అమితాబ్ బచ్చన్ కు ముందు తరువాత కూడా పలువురు సూపర్ స్టార్స్ వచ్చారు. కానీ, మన దేశంలో ‘తొలి ఆరడుగుల సూపర్ స్టార్’గా నిలిచింది అమితాబ్ బచ్చనే. ఆయనకు ముందు రాజేశ్ ఖన్నాను ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని కీర్తించారు. మరి ఆయన కంటే ముందు టాప్ స్టార్స్ గా రాజ్యమేలిని రాజ్ కపూర్ ,దిలీప్ కుమార్, దేవానంద్ మాటేమిటి అంటారు ఎవరైనా! వాళ్లను మహానటులు జాబితాలో చేర్చారు జనం. అందువల్ల వారిని ‘సూపర్ స్టార్’ అనలేక పోయారు. రాజేశ్ ఖన్నా నటనతో కాకుండా, తన స్టైల్ తో విజయకేతనం ఎగురవేశారు. వరుస విజయాలు చూడగానే ‘ఫస్ట్ సూపర్ స్టార్’ అని జేజేలు పలికారు. ఆయన తరువాత ‘సూపర్ స్టార్’ స్థానం ఆక్రమించుకున్న అమితాబ్ బచ్చన్ మాత్రం ‘తొలి ఆరడుగుల సూపర్ స్టార్’ అనిపించుకున్నారు. ఎందుకంటే అంతకు ముందు అంత ఎత్తున్న సూపర్ స్టార్ ఎవరూ కనిపించరు. ఆ తరువాత ఎందరు సూపర్ స్టార్ డమ్ చూసినా, అమితాబ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. అందువల్లే ఈ నాటికీ ఆరడుగుల సూపర్ స్టార్ అంటే ఆయనే! నటనతోనూ అమితాబ్ బచ్చన్ ఆకట్టుకున్న తీరు ప్రత్యేకమైనది. అందుకే జాతీయ స్థాయిలో నాలుగు సార్లు ఉత్తమనటునిగా నిలచిన ఘనతను సొంతం చేసుకున్నారాయన.
అమితాబ్ శ్రీవాత్సవ ఆయన అసలు పేరు. 1942 అక్టోబర్ 11న జన్మించారు అమితాబ్. ఆయన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్. నిజానికి ‘బచ్చన్’ అన్నది వారి ఇంటిపేరేమీ కాదు. హరివంశరాయ్ కలం పేరు ‘బచ్చన్’. అదే తరువాతి రోజుల్లో తన తనయులు అమితాబ్, అజితాబ్ కు వెనకాల పెట్టేశారు హరివంశరాయ్. అసలు అమితాబ్ కన్నవారు ఆయనకు ‘ఇంక్విలాబ్’ అనే పేరు పెట్టాలని అనుకున్నారట. ‘ఇంక్విలాబ్’ అంటే ‘విప్లవం. ఆ రోజుల్లో తెల్లవారిపై మన భారతీయులు తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి తన కొడుకు పేరును ‘ఇంక్విలాబ్’గా పెట్టాలని హరివంశరాయ్ భావించారు. ఆయన స్నేహితుడు మరో ప్రముఖ కవి సుమిత్రానంద్ పంత్ సూచనతో ‘అమితాబ్’ అన్న పేరును ఖాయం చేశారు. ఆ రోజుల్లో హరివంశరాయ్ కవిత్వం అంటే మహానాయకులు సైతం ఎంతగానో ఆరాధించేవారు. నెహ్రూ కుటుంబంతో హరివంశరాయ్ కు సత్సంబంధాలున్నాయి. అలా నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీతో చిన్నప్పటి నుంచే అమితాబ్ బచ్చన్ కు స్నేహబంధం ఉంది. అలహాబాద్, నైనిటాల్, ఢిల్లీలో అమితాబ్ బచ్చన్ విద్యాభ్యాసం సాగింది. తనయుల అభిలాష మేరకే వారిని ప్రోత్సహించాలని భావించారు హరివంశరాయ్. అమితాబ్ కు నటనలో ఆసక్తి ఉందని తెలిసి, తనకు తెలిసిన పృథ్వీరాజ్ కపూర్ నాటక సంస్థలో ఏదైనా అవకాశం ఉందేమో చూడమని కోరారు హరివంశరాయ్. అయితే ఆయన లేదని చెప్పడంతో, అమితాబ్ బచ్చన్ ‘ఆల్ ఇండియా రేడియో’లో న్యూస్ రీడర్ పోస్ట్ కు వెళ్ళారు. అక్కడ ఆయన గొంతు వార్తలు చదవడానికి ఏ మాత్రం పనికి రాదని తిప్పి పంపారు. ఏదో ఒక పనిచేయాలని భావించిన అమితాబ్ కలకత్తా వెళ్ళి అక్కడ బర్డ్ అండ్ కో లో బిజినెస్ రెప్రజెంటేటివ్ గా పనిచేశారు. అదే సమయంలో అక్కడి థియేటర్ లోనూ నటించారు. ఆ అనుభవంతోనే అమితాబ్ చిత్రసీమలో ప్రవేశించారు. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి సిఫార్సు లెటర్ తో ముంబయ్ లో పలువురు నిర్మాతలను కలిశారు అమితాబ్. లాభం లేకపోయింది. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ హిందీలో ‘భువన్ షోమే’ చిత్రంలో అమితాబ్ కు అవకాశం లభించింది. ఈ సినిమాతోనే తొలిసారి అమితాబ్ తెరపై కనిపించారు.
