NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల


జేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేతలు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యాత్రకు వచ్చే ఆదరణ చూడలేకే బీఆర్‌ఎస్ దాడులకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నేతపై దాడి, భూపాలపల్లి సభపై దాడి వారి అరాచకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మాపై దాడులు చేస్తే బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వస్తున్నారని తెలుసుకుని డంపింగ్ పనులు ఆపేశారని ఆయన విమర్శించారు. అనుమతులకు మించి ఇసుక తరలింపు జరుగుతుందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ధ్వజమెత్తారు.

ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ బంగ్లాలను పేల్చేస్తాం

ఇటీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్‌లో బాంబు ఉందని భయపట్టే కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. మంగళవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు.ఇది చిలిపి పని కావచ్చునని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భారతదేశం, విదేశాలలో అత్యున్నత Z+ భద్రత కల్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. భద్రతకు అయ్యే ఖర్చును అంబానీలు భరిస్తారు. గతంలో ముకేష్‌ అంబానీ, ఆయన కుటుంబసభ్యులకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అఫ్జల్ అనే వ్యక్తి ఈ ఉదయం ముంబైలోని గిర్గావ్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూణ్నాలుగు సార్లు బెదిరింపు కాల్‌లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్ చేసిన ఫోన్ నం బర్‌ సాయంతో నిందితుడిని గుర్తిం చినట్లు వెల్లడించారు. ఫోన్‌ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

జీవో 59పై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం జీవో 59ని సవరిస్తూ మరో జీవో జారీ అయింది. కట్ ఆఫ్ డేట్ ఎత్తివేసింది.ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని ఉంటున్న వారికి, ULC సర్ ప్లస్ లాండ్ క్రమబద్ధీకరణ కోసం జీవో 59 ని 2014లో తీసుకొచ్చింది ప్రభుత్వం.. జూన్ 2, 2014 ను కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది సర్కార్… తాజాగా దానిని ఎత్తివేసి ఏ రోజు దరఖాస్తు చేసుకుంటే అదే రోజును కట్ ఆఫ్ డేట్ గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీలో కొత్తగా ఆరుమండలాల ఏర్పాటుకి నోటిఫికేషన్

ఏపీలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్ , రూరల్ మండలాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.మచిలీపట్నం మండలాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1-19, 40 వార్డులు సహా 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్ మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. బందరు రూరల్ గ్రామం సహా 12 గ్రామాలు, మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 20-39 వార్డులను మచిలీపట్నం సౌత్ మండలంగా నిర్ధారిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ.మండలాల విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్లోని అభ్యంతరాలను, సలహాలు, సూచనల్ని 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్ కు తెలియ చేయాల్సిందిగా కోరింది ప్రభుత్వం.

మార్చి3 నుంచి 5 వరకూ కిసాన్ ఆగ్రి షో

హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షోకు ఆతిథ్యం ఇస్తోంది. కిసాన్​ ఆగ్రి షోను ప్రారంభించనున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. మార్చి 3 నుంచి 5 వరకు కొనసాగనుంది ఎగ్జిబిషన్​. 150 మందికిపైగా ఎగ్జిబిటర్లు.. 30 వేల మంది విజిటర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద ఆగ్రి షో “కిసాన్“ హైదరాబాద్​ లో జరగనుంది. ‘‘కిసాన్” ఆగ్రి షో హైదరాబాద్​లోని​ హైటెక్స్​లో మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నది. ఈ ఎగ్జిబిషన్​ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రారంభించనున్నారు.  ఇప్పటికే ఈ ఆగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈసారి నిర్వహించడం 32వసారి. ఈ ‘‘కిసాన్​’’ ఆగ్రి షో ఎగ్జిబిషన్​ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.గతంలో నిర్వహించిన ఆగ్రి షో ఎగ్జిబిషన్​లకు అన్ని వర్గాల నుంచి చాలా మంచి స్పందన లభించింది.

