NTV Telugu Site icon

సాయి ధరత్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్‌ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్‌బోన్‌ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు.

కాగా, నిన్న రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తూ… రోడ్డు మీద ఇసుక కారణంగా తేజ్‌ జారి పడిపోయారు. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో ఆయనకు గాయాలయ్యాయ్‌. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి కేబుల్‌ బ్రిడ్జ్‌ దాటాక… కోహినూర్ హోటల్‌ ఎదురుగా సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయిధరమ్‌తేజ్‌ను తొలుత మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు సీటీ స్కాన్‌ కూడా తీశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిహారిక, సందీప్‌ కిషన్‌ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరికి వచ్చి.. సాయిధరమ్‌ తేజ్‌ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్లే సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు… మాదాపూర్ పోలీసులు. బైక్‌ మీద 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా… అది స్కిడ్‌ అయి పడిపోయింది. ఆ సమయంలో తేజ్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నా… ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. ఆయన ఛాతి భాగం రోడ్డుకు బలంగా తగిలి రాసుకుపోయినట్టుగా దెబ్బల్ని బట్టి చూస్తే తెలుస్తోంది. దీంతో శ్వాస సంబంధ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్వాస సంబంధ సమస్యలు రాకుండా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైతే తేజ్‌ ప్రమాదం నుంచి బయటపడినట్టే.