NTV Telugu Site icon

తిరుపతిలో అమరావతి రైతుల సభకు గ్రీన్ సిగ్నల్

ఉత్కంఠ వీడిపోయింది. తిరుపతిలో బహిరంగసభకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ అనుమతిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది లక్ష్మీనారాయణ.

తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తిరుపతి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా జేఏసీ బహిరంగ సభకు అనుమతించాలని కోరారు పిటిషనర్లు. తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 6 వరకు సభకు అనుమతి లభించింది.

శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని.. వీడియో ఫుటేజ్ చూపించారు ఏఏజీ. ప్రైవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకోవచ్చు కదా అని ప్రశ్నించింది హైకోర్టు. ఒమిక్రాన్ కేసుల ఉన్నందున సభకు అనుమతించలేదన్న అడిషనల్ ఏజీ. బహిరంగ సభలో ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది హైకోర్టు. నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని.. ప్రభుత్వం, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు పేర్కొంది.

సభ నిర్వహణలో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని హైకోర్టు ఆదేశించింది. తమ బహిరంగ సభకు కూడా అదే రోజు అనుమతి ఇవ్వాలని కోరింది రాయలసీమ హక్కుల సాధన సమితి. అదే రోజు ఇచ్చేది లేదని, కావాలంటే మరుసటి రోజు సభ నిర్వహించుకోవాలని సూచించింది న్యాయస్థానం.