NTV Telugu Site icon

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్

టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు బాబర్ ఆ రికార్డును అధిగమించాడు.

Read Also: బంగ్లాదేశ్‌ను 3 పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఓ ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్సులు ఆడి 100 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ 53 ఇన్నింగ్సుల్లోనే 100 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కాగా గ్రూప్-2లో పాకిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ టీమ్ అన్నింటిలో విజయకేతనం ఎగురవేసి ఆరు పాయింట్లను సాధించింది. రెండో స్థానంలో ఆప్ఘనిస్తాన్ జట్టు ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న టీమిండియా ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవలేదు. మన జట్టు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడగా అందులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం టీమిండియాకు కీలక మ్యాచ్ జరగనుంది. బలమైన న్యూజిలాండ్‌ జట్టును కోహ్లీ సేన ఢీకొట్టనుంది.