NTV Telugu Site icon

కేసీఆర్ అసలు గుట్టు బయటపెట్టిన విజయశాంతి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది.

మిగిలిన బియ్యం రా రైస్‌ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వాలని… అలాగే ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్‌ రైస్‌కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశమని… పైగా, ఇది రైస్‌ మిల్లర్లకు సంబంధించిన వ్యవహారమని… ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నుంచి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

కానీ.. సెప్టెంబరు 26న ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం కేసీఆర్…. గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని… దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి అయ్యాయని… ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవాలని, రానున్న రోజుల్లో ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి… పాత కోటాకు (24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను అదనంగా ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తామని స్పష్టంగా ఒప్పందం చేసుకుని… కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎఫ్‌సీఐకి ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తామని… ఇక మీదట ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని హామీ ఇచ్చారు.

కేంద్రం కూడా ఈసారికి తప్ప… మరోసారి ఒక్క కూడా గింజ బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని కరాఖండిగా చెప్పి ఈ మేరకు లేఖాస్త్రాలన్నీ సెప్టెంబరు నెలాఖరుతోనే పూర్తి చేసింది. అయితే… కేంద్రం వద్ద ఒప్పుకుని, లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన అంశాన్ని సీఎం కేసీఆర్ ఇంతకాలం అధికారికంగా వెల్లడించకుండా… కేంద్రం అసలు బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని అంటోందని, వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్రచారాన్ని మొదలుపెట్టి… హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంతో మతి భ్రమించి, మిల్లర్లతో కుమ్మకై… నేడు ధర్నా పేరుతో రాద్ధాంతాన్ని సృష్టిస్తూ… రైతులను ఆందోళనలో పడేస్తూ… కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర సర్కార్ కపటనాటకాలను గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి అని ఆమె వెల్లడించారు.