NTV Telugu Site icon

బిగ్‌బాస్-5: రవి ఎలిమినేషన్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

బిగ్‌బాస్-5 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి కారణం యాంకర్ రవి ఎలిమినేషన్. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల మధ్య యాంకర్ రవి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్‌ షోపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈరోజు ఉదయమే యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఆందోళనకు దిగారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

Read Also: బిగ్‌బాస్-5: రవి ఎవిక్షన్ ఎఫెక్ట్… అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత

ఈ నేపథ్యంలో యాంకర్ రవి అభిమానులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతుగా నిలిచారు. యాంకర్ రవిని ఎలిమినేట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బిగ్‌బాస్‌ షోను బ్యాన్ చేయాలని… అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి ఎలిమినేట్ కావడంలో తెరవెనుక ఏదో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో బిగ్‌బాస్ నిర్వాహకులు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభిమానంతో ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. చిన్నారులు, మహిళలు బిగ్‌బాస్ షోను చూడలేకపోతున్నారని… అన్ని భాషల్లో ఈ షోను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని రాజాసింగ్ హెచ్చరించారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్‌బాస్(హిందీ) షోలో అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.