: ‘మంగళవారం మరదలు’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ

మరోవైపు ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 221 కేంద్రాలను సమస్యాత్మకం అని భావించిన ఎన్నికల సంఘం… ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్‌ను నియమించింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ సర్వర్‌తో అనుసంధానించారు. బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.