NTV Telugu Site icon

బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు..

బద్వేల్‌ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అభ్యర్తి డాక్టర్ సుధ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపిన ఆయన.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టరే అని గుర్తుచేసిన సీఎం.. మన పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నాం.. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడకు వచ్చిన వారి అందరిమీదా ఉన్నాయన్నారు.. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని సూచించిన ఆయన.. 2019లో దాదాపు 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని.. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కన్నా.. ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకు రావాలని స్పష్టం చేశారు.

ఇక, ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదు అని ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్.. కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలన్న ఆయన.. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగింది.. ఈ సారి ఓటింగ్‌ శాతం మరింత పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సూచించారు.. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని.. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని.. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని.. ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలన్నారు.. అంతే కాదు.. వారు పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యం చేయాలన్న సీఎం.. నెలరోజులపాటు మీ సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.