NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు..
ఆంధ్రప్రదేశ్‌లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, భూకంపం థాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారినట్టు చెబుతున్నారు.. రాతనలోని దాదాపు 15 ఇళ్లకు బీటలు వారగా.. గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డుకు కూడా బీటలు వారినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఆ గ్రామాన్ని పరిశీలించారు.. అయితే, భూప్రకంపనల తీవ్రత ఏస్థాయిలో నమోదు అయ్యింది.. రిక్టర్‌ స్కేల్‌పై ఎంత మేర నమోదు అయ్యింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మార్చి 15 నుంచి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీడాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. అదేరోజు ఒక విలేజ్‌ క్లినిక్‌ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.. 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామన్న అధికారులు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీనికోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపారు.. ఇక, ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను దీనికోసం నియమించుకున్నామని తెలిపారు అధికారులు. ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామన్నారు.. 10,032 విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటారు. వీరితో పాటు ఒక సీహెచ్‌ఓ, 3–4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారు. విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామని వెల్లడించారు. అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్‌ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపారు. మందులకు, డయాగ్నోస్టిక్‌.. తదితర వాటి సరఫరాకు అంతరాయం లేకుండా వాటిని స్టాకులో కూడా ఉంచుతున్నామని.. రోగులకు అదించే సేవలను రియల్‌టైంలో నమోదు చేయడానికి టూల్స్‌ను ఏర్పాటు చేశామని.. పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌కూడా పూర్తిచేశామన్నారు..

సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్.. జగన్‌ పాలనే మా పబ్లిసిటీ..
సీఎం వైఎస్‌ జగనే బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీ.. ఏపీలో కల్పిస్తున్న వసతులే మా మంత్రం అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీద ఉన్న నమ్మకమే కారణంగా చెప్పుకొచ్చారు.. అందుకే సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీగా అభివర్ణించారు.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యంగా తెలిపారు.. పెట్టుబడిదారుల సదస్సు ఉద్యోగ కల్పన లక్ష్యంతో ముందుకు తీసుకోపోవడం జరిగిందని వెల్లడించారు.. ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. గత పాలకులు పేపర్లకే పరిమితం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై కూడా రాజకీయం చేస్తున్నాయని.. కానీ, అభివృద్ధి, సంక్షేమాన్ని మా ప్రభుత్వం రాజకీయం కోసం వాడలేదని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా అందరికి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.. ప్రతిపక్షాలు మూడు సార్లు సమ్మిట్లు పెట్టి ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో చర్చకి మేం సిద్ధం అంటూ సవాల్‌ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. కాగా, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో.. భారీగా పెట్టుబడులు రాబట్టకలిగింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. జీఐఎస్‌ వేదికగా కీలక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం.. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న కాలంలో రాష్ట్రంలో 6 లక్షల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నమాట.

నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. A2 నిందితురాలిగా ప్రియురాలు
అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య చేసిన హరిహర కృష్ణ.. హత్య చేసిన తర్వాత నిహారికకు వాట్సాప్‌లో ఫోటోలు పంపాడు. అంతేకాదు.. అదే రోజు రాత్రి సంఘటనా స్థలానికి నిహారికను తీసుకువెళ్లి, నవీన్ మృతదేహాన్ని హరిహర కృష్ణ చూపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నిహారికతో పాటు మిత్రుడు హసన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లాడు. నవీన్ మృతదేహాన్ని చూసిన అనంతరం.. హరిహర కృష్ణకు నిహారిక రెడ్డి కొంత మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసింది. అక్కడ కాసేపు ఉన్న ఈ ముగ్గురు.. తిరిగి తమతమ ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది. విస్తుగొలిపే ఈ విషయాలన్ని విచారణలో తేలడంతో.. A2గా నిహారికను, A3గా హసన్‌ను పోలీసులు చేర్చారు. కాగా.. నవీన్, హరిహర కృష్ణ, నిహారిక రెడ్డి ఇంటర్మీడియట్‌లో కలిసి చదువుకున్నారు. తొలుత కృష్ణ, నిహారిక ప్రేమించుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరమయ్యారు. అనంతరం నవీన్‌కి నిహారిక దగ్గరైంది. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ విషయం తెలిసి మండిపోయిన హరిహర కృష్ణ.. తన ప్రియురాలు దూరమవుతుందన్న భయంతో నవీన్‌ని హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. ఫిబ్రవరి 17వ తేదీన తన ఇంటికి వచ్చినప్పుడు.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నవీన్‌కు హాస్టల్‌కు డ్రాప్ చేయాలని బైక్ మీద బయల్దేరినప్పుడు.. నిహారిక రెడ్డి విషయమై ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే హరిహర కృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నవీన్‌ని పొడిచి చంపాడు. అనంతరం గుండె, చేతులు, పెదవులు, సీక్రెట్ భాగాలను సైతం కోశాడు. ఈ భాగాల ఫోటోలను నిహారిక రెడ్డికి వాట్సాప్‌లో పంపగా.. ‘గుడ్ బాయ్’ అంటూ నిహారిక రిప్లై ఇచ్చింది. అది చూశాకే పోలీసులు అనుమానం వచ్చి, నిహారిక కోణంలో దర్యాప్తు చేయగా.. పై సంచలన నిజాలు బయటపడ్డాయి.

వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు..!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర.. బిజినెస్‌ వ్యవహారాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను షేర్‌ చేస్తారు.. నవ్విస్తారు.. ఆలోచింపజేస్తారు.. ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటూ ఉంటారు.. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్లను మీరు తప్పకుండా చూసి ఉంటారు. తరచుగా అతను కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడతాడు. ప్రజలతో భవిష్యత్ అవకాశాలు మరియు అవసరాలపై సమాచారాన్ని షేర్‌ చేస్తారు.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ మంచి పనులు జరిగినా, వాటి గురించి అందరికీ చెబుతారు. ఆవిష్కరించే వారిని కూడా మెచ్చుకుంటాడు. ఈ సారి ఓ వీడియో షేర్ చేసి పాజిటివ్ గా మెసేజ్ ఇచ్చాడు. తాజాగా ఆయన చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. నీటిపై భయం, బెరుకు లేకుండా.. ఒక గుర్రం శరవేగంతో పరుగులు తీస్తున్న ఓ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర.. ఏ పని చేయాలన్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి… విశ్వాసం ఉంటే మీరు నీటిపై కూడా నడవవచ్చు.. అంతా మన సంకల్పంలోనే ఉంది.. మన మనసులోనే ఉంది.. సో, మీ కలసాకారం కోసం ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయండి.. అంటూ మండే మోటివేషన్‌ సందేశాన్ని ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

ప్రాణాలు విడిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ..
ట్రాన్స్‌జెండర్స్‌ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. రాజకీయాల్లోనూ తాము సైతం అంటూ అడుగుపెట్టారు.. అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా రికార్డు సృష్టించిన ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు కన్నుమూశారు.. న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బేయెర్ మరణించారు.. జార్జినా బెయెర్‌ వయస్సు 65 ఏళ్లు.. గత కొంత కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచారు. బేయెర్ స్నేహితులు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.. న్యూజిలాండ్‌కు చెందిన జార్జినా బేయర్, ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీగా.. మరియు ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నార్త్ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బేయెర్.. మొదట్లో సెక్స్‌వర్కర్‌గా జీవితాన్ని సాగించారు.. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్‌గా ఆకట్టుకున్నారు.. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కార్టర్‌టన్‌కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్‌ కూడా బేయరే కావడం విశేషం.. ఇక, 1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. రెయిన్‌బో కమ్యూనిటీకి సేవల కోసం 2020లో క్వీన్ ఎలిజబెత్ II ద్వారా న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో సభ్యురాలిగా పనిచేశారు.. ఆమె పౌర సంఘాలు మరియు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడంతో పాటు వ్యభిచారాన్ని నేరరహితం చేయడంలో ఆమె చేసిన కృషికి ప్రసిద్ది చెందారు. 2003లో వ్యభిచార సంస్కరణల అంశంపై పార్లమెంటు ముందు మాట్లాడుతూ.. “ఎప్పటికీ ఇవ్వని సమాజం యొక్క అమానవీయం మరియు కపటత్వం కారణంగా 20 ఏళ్లలోపు మరణించిన నాకు తెలిసిన వేశ్యలందరికీ నేను ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాను. ఆ పరిశ్రమలోకి వచ్చేలా చేసిన పరిస్థితులను రీడీమ్ చేసుకునే అవకాశం వారికి లభించింది అని పేర్కొన్నారు..

ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న హీరోయిన్
ప్రేమ.. ఎవరిని ఎప్పుడు ఒకటి చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి..ఇంకొన్ని ప్రేమలు వివాదాలతో ముగుస్తాయి. కానీ, ఇంకొన్ని ప్రేమలు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా జీవితాంతం హింసిస్తూనే ఉంటాయి. ఈ బాధకు తారలు సైతం అతీతం కాదు. తాజాగా ఒక హీరోయిన్ తన ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్నది.. అతడి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్ హీరోయిన్ అనికా విజయ్ విక్రమన్. చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించిన మెప్పించిన అనికా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన ప్రియుడు చేసిన అఘాయిత్యాన్ని ఏకరువు పెట్టింది. “నేను గతంలో అనూప్ పిల్లే అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అతడు ముందు బానే ఉన్నాడు. ఉన్నా కొద్దీ అతడిలోని రాక్షసుడును పరిచయం చేశాడు. మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అతడితో ఉన్న రోజులు అన్నీ నాకు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. అతడు ఇలా మారతాడని నేను కలలో కూడా అనుకోలేదు. అతడి నుంచి నేను ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు నన్ను వదలడం లేదు. మొదటిసారి నన్ను అతడు కొట్టినప్పుడు పిక్స్ ఇవి. ముఖం మొత్తం పగులకొట్టాడు. ఆ తరువాత వెంటనే నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. మొదటిసారని వదిలేసా.. కానీ, రెండోసారి కూడా అదే రిపీట్ అయ్యింది. అందుకే అతడి నుంచి దూరమయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేశా.. అయినా అతడి దగ్గర ఉన్న డబ్బుతో పోలీసులను మ్యానేజ్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరో వారం రోజులు తాను ఇన్స్టాగ్రామ్ కు రాలేనని.. అని చెప్తూ గాయాలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే
ఎట్టకేలకు మంచు మనోజ్ తన ప్రేమను నిలబెట్టుకున్నాడు. ప్రేమించిన మౌనికను ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ కే కాదు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. 12 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మౌనిక మొదటి పెళ్ళికి కూడా మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. మౌనికకు ఒక బాబు కూడా ఉన్నాడు. అతడిని కూడా మనోజ్ అంగీకరించాడు. వారిద్దరి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ నూతన జంట తిరుపతి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక దర్శన అనంతరం మనోజ్ తన ప్రేమ పెళ్లి గురించి, ఆ బాబుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. “ఎప్పటికైనా ప్రేమనే గెలుస్తోంది. ఇప్పుడు నా ప్రేమ కూడా గెలిచింది. అందరి ఆశీర్వాదాలు మాకు అందాయి. ఇక నేను పోస్ట్ చేసిన శివుని ఆజ్ఞ గురించి చెప్పాలంటే.. ఆ శివుడే వీరిద్దరిని నాకు అప్పగించాడు. నేను చేసిందేమి లేదు.. అంతా శివుడి ఆజ్ఞ.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే.. వారిని బాగా చూసుకోవాలి. నేను, మౌనిక ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నాం. ఇక నేను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాను. త్వరలోనే వాట్ ది ఫిష్ సినిమాపూర్తి కావొస్తోంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.