‘భువన్ షోమే’లో నటించాక కె.ఏ.అబ్బాస్ రూపొందించిన ‘సాత్ హిందుస్థానీ’లో కీలక పాత్ర పోషించారు అమితాబ్. ఆ వెనుకే అమితాబ్ బచ్చన్ కు ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాతో ‘ఆనంద్’ చిత్రంలో కలసి నటించే అవకాశం దక్కింది. అందులో రాజేశ్ ఖన్నా నటనకు బెస్ట్ యాక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించగా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అమితాబ్ కు కూడా ఫిలిమ్ ఫేర్ దక్కింది. నవీన్ నిశ్చల్ హీరోగా రూపొందిన ‘పర్వానా’లో నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపించారు అమితాబ్. మరికొన్ని చిత్రాలలో కనిపించినా రోడ్ కామెడీగా రూపొందిన ‘బాంబే టు గోవా’తో అమితాబ్ కు హీరోగా మంచి గుర్తింపు లభించింది. సలీమ్ – జావేద్ రచనలో రూపొందిన ‘జంజీర్’తో అమితాబ్ స్టార్ అయ్యారు. రాజేశ్ ఖన్నాతో కలసి నటించిన రెండో చిత్రం ‘నమక్ హరామ్’తో మరోమారు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అందుకున్నారు అమితాబ్. “దీవార్, షోలే, కభీ కభీ, హేరా ఫేరీ, అమర్ అక్బర్ ఆంటోనీ, ఖూన్ పసీనా, పర్వరిష్, కస్మేవాదే, త్రిశూల్, డాన్, మిస్టర్ నట్వర్ లాల్, కాలా పత్థర్, సుహాగ్, దోస్తానా, యారానా, నసీబ్, లావారిస్, సత్తే పే సత్తా, నమక్ హలాల్, కూలీ” వంటి అమితాబ్ చిత్రాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘కూలీ’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో అమితాబ్ ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డారు. ఆ సమయంలో ఆబాలగోపాలం అమితాబ్ ప్రాణాలు నిలవాలని ప్రార్థించడం ఈ నాటికీ అభిమానులకు గుర్తుంది. తరువాత తన వయసుకు తగ్గ పాత్రల్లో అలరిస్తూ సాగారు. ‘అగ్నిపథ్’ చిత్రంలో అమితాబ్ నటనకు తొలిసారి నేషనల్ అవార్డు లభించింది. అంతకంటే అమితాబ్ బాగా నటించిన చిత్రాలలో నేషనల్ అవార్డు రాలేదు. కానీ, ‘అగ్నిపథ్’లో ఆయనకు అవార్డు ప్రకటించడం పట్ల అప్పట్లో విమర్శలు వినిపించాయి. అయితే ఆ తరువాత “బ్లాక్, పా, పికు” చిత్రాలతో అమితాబ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలవడంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ కలగలేదు. నాలుగు సార్లు ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డును అందుకున్న ఏకైక నటుడు అమితాబ్. నవతరం నాయకులతోనూ కలసి నటించి అలరించారు అమితాబ్. ఈ యేడాదితో 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు అమితాబ్. హిందీ, బెంగాలీ చిత్రాలలోనే కాదు దక్షిణాది సినిమాల్లోనూ అమితాబ్ కనిపించి అలరించారు. హాలీవుడ్ మూవీస్ లోనూ అభినయించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఆయన ఉత్సాహంగా ఉండడం విశేషం.
తన మిత్రుడు రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లో ప్రవేశించారు అమితాబ్ బచ్చన్. 1984లో అలహాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. తరువాత మూడేళ్ళకే రాజీనామా చేశారు. ఆయన భార్య జయబాధురి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు అమితాబ్ వాయిస్ పనికిరాదన్నారు. అదే అమితాబ్ వాయిస్ ఓవర్ తోనే పలు చిత్రాలు అలరించాయి. ఇక భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు చిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం అందించింది. భారతదేశంలోని సూపర్ స్టార్స్ లో తనదైన బాణీ పలికించిన అమితాబ్ నిస్సందేహంగా ఓ చరిత్ర. భావితరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్ర అది. దానిని పఠించకుండా మన భారత చిత్రసీమలో నటులుగా రాణించాలనుకోవడం అవివేకమే అవుతుంది.