Site icon NTV Telugu

Top Headlinews @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాజ్యాంగం.. ఆపరేషన్ సింధూర్‌పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. రాష్ట్రపతి ముర్ము ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటానికి ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పహల్గాం దాడికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక, దృఢమైన ప్రతిస్పందన ఇదని, దీనితో మన సాయుధ దళాలు దేశాన్ని రక్షించడానికి ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందన్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట ప్రజా తీర్పు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ రెండు మండలాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ జరగడం ద్వారా ప్రజా తీర్పు వెలువడిందని అన్నారు. కూటమి బలపరిచిన టీడీపీ లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించడం ఆయా మండలాల ప్రజలకు ఆనందాన్ని కలిగించిందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల ప్రాంతంలో నామినేషన్లే వేయనీయకుండా దాడులు, బెదిరింపులు జరిగాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈసారి నియమావళి ప్రకారం నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ జరగడంతో.. మూడు దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయగలిగారని పవన్ పేర్కొన్నారు.

ఎన్డీయే కూటమి కృషితో పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యం అంతమైంది..
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. గతంలో కడపలో ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ అడ్డా అనిపించుకున్నాం.. ఇప్పుడు పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది అన్నారు. NDA కూటమి సమిష్టి కృషితోనే నేడు పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అన్న మాటను తుడిపేశాని వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనతోనే రాష్ట్రంలో సుపరిపాలలో భాగంగా తొలి అడుగు కార్యక్రమంలో అందరి మనసులు గెలుచుకున్నామని మంత్రి సవిత తెలియజేసింది. ఇక, పులివెందులలో కూడా సుపరిపాలలోని తొలి అడుగు కార్యక్రమం ఎన్డీయే కూటమి విజయానికి దోహద పడింది అని మంత్రి సవిత తెలిపింది. గత 40 సంవత్సరాలుగా పులివెందులలో ప్రజలు ఓటే వేయలేదు, నేడు ధైర్యంగా వచ్చి ఓటు వేశారన్న ఆనందం అక్కడి ఓటర్లలో క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా పులివెందులలో టీడీపీ విజయం సాధించి.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయ్యేలా చేస్తామని హెచ్చరించింది.

పులివెందులలో గెలుపు, ప్రజా తీర్పు ఎలా అవుతుంది..?
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కో రోజా ఎక్స్ వేదికగా స్పందించింది. గడిచిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 62 శాతం ఓటు శాతం సాధించింది.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో 62 శాతం ఓట్లు సాధించిన పార్టీకి, వైఎస్ జగన్ అన్నకు అనుకూల వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటో? అని రోజా ప్రశ్నించింది. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల గాలి వీచిన సమయంలో.. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీ 24 శాతం ఓట్లు సాధించింది అని ఆర్కే రోజా తెలిపింది. అలాంటి పార్టీకి ఎన్నికల హామీలు అమలు చేయకుండా, పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టిన.. ప్రతికూల పరిస్థితుల్లో 88 శాతం ఓట్లు రావడం ఏమిటో? అని అడిగింది. అలాగే, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు వరుసగా 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం అనుమానాలకు దారి తీస్తుంది అన్నారు.

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని తెలిపారు. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని.. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉందని ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 71 వేల 977 దొంగ ఓట్లు..!
రాయబరేలి రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికకు సిద్ధమా? అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకించింది.. కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈవీఎంలకి మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్.. ఓడితే రాంగ్ అంటున్నారు.. రాజీవ్ గాంధీ ఆలోచన ప్రోగ్రెస్, రాహుల్ గాంధీ ఆలోచన డిస్ట్రక్టివ్ అని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని.. బంగ్లాదేశ్ అక్రమ వలస దారులను గుర్తించి ఓటు తీసేస్తారనే భయపుట్టుకుందన్నారు. రాహుల్ గాంధీ గెలిచిన రాయబరెలిలో 2 లక్షల ఓట్లపై అనుమానం ఉందని.. 71 వేల 977 ఫేక్ ఓటర్స్ ఉన్నారనన్నారు ఎంపీ రఘునందన్‌రావు. 92 వేల 447 మాస్ ఓటర్ నమోదు చేశారని… 54 వేల ఫేక్ బర్త్ డే సర్టిఫికేట్‌లు పెట్టారని ఆరోపించారు. వయనాడ్, డైమండ్ హార్బర్ నియోజక వర్గాలపై కూడా అనుమానం ఉందన్నారు.

ఆపరేషన్ సింధూర్ హీరోలకు మెడల్స్..
భారతదేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన దేశ భద్రతా దళాల సైనికులను వారి అసాధారణ ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గుర్తింపుగా వారిని కేంద్రం సత్కరించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ‘యుద్ధ సేవా పతకం’, 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులు లభించాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారతదేశం పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న యుద్ధ పైలట్‌లు సహా 9 మంది అధికారులకు ‘వీర్ చక్ర’ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులు భారతదేశ మూడవ అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం. అవార్డులు పొందిన అధికారులు పాకిస్థాన్‌లోని మురిడ్కే, బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు చేశారు. దీనితో పాటు వారు పాకిస్థాన్ సైనిక ఆస్తులకు కూడా భారీ నష్టం చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత వైమానిక దళం కనీసం ఆరు పాకిస్థాన్ విమానాలను కూల్చివేసింది.

