Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

క్రైస్తవులు, ముస్లింలు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు.. కానీ హిందువులు మాత్రం..?
తమిళనాడు రాష్ట్రంలోని మధురై పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను 2014లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పార్టీ పెట్టినప్పుడు అనుకోలేదు‌.. ఈ లక్షల మంది ముందరా మాట్లాడుతానని అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అయితే, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ముస్లిం కూడా తన మతాన్ని గౌరవించుకుంటాడు.. కానీ, హిందువులు మాత్రం తమ మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరామని ప్రశ్నించారు. ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను.. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను, ఇది నా హక్కు అని పేర్కొన్నాడు. మీరు మా నమ్మకాన్ని అవమానించకండి.. మీ నమ్మకాన్ని మేము అవమానించడం లేదు కదా అని తెలిపారు. స్వయంగా ఆ శివపుత్రుడి వివాహం జరిగిన ఈ నేలను అపవిత్రం చేసేందుకు ఇప్పుడు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది.. ఇక్కడ పాలకులు కూడా ఆ శక్తులకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు.

జగన్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై టీడీపీ తప్పుడు ప్రచారం.. వైసీపీ ఫైర్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాద వీడియోపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చి రాజకీయ కుట్ర కోసం ఉపయోగిస్తున్నట్లు ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది ఎక్స్ వేదికగా. రాష్ట్రంలో పాలన, ప్రజా సంక్షేమం పట్ల కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది.. అందుకే, ఈ వీడియోను వైరల్ చేస్తూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్స్ పొలిటిక్స్ కు పాల్పడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా పేర్కొనింది. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వచ్చిన భారీ ప్రజా స్పందనను రావటాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది. వైసీపీ నాయకులను వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది. జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సమయంలో సింగయ్య అనే వ్యక్తి మరణం దురదృష్టకరం.. ఈ ఘటనపై మానవత్వంతో వ్యవహరించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారు.. అత్యంత బాధాకర రీతిలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని పేర్కొనింది.

యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే.. ఇది ఎవరికీ ఉపయోగపడలేదు..!
యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.. రాష్ట్రంలో ప్రజలంతా చూశారు.. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అంత తాపాత్రయ పడతారో అర్ధం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీలు ఇచ్చిందో అందరికి తెలుసు.. సూపర్ సిక్స్ పథకాల కోసం ఆలోచన లేదు కానీ రికార్డులు మీద శ్రద్ద ఉంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు ఇబ్బదులు పడుతున్నారని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే రెండు వేలు కట్ చేసి పథకాలు అమలు చేస్తున్నారు అని అమర్‌నాథ్ తెలిపారు. ఇక, ఎవరైనా ప్రశ్నించినా వారి నాలుక మందం అనే మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నోట వినడం సోచనీయం అని మాజీమంత్రి అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో యువత పోరు నిర్వహిస్తున్నాం.. కోటికి పైగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం.. రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు..
గొప్ప విజనరీ ఉన్న నేత, స్మితప్రజ్ఞశాలీ మోడీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. స్కాములకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రంత అవినీతి చరిత్ర.. ఎండ్లకు ఏండ్లు అవమాన పడి, కొట్లాడి, ఎదురునిలిచి త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. రేవంత్ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచారన్నారు.. దేశాన్ని ప్రపంచానికే విశ్వగురువుగా నిలబెట్టిన ఘనత మోడీదని కొనియాడారు. దేశం విశ్వగురువుగా ఎదుగుతుందని.. మోడీ అంటే దేశానికి నమ్మకమన్నారు. వర్క్ స్పీక్ ఎవ్రిథింగ్ అనే సూత్రానికి నిదర్శనం మోడీ అన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అడుగు జాడల్లో నడుస్తున్న నేత మోడీ అని.. కాలికి ముళ్ళు నాటితే నోటితే తీసే నాయకుణ్ణి ప్రజలు కోరుకుంటారన్నారు.

బీఆర్‌ఎస్ ప్రోగ్రాంలో “రప్పా రప్పా” ఫ్లకార్డులు.. మల్లు రవి రియాక్షన్..
వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అనంతరం.. బీఆర్ఎస్ కార్యక్రమంలో రప్పా.. రప్పా డైలాగ్ ఫ్లకార్డులపై మల్లు రవి స్పందించారు. “రప్పా రప్పా సినిమా డైలాగ్స్ చెప్తే రాజకీయలు నడుస్తాయి అనుకుంటే పెద్ద పొరపాటే.. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకి రప్పా రప్పా మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారు. వాళ్ళు ఇష్టం ఇచ్చినట్లు పరిపాలన చేశారు. ఇప్పుడు పగటి కలలు కంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు మీ పార్టీ ఏంటో తెలుస్తుంది.” అని మల్లు రవి వ్యాఖ్యానించారు.

ఆర్మీ కాలేజీలో చొరబడ్డ ఆగంతకులు.. టెర్రరిజం కోణంపై స్పష్టత ఇచ్చిన డీసీపీ..!
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్ లో మిలట్రీ ఆర్మీ ఏరియాల ఉన్నాయని.. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీడియా సంయమనం పాటించాలన్నారు. “ఈ కేసులో ఎలాంటి టెర్రరిజం కోణం లేదు. ఆశిష్ కుమార్ అనే వ్యక్తి బీహార్ వాసి ఇతన్ని విచారిస్తున్నాం. ఇతను హైదరాబాదులో వర్క్ చేస్తున్నాడు. ఆశిష్ గతంలో క్యాంటీన్ నడిపేవాడు. ఆశిష్ తో పాటు ఆర్మీ కాలేజ్ లో వచ్చిన ముగ్గురిని మోసం చేసి ఆర్మీ కాలేజ్ క్యాంటీన్లో ఉద్యోగం పెట్టిస్తాను అనీ ఆశిష్ చిట్ చేశాడు.

“చర్చలు జరిపేదే లేదు.. ఆయుధాలు విడిచి లొంగిపోండి..” మావోలకు అమిత్‌షా ఛాన్స్..
మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు కీలక నేతలు హతమయ్యారు. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో నెత్తురోడుతోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపేదే లేదని పునరుద్ఘాటించారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని సూచించారు. వర్షాకాలంలో కూడా నక్సల్స్​ ఏరివేత కొనసాగుతుందని వెల్లడించారు. మార్చి 2026లోగా నక్సలైట్లను నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. ఆయుధాలు వదలిన వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తామని వెల్లడించారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. “విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. నక్సల్స్​ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించామని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని ప్రశంసించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను వేగవంతం చేస్తామని తెలిపారు. తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్‌కు వస్తున్నానని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే అని కొనియాడారు. ఈ వేదిక మీదుగా అమిత్ షా నక్సల్స్‌కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని వెల్లడించారు.

ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మూసివేత..
ఇజ్రాయెల్, అమెరికా వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్‌ జలసంధిని మూసి వేయాలని నిర్ణమం తీసుకుంది. ఈ మేరకు ఇరాన్‌ పార్లమెంట్‌లో దీనికి ఆమోదం లభించింది. టెల్ అవీవ్, యూఎస్ పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్‌ జలసంధి ద్వారానే రవాణా జరుగుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్‌ మధ్య ఉన్న ఇరుకైన జలసంధి ఇది. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ రూట్ నుంచి రోజుకి 2 కోట్ల బారెళ్ల చమురు పలు దేశాలకు వెళ్తుంది. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి దిగుమతి అవుతోంది. ఇక, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) రవాణాకు కూడా అత్యంత కీలకం ఈ జలసంధి. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే అనేక దేశాలకు వెళుతుంది.

మా అణ్వాయుధాలను ఇరాన్‌కు ఇస్తాం.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలను నాశనం చేశామని అమెరికా పేర్కొంది. కానీ ఇరాన్ తమకు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు (సోమవారం) మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, అనేక దేశాలు తమ అణ్వాయుధాలను నేరుగా ఇరాన్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ పేర్కొన్నారు. అమెరికా దాడి తర్వాత, మెద్వెదేవ్ డోనాల్డ్ ట్రంప్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. శాంతిని ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ అమెరికాను మధ్యప్రాచ్యంలో యుద్ధంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా దాడిని ఆయన ప్రశ్నించగా, ఇరాన్ సైట్‌కు అతితక్కువ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోందని అన్నారు.

5 వికెట్లతో మెరిసిన బుమ్రా.. భారత్ కు స్వల్ప ఆధిక్యత..!
భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ లు సెంచరీలు చేసిన చివరిలో భారత బ్యాట్స్ మెన్స్ త్వరగా పెవీలియన్ చేరడంతో తక్కువ పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియాకు కేవలం ఆరు పరుగుల లీడ్ మాత్రమే లభించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో పోప్ 106 పరుగులతో సెంచరీ చేయగా.. హరి బ్రోక్ ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకొని 99 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అతనికి తోడుగా జెన్నిస్ మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 62 పరుగులు, జో రూట్ 28, కెప్టెన్ బెన్ స్టాక్స్ 20 పరుగులు, కార్స్ 22 పరుగులు, జోష్ టంగ్ 11 పరుగులతో రాణించారు. ఇక టీమిండియా బౌలింగ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా మరోసారి తన మార్క్ బౌలింగ్ ప్రదర్శించాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 83 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నెలకొల్చాడు. ఇక బూమ్రాకు తోడుగా ఐపీఎల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్లు తీసుకోగా, హైదరాబాద్ కి చెందిన స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు నెలకూల్చారు. ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోరాడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎక్కువగా డ్రా దిశగా కొనసాగుతోంది.

నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!
హీరో విజయ్ దేవరకొండ ఏప్రిల్‌లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో మాట్లాడుతున్న విజయ్, కొన్ని వేల ఏళ్ల క్రితం ట్రైబ్స్ ఎలా కొట్టుకున్నారో.. ఇప్పుడు కూడా అంతే పరిస్థితి కొనసాగుతోంది అనే విధంగా అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ అప్పుడే పలువురు గిరిజన సంఘాలు స్పందించి ఆయనపై విమర్శలు గుప్పించాయి. ట్రైబల్స్‌ను ఉగ్రవాదులతో పోలుస్తారా? అని ప్రశ్నిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నాకు తెలిసి, నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కానీ.. నేను ఎప్పుడూ ఏ తెగను, ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. భారతదేశ ప్రజలంతా ఒక్కటే అని నమ్మే మనిషిని. నేను మాట్లాడిన ట్రైబ్ అనే పదాన్ని వేరే అర్థంతో వాడాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి. నేను శాంతి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను” అంటూ క్లారిటీ ఇస్తూ క్షమాపణలు తెలిపారు.

Exit mobile version