NTV Telugu Site icon

వరవరరావు బెయిల్‌ మరోసారి పొడిగింపు.. షరతులు కూడా..!

విరసం నేత, ప్రముఖ కవి వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు.. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది.

కాగా, ఎల్గార్ పరిషద్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో వున్న వరవరరావుకు అనారోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.. అయితే, ముంబైలోనే ఉండాలంటూ షరతులు విధించింది.. ఈ నేపథ్యంలో, తెలంగాణలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. తాను ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు కోర్టు విధించిన షరతులన్నింటినీ తాను పాటించానని, ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని తెలిపారు.. ప్రస్తుతం తన వయసు 84 ఏళ్లని, తన భార్య వయసు 72 ఏళ్లని… కోర్టు ఆదేశాల మేరకు తామిద్దరం ఇంటికి దూరంగా ముంబైలోనే ఉంటున్నామంటూ కోర్టుకు తెలిపిన ఆయన.. ముంబైలాంటి మహానగరంలో వైద్య చికిత్సలు చేయించుకోవడం తనలాంటి వాళ్లకు తలకుమించిన భారంగా ఉంటుందని.. తనకు తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.. కానీ, ఇవాళ పాత షరతులనే కొనసాగిస్తూ ఆదేశాలిచ్చింది బాంబే హైకోర్టు.