NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

6 గంటలకే “కెప్టెన్ మోదీ”తో ఆట మొదలు.. జైశంకర్ నోట క్రికెట్, ఆర్ఆర్ఆర్..

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పనితనంలో ది బెస్ట్ ఫారన్ మినిస్టర్ అనిపించు కుంటున్నారు. ఎలాంటి వేదికైనా, ఏ దేశం అయినా భారత్ విషయంలో ప్రశ్నిస్తే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో సమర్థవంతమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మరింతగా పెంచారు. జైశంకర్ ను ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే ఎవరైనా ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అలాంటి వాక్చాతుర్యం ఆయన సొంతం.ఇదిలా ఉంటే శుక్రవారం విదేశాంగ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ థింక్-ట్యాంక్ ఈవెంట్ రైసినా డైలాగ్‌లో జైశంకర్ మాట్లాడారు. క్రికెట్ పరిభాషను ఉపయోగిస్తూ ఆయన ప్రధాని మోదీ ప్రభుత్వం, ఆయన పనితీరును వివరించారు. భారతదేశం, యూకే మధ్య సంబధాలను వివరిస్తూ ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి యూకే మాజీ ప్రధాని టోనీబ్లెయర్, మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా పాల్గొన్నారు.

పట్టాభికి బెయిల్ మంజూరు.. కండిషన్స్ అప్లై

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కి ఊరట లభించింది. పట్టాభికి బెయిల్ ఇచ్చింది స్పెషల్ కోర్టు. పోలీసు కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేశారు న్యాయమూర్తి. 25వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు జామీనులతో బెయిల్ మంజూరైంది. అయితే, మూడు నెలల పాటు ప్రతీ గురువారం కోర్టుకు హాజరు కావాలలని నిబంధన విధించింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయరాదని, విచారణకు సహకరించాలని జడ్జి ఆదేశించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం, అనంతరం చోటుచేసుకున్న ఘర్షణల కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్‌ 15-ఎ సబ్‌ సెక్షన్‌ 3, 5 పొందుపరచడానికి గల కారణాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫిబ్రవరి 20న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి మరో 13 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. పట్టాభిని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు సీఐని కులం పేరుతో తిట్టారని పట్టాభిపై ఆరోపణలు ఉన్నాయి.

2024 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?

2024 ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయో జోస్యం చెప్పారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో కొండాలమ్మ దేవస్థానం ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న కొండాలమ్మ దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని త్వరలోనే పేద ప్రజలకు ఉపయోగపడే కల్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు వచ్చేందుకు ప్రయత్నిస్తానని శాసనసభ్యులు కొడాలి నాని తెలియజేశారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ 151 సీట్లకు పైనే విజయం సాధిస్తుందన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చిన కేవలం 18 స్థానాల్లో మాత్రమే పోటాపోటీ పోరు జరుగుతుందని… మిగతా స్థానాలలో ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలవడం జరుగుతుందని తెలిపారు. విశాఖలో పెట్టుబడిదారులతో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ విధమైన రాయితీలు అందించడం జరుగుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి వ్యాపారవేత్తలకు వివరించడం జరుగుతుంన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్రంలో భారీగా వ్యాపార సంస్థలు ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఆటో రిక్షాలో వచ్చి ఆశ్చర్యపరిచిన అమెరికా విదేశాంగమంత్రి

ఇండియా ఈ ఏడాది జీ20 సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ‘క్వాడ్’ సమావేశం కూడా శుక్రవారం జరిగింది. కాగా ఢిల్లీలో జరగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. తాను ఆటోలో వచ్చిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన అమెరికా, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని అమెరికా కాన్సులేట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మా సిబ్బందిని కలవడం ఆనందంగా ఉందని బ్లింకెన్ ట్వీట్ చేశారు. నా పర్యటన భారత్-యూఎస్ భాగస్వామ్య శక్తిని తెలుపుతుందని, ఇండో-పసిఫిక్ ను రక్షించడంలో మా ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం ఆతిథ్యానికి ధన్యావాదాలు తెలిపారు. భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాల్లో భాగస్వామి కావడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆవిష్కరణకు దక్కిన గౌరవం

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ 1000 మందిలో 10 మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో (కంజెనిటల్ డిజీసస్) పుడుతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలలో 25శాతం, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (VSD) కు సంబంధించిన లోపాలే ఉంటాయి. ఈ వ్యాధిలో గుండె యొక్క రెండు దిగువ గదుల (వెంట్రిక్స్) మధ్య ఉన్న రంధ్రం ఉంటుంది. వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ తో జన్మించిన పిల్లలు గుండె వైఫల్య లక్షణాలతో ఉండటం మాత్రమే కాకుండా ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస తీసుకోవడంలో సమస్య మరియు బరువు పెరగడం వంటివి వారిలో కనిపిస్తుంటాయి. చికిత్స పొందని పిల్లలు తరచుగా న్యుమోనియా, పల్మనరీ హైపర్‌టెన్షన్ (అధిక ఊపిరితిత్తుల రక్తపోటు) మరియు గుండెకు ఇన్ఫెక్షన్ (ఎండోకార్డిటిస్) వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ తీవ్రమైన సమస్యలు గణనీయమైన అనారోగ్యం మరియు మరణాలకు దారి తీయవచ్చు.దాదాపు 60శాతం వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ లు 3-5 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వాటంతట అవే మూసుకుంటాయి. ముందస్తుగా రోగ నిర్ధారణ అయిన మరియు తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు 3-6 నెలల మధ్య వయసులో శస్త్రచికిత్స ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయినప్పటికీ, ఓపెన్-హార్ట్ సర్జరీ యొక్క సమస్యలు ఎల్లప్పుడూ సమస్యగా ఉంటాయి. ట్రాన్స్‌కాథెటర్ పరికర మూసివేత గా పిలువబడే మినిమల్లీ ఇన్వేసివ్ విధానాన్ని కనుగొనడం అవసరమయింది. 2000 ప్రారంభంలో (2002-2007) వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ లను మూసివేయడానికి ఈ ప్రక్రియ ప్రసిద్ధి చెందింది, అయితే దాని ఉపయోగం నుండి వైదొలగడానికి దారితీసే హార్ట్ బ్లాక్ వంటి తీవ్రమైన సంక్లిష్టత ఏర్పడింది. ఎంప్లాట్జర్ ఆక్లూడర్‌ అని పిలువబడే ప్రారంభ పరికరాలు గుండె యొక్క విద్యుత్ ప్రసరణ వ్యవస్థపై బిగింపు శక్తి మరియు కోత ఒత్తిడిని కలిగించాయి. అందువల్ల FDA మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది.

