Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే రైతు భరోసా..
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక, రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును.. వ్యవసాయాన్నీ పండగ చేయాలనేది మా ఆలోచన అన్నారు. రైతుల ఆశీర్వాదం లేకుంటే.. అధికార పీఠం మీద కూర్చోలేరు అని తేల్చి చెప్పారు. శాసన సభ అయిన.. వార్డు మెంబరుగా గెలవాలన్నా రైతుల మద్దతు అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

జైలుకు పంపాలనుకుంటున్నారు.. ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా కూడా పోలేదు..!
తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తమవైపు నుంచి చాలానే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష నేతలు ఆ భయంతో పారిపోయారని విమర్శించారు. నాలుగు గోడల మధ్య కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టు అంటే పారిపోయారని, లై డిటెక్టర్ పరీక్ష పెట్టమంటే మళ్లీ పారిపోయారు అంటూ ఘాటుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. తనపై అవినీతికి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కాదు.. ఒక్క పైసా కూడా పోలేదు అని చెప్పాను.. అయినా సీఎం చెప్పిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడుగుతున్నారు. ఆయనకు ఒక్కటే షో ఉంది అంటూ విమర్శల దాడి చేశారు. తాను ఈ నెల రోజులుగా విచారణలతోనే గడుపుతున్నానని, కానీ దీన్ని రాజకీయ కక్ష సాధింపు భాగంగా చూస్తున్నట్టు తెలిపారు. నేను నెల రోజులుగా ఉన్నాను. వేరే వాళ్లని కూడా జైలుకు పంపాలని చూస్తున్నారు. అధికారులకు నేను ఇదే చెప్పాను.. నన్ను కావాలంటే 15 రోజులు జైలులో పెట్టండి, రెస్ట్ తీసుకుని వస్తాను అని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీబీఐ విచారణపై మొహం మార్చుకుందని వ్యాఖ్యానించారు. అలాగే బీసీ గణనపై మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం తర్వాత తొలిసారి బీసీ జనాభా సేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. జనగణనలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ 11 ఏళ్ల పాలనపై బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సమయం తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగాలే కానీ తూతూ మంత్రంగా కాకూడదని హితవు పలికారు. అన్ని స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పారు.

రౌడీయిజం చేస్తామంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది..
ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ఏపీలో ఒక బూతం ఉంది.. అది మళ్లీ లేస్తే ఎలా ఉంటుందని భయపడుతున్నారు.. నేను ఒకటే చెప్పా.. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానని చెప్పా.. రాజకీయం అంటే తమాషా కాదు.. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వారి మీద వేయడం కాదు అని పేర్కొన్నారు. తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయ్ ని లేపేశారు.. బాబాయ్ గుండె పోటుతో చనిపోయాడని అంటే నేనూ నమ్మాను.. ఆ రోజు నేను దోషులను అరెస్ట్ చేసి, రికార్డులను సీజ్ చేసి ఉంటే మనం ఓడిపోయే వాళ్లం కాదు అని తెలిపారు. ఇప్పటికే బర్లీ, పొగాకును రూ. 12 వేలకు కొనమని చెప్పా.. అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు.

మమ్మల్ని ఒక్క 30 రోజులు ఫ్రీగా వదిలేయండి సీఎం గారు.. వాళ్ళ సంగతి చూస్తాం..
చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు.. నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి మైకులు కూడా లాక్కున్నారు.. ఇవన్నీ చంద్రబాబు మర్చిపోయాడు, రివెంజ్ తీసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదు.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చీము-నెత్తురు లేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకవైపు మేము వస్తే.. టీడీపీ వాళ్ళను ఊరు విడిపిస్తామని అంటున్నా, కనీసం రాష్ట్రంలో టీడీపీ నాయకులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు ఒక 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి, ఎవరు ఏం మాట్లాడతారో చూస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లను గత ఐదేళ్లు చెడగొట్టి పోయారు, వాటిని సీఎం సరి చేస్తున్నాడు అన్నారు.

ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు..?
జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు. కూటమి సర్కార్ కేవలం వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టడం, వైసీపీ కార్యకర్తలని అరెస్టు చేసే పనిలోనే బిజీగా ఉన్నారు. ఇక, కూటమి ప్రభుత్వాన్ని దేని గురించి అయినా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు అని మాజీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇక, తల్లికి వందనం అనే పేరుతో రూ. 13 వేల రూపాయలు వేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎంతమంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. మొన్న విజయ్ దేవరకొండకు లెజెండరీ కాంతారావు అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును విజయ్ కు అందజేసింది. దీనిపై విజయ్ ఇప్పటికే తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. నేను సాధించే ప్రతి అవార్డు ముందు వారికే సొంతం. ఆ తర్వాత నన్ను ఆదరిస్తున్న వారికి దక్కుతుంది. అంటూ రాసుకొచ్చాడు. ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ తల్లిదండ్రులు అవార్డును పట్టుకుని మురిసిపోతున్నారు. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో రాబోతున్నాడు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ హరిహర వీరమల్లు ఆ డేట్ కు వస్తే కింగ్ డమ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతి త్వరలోనే రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను!
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజనీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన రజినీకాంత్ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందని విష్ణుని కొనియాడారు. ఈ మేరకు విష్ణు మంచు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘కన్నప్ప’ చిత్రాన్ని రజినీకాంత్ గారు ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు. ‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను.. ఆ కల ఇప్పుడు నెరవేరింది.

సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆకట్టుకున్న లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ లోకల్ టీ20 లీగ్ మ్యాచ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ అద్భుత ఘనతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. స్పిన్నర్ అయిన రాఠి మ్యాచ్‌లో తన స్పిన్ మాయతో బ్యాటర్లను పూర్తిగా ముప్పతిప్పలు పెట్టాడు. వరుసగా ఐదు డెలివరీలలో ఐదు వికెట్లు తీసి రేర్ ఫీట్ నమోదు చేశాడు. దిగ్వేష్ రాఠి ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చాడు. అయితే అతని ఆటతీరు కన్నా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం అతని ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’. వికెట్ తీసిన ప్రతిసారీ అతను ఊహించదగిన సెలబ్రేషన్ చేస్తుండటంతో, పలుమార్లు జరిమానాలు కూడా చెల్లించాల్సి వచ్చింది. అయినా రాఠి తన పద్ధతిని మార్చకుండా ఆట పట్ల తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ అభిమానులను అలరించాడు.

Exit mobile version