NTV Telugu Site icon

దూసుకొస్తున్న ‘జవాద్‌’.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

ys jagan

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాల ఎఫెక్ట్‌ ఇంకా తగ్గలేదు.. అప్పుడే మరో తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తోంది… ‘జవాద్‌’గా నామకరణం చేసిన ఈ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాటు చేయాలని సూచించిన ఏపీ సీఎం.. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు.. ఇక, తుఫాన్‌ వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.

Read Also: కేసీఆర్‌, జగన్‌కు ముద్రగడ లేఖ..

మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించిన ఆయన.. తక్షణమే సంబంధిత జిల్లాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు చూడాలని పేర్కొన్నారు. అయితే, అండమాన్‌ సముద్రం పరిసరాల్లోకి ప్రవేశించిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా మారనుందని ఆ తర్వాత తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని.. శుక్రవారం తుఫాన్‌గా మారుతుందని.. శనివారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.