దేశంలోనే ఏపీ సమ్ థింగ్ స్పెషల్

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రముఖమయినదని కొనియాడారు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ. విశాఖ‌లో నిర్వహిస్తున్న గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ‌డ్కారి పారిశ్రామిక‌వేత్తల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో అభివృద్ధి విషయంలో మీతో సంభాషించడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు మార్చాలనే ప్రధానమంత్రి కల, అది రాష్ట్ర అభివృద్ధితో మాత్రమే సాధ్యమవుతుంద‌న్నారు. ఈ స్ఫూర్తి వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం సబ్‌కా సత్ సబ్‌కా వికాస్ సబ్‌కా ప్రయాస్ అన్నారు. మనకు మూలధన పెట్టుబడి లేకుండా ప‌రిశ్ర‌మ‌లు రావు. మేము ఉపాధి సామర్థ్యాన్ని సృష్టించలేము. ఉపాధి సంభావ్యత లేకుండా మనం పేదరికాన్ని నిర్మూలించలేం. వృద్ధిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఉపాధి సామర్థ్యాన్ని సృష్టించాలి. ఉపాధి లేకుంటే పేదరికాన్ని నిర్మూలించలేమన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నుంచి ఏపీ అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 975 కిలోమీట‌ర్ల సముద్ర మట్టాన్ని కలిగి ఉంది. ఇప్పటికే 240 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ కలిగిన 6 పోర్ట్‌లు, 4 కొత్త పోర్ట్‌లు అభివృద్ధిలో ఉన్నాయి. రాష్ట్రంలో 3 పోర్ట్‌లు లీడ్ క్యారీ డాక్స్ ఉన్నాయి. ఈ రోజు నేను అన్ని ఓడరేవులను మేజర్ పోర్ట్, స్టేట్ పోర్ట్, ప్రైవేట్ పోర్ట్ అని ప్రకటించబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన 4 లేన్ నేషనల్ హైవేతో పోర్ట్‌ను కనెక్ట్ చేయాలని నా మంత్రిత్వ శాఖ నిర్ణయించింద‌ని తెలిపారు.

ట్రాక్టర్ పై దయ్యం.. ఆటోమేటిక్ గా స్టార్ట్

ప్రస్తుతంలో సోషల్ మీడియాలో ఓ ట్రాక్టర్ చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన వీడియో గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కారణం ఓ షాపుముందున్న ట్రాక్టర్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అంతటితో ఆగకుండా దుకాణంలోకి చొచ్చుకెళ్లడం. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ షాపు ముందు ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. షాపు లోపల సిబ్బంది ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో షాపు బయట పార్క్ చేసి ఉన్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే ఆటోమెటిక్‌గానే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంతటితో ఆగితే బాగుండేది. కానీ అది ఆన్ అయినప్పుడు గేర్‌లో ఉండటంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. షాపు మెట్లు అడ్డం వచ్చినా అవేవి దాన్ని ఆపలేకపోయాయి. ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. తక్కువ స్పీడ్‌లోనే ఉండడంతో దుకాణం అద్దాలు కొద్దిసేపటి వరకు ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పెరిగింది. దీంతో దుకాణం అద్దాలు కూడా పగిలిపోయాయి. అలాగే అద్దాలను పగలకొట్టుకుని ముందుకొచ్చిన ట్రాక్టర్‌ను మరో మెట్టు అడ్డు పడింది. అంతలోనే దుకాణంలోంచి బయటికి పరుగెత్తిన సిబ్బంది ఒకరు.. ట్రాక్టర్ బ్రేకుపై చేయి వేసి ఆపడం జరిగింది. అంతలోనే మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశాడు. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్

Charan

ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ పేరే మారుమ్రోగిపోతోంది. నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్లి అక్కడ కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డు ఒక్కటే మినహాయింపు.. మిగతా అన్ని అవార్డులు అన్ని మన ఆర్ఆర్ఆర్ సొంతమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా ఈ సినిమాను మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించిన విషయం తెల్సిందే. ఈ వేడుక‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ద‌ర్శ‌క దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీరవాణి, సూపర్ – టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసాకా అక్కడ ఉన్నవారందరూ..స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చి గౌరవించారు. ఒక తెలుగు సినిమాకు ఇంత పెద్ద గౌరవం దక్కడం చాలా అరుదు అని చెప్పాలి. ఇక అక్కడ అభిమానులు చూపిన ప్రేమకు రామ్ చరణ్ మంత్రముగ్దుడయ్యాడు. ఈ సందర్భంగా చరణ్.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.