Site icon NTV Telugu

మూడు సినిమా థియేట‌ర్లు సీజ్. ఎక్కడంటే?

ఏపీలో థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని సినిమా థియేట‌ర్లపై జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ కొర‌డా ఝుళిపించారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాల‌ని తాహశీల్దార్‌ను ఆదేశించారు. పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా ప‌ర్యటించి, సినిమా థియేట‌ర్లను ఆయన త‌నిఖీ చేశారు.

ముందుగా పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను ప‌రిశీలించారు. ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాహశీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం భోగాపురం మండ‌లం గోపాల‌కృష్ణ థియేట‌ర్‌ను జేసీ త‌నిఖీ చేశారు. సినిమా టిక్కెట్లను అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేట‌ర్‌ను కూడా సీజ్ చేయాల‌ని జేసీ ఆదేశించారు. నెల్లిమర్ల లోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్ ను కూడా తనిఖీ చేశారు. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ఈ సినిమా హాలును కూడా సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో మూడు థియేట‌ర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

Exit mobile version