వైసీపీని నడిపిస్తోంది ఐ ప్యాక్ టీమే

అధికార వైసీపీపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కొన్ని చోట్ల బీజేపీకి అభ్యర్థులు లేరు.. కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి.అందుకే వైసీపీ అభ్యర్ధులను ఓడించాలని పిలుపిస్తున్నాం.విశాఖలో ఆందోళన కలిగించే రీతిలో పెట్టుబడుల సదస్సు.విశాఖే రాజధాని అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారన్నారు.విశాఖలో పెట్టుబడిదారుల కోసం వాహానాలు కూడా ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోతోంది.పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.విశాఖ నుంచి తరలివెళ్లిన పరిశ్రమలను తిరిగి తెచ్చి ఆ తర్వాత పెట్టుబడుల సదస్సు పెడితే బాగుంటుంది.దమ్ముంటే 175 సెగ్మెంట్లల్లో రోడ్లు వేయమనండి.175 నియోజకవర్గాలకు ఐ ప్యాక్ లేకుండా రమ్మనండి.రోడ్ వేయాలన్నా ఐ ప్యాక్ టీమే చెప్పాలి.వైసీపీని నడిపిస్తోంది ఐ ప్యాక్ టీమే అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం అన్నారు. బందరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ‍ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా జనసేన కృషి చేస్తోంది.అందరిని సమానంగా చూడడమే జనసేన లక్ష్యం.ఎన్నో కష్ట నష్టాలను భరించి పవన్ నేతృత్వంలో జనసేన నడుస్తోంది.పార్టీ ఆవిర్భావం జరిగి 9 ఏళ్లు అయింది.. పదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం.

సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్

జీవితం ఎంతో విలువైనది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తోంది. అల్లారుముద్దుగా ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేయాలనీ ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఒక వయసు వచ్చాకా .. వయసు ప్రభావం వలన చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కసురుకుంటారు.. చదవమని బలవంతపెడతారు. చిన్నతనం నుంచి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని వారిని ఆ చదువు కోసం హాస్టల్ లో జాయిన్ చేస్తారు. కానీ, అక్కడ వారు పడే నరకం మాటల్లో చెప్పలేనిది. తెల్సిన వాళ్ళు ఉండరు.. ఎవరితో బాధను షేర్ చేసుకోవాలో తెలియదు.. ఇంటికి వెళితే.. నాన్న కొడతాడు.. హాస్టల్ లో ఫుడ్ సరిగ్గా ఉండదు.. ఏదైనా ఐతే పట్టించుకోని వార్డెన్.. చదువు.. చదువు .. అని వెంటపడే లెక్చరర్స్.. వీటన్నింటిని మించి అతడి విరిగిపోయిన మనస్సు.. తనకు అందరు ఉన్నారు అనే మాటను మర్చిపోయి.. ఈ బతుకు నాకొద్దు అనే మాటను మాత్రమే వినిపించేలా చేస్తోంది. ఆ డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకొనే విద్యార్థులు ఎంతోమంది.. తాజాగా సాత్విక్ అనే కుర్రాడు.. ఇదే బాధతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పుజరగలేదు

ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు. అవినీతిని ఆపడం వారి ఉద్దేశ్యం కాదని, ఢిల్లీలో చేసిన మంచి పనిని ఆపడం వారి ఉద్దేశం అని బీజేపీపై విమర్శలు గుప్పించారు. గతంలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలపై వ్యవహరించినట్లే ప్రస్తుతం ప్రధాని మోదీ, బీజేపీ ప్రతిపక్షాలను అణిచివేస్తోందని దుయ్యబట్టారు.సిసోడియా నివాసంలో గంటల తరబడి దాడులు చేసిన సీబీఐ అధికారులు రూ.10,000 కూడా రికవరీ చేయలేకపోయారని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటిలోగా ఆయన జైలు నుంచి విడుదల కాలేరా..? అని ప్రశ్నించారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఇంటింటి ప్రచారం చేస్తుందని ఆయన వెల్లడించారు. సిసోడియా దేశం గర్వించేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

ట్విట్టర్ డౌన్.. గంటల తరబడి పనిచేయని సైట్

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి పనిచేయలేదు. కొన్ని గంటల పాటు నెటిజెన్లు తమ ట్వీట్లను, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇలాగే ట్విట్టర్ డౌన్ అయింది. తాజాగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ అంతరాయాన్ని ఎదుర్కొంది. చాలాా మంది యూజర్లు ట్వీట్లను చూడలేపోయారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందం పనిచేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ డౌన్ డిటెక్టర్’ కూడా వందల కొద్దీ ఫిర్యాదులను చూపుతోంది. మొబైల్, డెస్క్ టాప్ రెండింటిలో కూడా ట్విట్టర్ డౌన్ అయింది. దీనిపై నెటిజెన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత ఇలా అంతరాయ కలగడం ఇది నాలుగోసారి.