NTV Telugu Site icon

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మరో కొత్త వేరియంట్.. టెన్షన్.. టెన్షన్..

కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం తెలిపారు. అయితే ఈ వేరియంట్‌ ఒమిక్రాన్‌ను పోలి ఉందని.. కానీ ఇది ఒమిక్రాన్‌ కాదని వారి వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్‌లో కొన్న మ్యుటేషన్లు మాత్రమే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను పోలి ఉన్నాయని చీఫ్ హెల్త్ ఆఫీసర్ పీటర్ ఐట్‌కెన్ స్థానిక మీడియాతో అన్నారు. అయితే దక్షిణాఫ్రికా నుంచి గత శనివారం వచ్చిన వ్యక్తి ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఐసోలేషన్‌ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సదరు వ్యక్తి సౌతాఫ్రికా నుంచి వచ్చిన నేపథ్యంలో అతడి శాంపిల్స్‌పై మరిన్ని పరీక్షలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పీటర్ ఐట్‌కెన్ తెలిపారు. సదరు వ్యక్తికి సంబంధించిన రిపోర్టులను పై అధికారులకు పంపించామని దీనిపై త్వరలోనే మరింత స్పష్టమైన సమాచారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు.