NTV Telugu Site icon

రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్‌.. సర్వం సిద్ధం : శశాంక్‌ గోయల్‌

తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాద్ లో 6 టేబుల్స్, కరీంనగర్‌లో 9 టేబుల్స్, మిగితా చోట్లా 5 టేబుల్స్ చొప్పున కౌంటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా 25 ఓట్ల చొప్పున కౌంటింగ్‌ అధికారులు బండిల్స్ చేస్తారని, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లని కౌంట్ చేసిన తరువాత నెక్స్ట్ ప్రియరిటి ఓట్లని లెక్కిస్తారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రంలోకి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండవద్దని, ఫలితాలు వచ్చక ఇద్దరు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలి సూచించారు. ర్యాలీలకు అనుమతి లేదని, మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ పంచాయతీ రాజ్ డిపర్ట్మెంట్ అధికారులపై నాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు.