Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రప్పా రప్పాపై పవన్ కౌంటర్.. బరిలోకి దిగి చూపించు.. జగన్ కు సవాల్
ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు అని ప్రశ్నించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఇక, నరికేస్తాం చంపేస్తాం అనేవి మధ్య యుగం నాటి మాటలు.. ఇప్పుడు అలా మాట్లాడితే శిక్షిస్తామన్నారు. అలాగే, నేనేం రెచ్చగొట్టేలా మాట్లాడటం లేదు కానీ.. నరికేస్తాం… చంపేస్తాం అనడం కరెక్టా? అని అడిగారు. వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాళ్ల మాటలకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక, వైస్ జగన్ తో పాటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీ నేతలను బరిలోకి దిగి చూపించమను అని జగన్ కు సవాల్ విసిరారు. అలా కాకుండా అనవసరంగా ప్రజలను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అవసర విషయాలపై నేను మాట్లాడొద్దనే కొన్నిసార్లు మౌనంగా ఉంటాను అని తెలిపారు. నేను మాట్లాడితే ఎలా ఉంటదో వైసీపీ నేతలకు తెలుసు అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఏపీలో P4పై ప్రత్యేక సర్వే.. ఆగస్టు 5 వరకు అధ్యయనం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 కార్యక్రమంపై ప్రత్యేక సర్వే చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12 ప్రశ్నలతో సర్వే నిర్వహించడానికి సిద్ధం అవుతుంది. గ్రామవార్డు సచివాలయ పరిధిలో సర్వే జరగనుంది. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఇతర ప్రాంతాల్లో ఎవరున్నారు అనే అంశంపై సర్వే చేయనున్నారు. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వం ఇస్తున్న పథకాల వివరాలపై ఆరా తీసే ఛాన్స్ ఉంది. కారు ఉందా, బైక్, టీవీ, ఫ్రిజ్, భూమి ఉన్నాయా అనే ప్రశ్నలు సర్వేలో అడగనున్నారు. అలాగే, ప్రత్యేక యాప్ సహాయంతో ఏపీ సర్కార్ సర్వే చేస్తుంది. భవిష్యత్ లో ఉద్యోగం కావాలా, బ్యాంక్ లోన్ కావాలా లేదా బిజినెస్ పెట్టుకుంటారా అంటూ ఇలా వివిధ ప్రశ్నలపై సర్వే చేయనున్నారు. వ్యవసాయ రుణాలు, ఆదాయ అభివృద్ధి కోసం ఏం కావాలి అనే అంశంపై కూడా ప్రశ్నించనున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆగస్ట్ 15వ తేదీ వరకు బంగారు కుటుంబాల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది.

లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వారంలో మూడు సార్లు కుటుంబ సభ్యులతో.. మరో 3 సార్లు లాయర్లతో ములాఖాత్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటి భోజనం రోజుకు ఒకసారి తీసుకు రావచ్చునని విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, మిథున్ రెడ్డికి వెస్ట్రన్ కమోడ్ తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక అటెండర్, తనకు అవసరమైన మందులు, టెలివిజన్, పెన్ను, పేపర్ లాంటి సౌకర్యాలను కల్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశాల్లో వెల్లడించింది. అయితే, ఈ ఉత్తర్వులు మిథున్ రెడ్డి తరఫున కోర్టును ఆశ్రయించిన పిటిషన్‌కి సంబంధించినవి కావడం గమనార్హం.

తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది..
తెలంగాణలో కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో సోషియో ఎకనామిక్, పొలిటికల్, క్యాస్ట్ సర్వే చేసిందన్నారు. సర్వే మొదలు పెట్టినప్పుడు అనేక సందేహాలు, అవసరం లేదని కొన్ని రాజకీయ పార్టీలు అన్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే చారిత్రాత్మక సర్వేగా దేశంలో నిలబడుతుంది.. పోస్ట్ క్యాస్ట్, ప్రీ క్యాస్ట్ సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాం.. రాహుల్ గాంధీ ఆలోచనను భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఒప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సర్వే ఆధారంగా త్వరలో దేశంలో కులగణన జరుగబోతోంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ సర్వే వారికి ఇచ్చి త్వరితగతిన పార్లమెంటులో మద్దతు కూడగట్టి బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయించేలా ఒత్తిడి తెస్తాం.. వంద మంది లోక్ సభ సభ్యులు, ఇతర పార్టీల సభ్యులను కలిసి బిల్ పాస్ కావడానికి వారి సహకారం తీసుకుంటాం.. ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వడం న్యాయమైంది.. సహేతుకమైనదని వారి మద్దతు కూడగడుతాం.. మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు.. దాని ప్రకారమే తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేశాము..

జగదీప్ ధన్కర్ రాజీనామా.. ఆ 305 నిమిషాల్లో ఏం జరిగింది..?
ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కొత్త రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాపై ఊహాగానాలు మొదలయ్యాయి. తీవ్ర రాజకీయ వాగ్వాదం కూడా జరుగుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:05 గంటల మధ్య ఆనారోగ్య కారణాలను చూపుతూ ధన్కర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఏం జరిగింది? అని తెలుసుకోవాలనే ఉత్కంఠ దేశ ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సాయంత్రం 4- రాత్రి 9:05 గంటల(305 నిమిషాలు) మధ్య ఏం జరిగింది? అనేది పూర్తిగా తెలియరాలేదు. ఇలాంటి పరిస్థితిలో, ధంఖర్ నిజంగా ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారా లేదా ఆయన రాజీనామాను తీసుకున్నారా అనేది ప్రశ్న. నిన్న రోజంతా రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత ధన్కర్ కు అకస్మాత్తుగా ఏమైంది అనేది మరో ప్రశ్న. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గత రెండేళ్ల పదవీకాలంలో ధన్కర్‌ను ప్రతిపక్షాలు తిట్టిపోశాయి. నేడు ప్రతిపక్షాలు అకస్మాత్తుగా ఆయనపై ప్రేమను కురిపిస్తున్నాయి.

బీహార్ ఓటర్ల జాబితా నుంచి 52 లక్షలకు పైగా పేర్లు తొలగింపు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. బీహార్ ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 52 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించబడుతుంది. ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. తొలగించిన పేర్లలో చనిపోయినట్లు నివేదించబడిన 18 లక్షల మంది ఓటర్లు, ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన 26 లక్షల మంది, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న 7 లక్షల మంది ఉన్నారని కమిషన్ తెలిపింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు ప్రజలు అభ్యంతరాలు తెలుపవచ్చని ఈసీ చెప్పింది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో భాగంగా పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోహింగ్యాలు, స్థానికేతరులు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటాన్ని గుర్తించారు. అయితే, ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కావాలని బీజేపీ ఓటర్లను తీసేస్తుందని ఆరోపించింది.

కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ రిలీజ్ కు దగ్గర పడుతోంది. జులై 31న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా జులై 31న ఎట్టి పరిస్థితుల్లో రాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జులై 28న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారికంగా అప్డేట్ రాలేదు. కానీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అలాగే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో హైప్ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. ఇప్పటి వరకు విజయ్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ లుక్, విజువల్స్, కంటెంట్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.

చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. రష్మీ సంచలన నిర్ణయం..!
యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటుంది. గతంలో సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నడుమ పెద్దగా క్రేజ్ కనిపించట్లేదు. సుధీర్ తో ప్రోగ్రామ్స్ చేస్తున్నా.. రావాల్సినంత హైప్ మాత్రం రావట్లేదు. అయినా సరే ఇప్పుడు వరుస ప్రోగ్రామ్స్ చేతుల్లో ఉండటం వల్ల బిజీగా గడుపుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. షాకింగ్ డెసీషన్ తీసుకుంది. కొన్ని రోజుల పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ‘పర్సనల్ లైఫ్‌, కెరీర్ విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినాలని లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కాబట్టి అందరూ నన్ను అర్థం చేసుకోండి. ఇంకా నేను చాలా ఇవ్వాల్సి ఉంది. దాన్ని తిరిగి ఇవ్వడానికి నాకు శక్తి కావాలి. దాని కోసం ప్రయత్నిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది ఈ బ్యూటీ. ఆమె చేసిన పోస్టు చూసిన ఆమె ఫ్యాన్స్.. ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంచలన నిర్ణయం.. జాతీయ క్రీడా బిల్లు పరిధిలోకి బీసీసీఐ..
భారత క్రీడా పరిపాలనలో భారీ మార్పు రాబోతోంది. ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీని పరిధిలోకి వస్తుంది. అంటే, ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా ఉన్న బీసీసీఐ ఇప్పుడు ఈ సంస్థ కిందకు వస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత అన్ని జాతీయ సమాఖ్యల మాదిరిగానే.. బీసీసీఐ కూడా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బీసీసీఐ 1926లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌లో చేరింది. అనంతరం అది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌గా మారింది. ఇది భారత ప్రభుత్వ భారత జాతీయ క్రీడా సమాఖ్య పరిధిలోకి రాదు. ఎందుకంటే.. బీసీసీఐ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ సంస్థ. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి గ్రాంట్స్ పొందదు. 2019 సంవత్సరం వరకు.. బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్య (NSF)గా పరిగణించలేదు. అయితే.. ఇది 2020లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి వచ్చింది.

Exit mobile version