బీహార్ ఓటర్ల జాబితాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. నెక్ట్స్ హియరింగ్ ఎప్పుడంటే..
సుప్రీంకోర్టు గురువారం బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. 22 లక్షల మంది మరణించినట్లయితే బూత్ స్థాయిలో దానిని ఎందుకు బహిర్గతం చేయలేదని ఈసీని ప్రశ్నించింది. పౌరుల హక్కులు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉండాలని తాము కోరుకోవడం లేదని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను, వారి తొలగింపునకు గల కారణాలతో ఈనెల 19లోపు బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నాం. గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారు” అని పేర్కొంది. ఈసీ వాదనలు విన్న అనంతరం.. అన్ని బూత్ స్థాయి, జిల్లా స్థాయి అధికారుల నుంచి నివేదికను తీసుకొని దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది జాబితాను స్థానిక వార్తాపత్రికలు, దూరదర్శన్, రేడియో లేదా ఏదైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

అదో చెత్త పదం.. ‘ఓట్ల చోరీ విధానం’పై స్పందించిన ఈసీఐ..
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్‌కి చెందిన నేతలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. 1951-52లో భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి “ఒక వ్యక్తి, ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఈసీఐ నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు రుజువు ఉంటే.. ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్‌తో కమిషన్‌కు సమర్పించాలని పోల్ బాడీ పేర్కొంది. ఓటర్లను ఆధారాలు లేకుండా “దొంగలు” అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

పాక్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్.. భారత్‌ను దృష్టిలో పెట్టుకొనేనా..?
పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్ రానున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యంలో కొత్తగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి అత్యాధునిక టెక్నాలజీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ క్షిపణుల దెబ్బతిన్న తర్వాత పాక్ కొత్తగా తన సైనిక దళంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. పాకిస్థాన్ సైనిక దళంలోకి కొత్తగా రానున్న రాకెట్ ఫోర్స్ గురించి ఆ దేశ సైనికాధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దీనికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఇదే చూసుకొంటుందని పేర్కొన్నారు. ఈ రాకెట్ ఫోర్స్‌ను ఇండియాను దృష్టిలో ఉంచుకొనే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనే స్వయంగా మీడియా సంస్థకు వెల్లడించారు.

సరికొత్త ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’?
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో వచ్చే భారీ బడ్జెట్ సినిమాలు ఎంత క్రేజ్ సంపాదిస్తాయో, అదే తరహా ఉత్సాహాన్ని కొన్నిసార్లు చిన్న సినిమాలు కూడా అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌తో కానీ, కొత్త కాన్సెప్ట్‌లతో కానీ, సహజమైన కథా నేపథ్యంతో కానీ వచ్చినప్పుడు ఈ చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఇటీవల OTTల హవా పెరుగుదలతో పాటు థియేటర్లలో కూడా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు మద్దతు పెరుగుతోంది. ఈ తరహా హవాలోనే మరో కొత్త, విభిన్నమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి టాలీవుడ్ సినిమాలకు సంబంధించి పార్వతి దేవదాసుల ప్రేమకథకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సారి.. కొత్తగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ అనే సరికొత్త టైటిల్‌తో ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట రామకృష్ణ దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా నటిస్తుండగా, రాశీ సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. రఘు బాబు, కసిరెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతంరాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రజిత వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది ఈ చిత్ర బృందం.

సంజు శాంసన్.. వర్కౌట్‌ కాదు! యాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026 కోసం మరికొద్ది రోజుల్లో ఆటగాళ్ల ట్రేడింగ్‌ ప్రక్రియ ఆరంభం కానుంది. ప్రస్తుతం సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్‌ల గురించే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను అశ్విన్‌, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను శాంసన్ వదిలేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ‘కుట్టి స్టోరీస్‌’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఐపీఎల్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. తాజాగా సంజు శాంసన్ ట్రేడింగ్‌పై అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేకు శాంసన్ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నాడు. ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘సీఎస్‌కే, ఆర్ఆర్ ట్రేడ్ వర్కౌట్‌ కాదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకవేళ సీఎస్‌కేకి సంజు శాంసన్‌ను ట్రేడింగ్‌ చేసి.. ఆర్ఆర్ ఇతర జట్లతోనూ ట్రేడ్‌ చేయడానికి ప్రయత్నిస్తే తమకు కావాల్సిన ప్లేయర్స్ దక్కడం కష్టం. రాజస్తాన్‌కు రవి బిష్ణోయ్‌ లాంటి మంచి స్పిన్నర్‌ అవసరం. అందుకు లక్నోను అప్రోచ్ కావాలి. లక్నో ప్రాంచైజీ సంజును తీసుకొని బిష్ణోయ్‌ను ఇస్తే ఎల్‌ఎస్‌జీ పర్స్‌పై భారీగా ఎఫెక్ట్ పడుతుంది. సీఎస్‌కే ఇలాంటి ట్రేడింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపదు. రవీంద్ర జడేజా, శివమ్‌ దూబెను సీఎస్‌కే అస్సలు వదులుకోదు. ట్రేడింగ్‌ వలన రాజస్తాన్‌కు ప్రయోజనం ఉండకపోవచ్చు’ అని చెప్పాడు.

Exit mobile version