NTV Telugu Site icon

బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’

Bigg-Boss-5

Bigg-Boss-5

బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా యానీ, నటరాజ్ నటించారు. లహరి మతిమరుపు మామ పాత్రను రవి పోషించగా, పక్కింటి అబ్బాయిగా మానస్ చేశాడు. ఈ రెండు కుటుంబాలను కలిపే పెళ్ళిళ్ళ పేరయ్య పాత్రను షణ్ముఖ్ ప్లే చేయగా, పెళ్ళి ని జరిపించే ఈవెంట్ మేనేజర్ గా లోబో, అతని అసిస్టెంట్ గా శ్వేత వర్మ నటించారు. అయితే… ఈ ఆట పూర్తి కాకముందే సమయాభావంతో మరునాటికి దీని ప్రసారాన్ని వాయిదా వేశారు. గతంతో పోల్చితే రెండు మూడు రోజులుగా ఎడిటింగ్ కూడా బాగుంటోంది. ఎక్కువ జర్క్ లు లేకుండా కూల్ గా రోజు మొత్తంలో జరిగిన సంఘటనలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

Read also : బిగ్ బాస్ హౌస్ లో కాక మొదలైంది!

ఇక ఈ ఆటకు కాస్తంత ముందే బిగ్ బాస్ సీజన్ 5 మూడోవారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. సోమవారం ‘వాల్ ఆఫ్ షేమ్’లో లహరి, రవిపై ప్రియా చేసిన ఆరోపణలు చివరకు ఆమె క్షమాపణలు చెప్పడంతో సర్దుమణిగింది. 15వ రోజు రాత్రి మూడు గంటల వరకూ కన్నీటి పర్యంతమైన ప్రియా… ఆ మర్నాడు మనసు మార్చుకుని బిగ్ బాస్ హౌస్ లోని కెమెరా ముందుకొచ్చి, తన ఆరోపణల కారణంగా లహరి, రవి మనసు గాయపర్చినందుకు సారీ చెప్పింది. అయితే… ముందు రోజు నామినేషన్ ప్రక్రియను మధ్యలోనే ఆపిన బిగ్ బాస్ మంగళవారం దాన్ని కొనసాగించాడు. ఈ రోజున జశ్వంత్ మానస్, నటరాజ్ ను; షణ్ముఖ్ ప్రియ, లహరిని; శ్వేతవర్మ శ్రీరామ్, లోబోను, హమీదా ప్రియా, ప్రియాంకను, కాజల్ ప్రియాంక, ప్రియను, విశ్వ నటరాజ్, ప్రియను నామినేట్‌ చేశారు. లహరి విషయంలో ప్రియ చేసిన వ్యాఖ్యలే ఆమెకు అత్యధికంగా నామినేషన్ లో 6 ఓట్లు పడటానికి కారణమైంది. అలానే శ్రీరామ్ ను సైతం 6 మంది నామినేట్ చేశారు. ఇక లహరి, మానస్, ప్రియాంకకు మూడు ఓట్లు చొప్పన పడ్డాయి. దాంతో ప్రియా, శ్రీరామ్, లహరి, మానస్, ప్రియాంకలను బిగ్ బాస్ మూడోవారానికి నామినేషన్ లో ఉంచారు. గత వారం కూడా ఎలిమినేషన్స్ లో ప్రియ, ప్రియాంక ఉన్నారు. ఈ వారం కూడా వారికి అగ్నిపరీక్ష మొదలైంది. ఇప్పటి వరకూ వరుసగా ఇద్దరూ లేడీ కంటెస్టెంట్సే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మరి అదే బాటలో ప్రియ, ప్రియాంక, లహరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా? లేకపోతే తొలిసారి బిగ్ బాస్ సీజన్ 5 నుండి మేల్ కంటెస్టెంట్స్ అయిన శ్రీరామ, మానస్ లలో ఒకరిని ఇంటికి పంపుతారా? అనేది వేచి చూడాలి.