హస్తినలో బిజిజీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పలు అంశాలపై కీలక భేటీలు
తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ విస్తరణతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం నాడు రాత్రి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్. కేబినెట్ విస్తరణలో కొత్తవారికి అవకాశమిస్తారా? లేక పాతవారినే కొనసాగిస్తారా? అనే దానిపై హైకమాండ్ స్పష్టత ఇవ్వనుంది.
నేడు వైసీపీలోకి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ఈరోజు (ఫిబ్రవరి 7) వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికి.. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు.
నేడు పోలీసు విచారణకు హాజరుకానున్న రాంగోపాల్ వర్మ.. కొనసాగుతున్న ఉత్కంఠ!
గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు రాంగోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేస్తూనే పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. కానీ, గతంలో ఆర్జీవీ పలుమార్లు పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల పోలీసుల నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించిన రాంగోపాల్ వర్మ 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని పోలీసులను కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాంగోపాల్ వర్మ శుక్రవారం పోలీసు విచారణకు హాజరుకానున్నారు. తాను ఇవాళ విచారణకు హాజరవుతానని విచారణాధికారి సీఐ శ్రీకాంత్‌కు ఆర్జీవీ సమాచారం అందించారు. అయితే ఈ రోజు ఆర్జీవీ విచారణకు వస్తారా? మళ్లీ డుమ్మాకొడుతారా? అనే విషయంపై అంతా ఉత్కంఠ నెలకొన్నది. దీనికి తెరపడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీనివాసుడి సర్వ దర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 58,908 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3. 23 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు.
నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అంతర్వేది ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
‘తండేల్’తో చైతు మరో హిట్టు ఖాతాలో వేసుకున్నట్టేనా!
ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం కొంచెం కృత్రిమంగా ఉందని, కాస్త ‘క్రింజ్’ ఫీలింగ్ ఇచ్చిందని కొందరు అభిప్రాయాలను తెలుపుతన్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని, నాగ చైతన్య మరోమారు నటన అందరిని ఆకట్టుకుందని చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అభిమానులు కొనియాడుతున్నారు.