NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్‌ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు నిర్ధారణకు వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌ జగన్ చివరి నిమిషంలో చెప్పి షాక్‌లు ఇవ్వరు.. పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు జగన్ అని తెలిపారు సజ్జల.. అందుకే ముందుగానే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వారికి సంకేతాలు ఇచ్చారని.. అందుకే వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు.. ఇక, చంద్రబాబు నాయుడు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ. 20 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారని మాకు సమాచారం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాకున్న సమాచారం, విచారణ ఆధారంగానే ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ అభిప్రాయానికి వచ్చింది.. అందుకే సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

దేవుడు స్క్రిప్ట్‌ తిరిగి రాశాడు.. ఇక అన్‌స్టాపబుల్..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుకున్ని టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.. మంగళగిరిలో టీడీపీ జోన్ – 3 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగింది.. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కొట్టాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వారు మాకు ఓట్లేయరని ఆ పార్టీ నేతలే చెప్పేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మీద నమ్మకం లేదన్న ఆయన.. 23 సీట్లు అంటూ అవహేళన చేశారు. భగవంతుడు అదే స్క్ర్రిప్ట్ తిరిగి రాశాడు. ఇక మీదట టీడీపీ అన్ స్టాపబుల్.. గేరు మారుస్తాం.. స్పీడు పెంచింది.. సైకిల్ దూసుకెళ్తుంది.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తాం అన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా అనురాధ గెలిచింది.. నాగరిక సమాజంలో ఆడబిడ్డలను ఎవ్వరూ వేధించరు.. కానీ, అనురాధను వైసీపీ నేతలు వేధించారని మండిపడ్డారు చంద్రబాబు. తెలుగుదేశం మరిన్ని విజయాలు సాధించాలి.. దాని సైన్యం కావాలి. ఆ సైన్యం కార్యకర్తలే అన్నారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల 30 ఏళ్లు వెనక్కు వెళ్లాం. అప్పులు చేయడం.. రాష్ట్రాన్ని దోచుకోవడం.. ఇదే జగన్ పని అని ఆరోపించారు.. ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్థమైంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని.. జగన్ చేసిన అవమానాలను ఏపీ ప్రజలు భరిస్తున్నారన్నారు.. మా తిక్కల ముఖ్యమంత్రి రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ఆగిపోయింది.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అయితే.. బ్యారేజ్ కడతానని అంటున్నారు.. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ తరహాలో పోలవరం రూపంలో బ్యారేజ్ కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు.

ఇక ఆ ఎమ్మెల్యేలకు, పార్టీకి సంబంధం లేదు
ఇక, ఆ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.. నలుగురు ఎమ్మెల్యేలను బేరసారాలు చేసుకునే టీడీపీ అభ్యర్థిని బరిలో పెట్టిందని ఆరోపించిన ఆయన.. ఎమ్మెల్యేలను, మనుషులను సంతలో కొనుగోలు చేసినట్టు చేశారని ఫైర్‌ అయ్యారు.. తెలంగాణ లో కూడా ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఆఫర్ చేసి.. ఓట్లు వేయించుకున్నారు అని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఒక ఎమ్మెల్సీ గెలిస్తే.. డబ్బులు పెట్టి కొనటం వ్యూహం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు కుట్ర ఫలించింది.. ఎమ్మెల్యేలు సంతలో వస్తువుల్లా అమ్ముడు పోయి శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురైన వాళ్ళు రేపు బయటకు వచ్చి లబోదిబో మంటారు అని సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు క్షమకు అర్హులు కారన్న ఆయన.. ఓటును అమ్ముకుని దుర్మార్గానికి పాల్పడ్డారు.. ప్రొసీజర్ పాటించకుండా ఎందుకు సస్పెండ్ చేస్తారు అని కోటంరెడ్డి అనటం సిగ్గు చేటు.. పిలిచి బట్టలు పెట్టాలా? అంటూ ఫైర్‌ అయ్యారు. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్ లో ఇంకా ఎక్కువగా మాట్లాడతారు.. ఇక నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు, పార్టీకి సంబంధం లేదు.. వీళ్ళు వెళ్ళి చంద్రబాబు చంక ఎక్కవచ్చు అన్నారు. ఇప్పటికీ చెబుతున్నాం వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

డ్వాక్రా గ్రూప్‌ డబ్బులు నొక్కేసిన మహిళ..! స్తంభానికి కట్టేసి ఏం చేశారంటే..?
డ్వాక్రా సంఘం గ్రూపులో లోన్‌ తీసుకున్న మహిళలు.. నెలవారీగా వాయిదాలు చెల్లిస్తూ వస్తుంటారు.. అయితే, ఆ లోన్ సొమ్ములు బ్యాంక్ లో జమచేయకుండా ఓ మహిళ తానే వాడుకుంది.. ఈ విషయం కాస్తా గ్రూపులోని మహిళలకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చివరకు ఆమెను పట్టుకుని స్తంభానికి కట్టేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో దారుణం చోటు చేసుకుంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు సంబంధించిన సొమ్మును గ్రూపులోని నిద్ర పావని అనే మహిళ బ్యాంకుకి కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంది. గ్రూపులోని పదిమంది సభ్యులకు సంబంధించి సుమారు మూడు లక్షల రూపాయల వరకు పావని బ్యాంకుకు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతోంది. ఈరోజు గ్రామానికి పావని రావడంతో డ్వాక్రా మహిళలందరూ ఆమెను నిలదీశారు. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పట్టు పట్టడంతో పావని అందుకు సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన గ్రూపు మహిళలు పావనిని స్తంభానికి కట్టేసి తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పావని భర్త ఆమెను విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో, బాధిత మహిళలు అతనితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గ్రూప్ సభ్యుల డబ్బులు తీసుకుని సమాధానం చెప్పకుండా తిరుగుతున్న పావని తనపై తోటిసభ్యులు దాడి చేశారంటూ ఆస్పత్రిలో చేరింది.

ఆ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని.. వైసీపీ నేత ఆరోపణలు..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత.. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు దండా నాగేంద్ర కుమార్.. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై సంచనల ఆరోపణలు చేశారు.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుటుంబంతో నాకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్రావు ,అతని కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారన్న ఆయన.. గతం లో పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక వ్యవహారంలో నాతో ఎమ్మెల్యే శంకర్రావు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారు.. జేపీ సంస్థ ఇసుక అమ్ముతుందన్న అక్కసుతో నన్ను బెదిరించి, ప్రలోభ పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించారని తెలిపారు.. ఇప్పుడు ఇసుక కాంట్రాక్ట్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు రావడం తో NGTలో కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు.. నాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు భేఖాతరు చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద పెద్ద మిషనరీలతో ఇసుక తవ్వెస్తున్నారని ఆరోపించారు దండా నాగేంద్ర కుమార్.

సీఎస్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ.. యథావిథిగా ఉద్యమం..!
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్‌తో సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్ కార్డ్‌లు, 11వ వేతన సంఘం అంశాలపై చర్చించాం.. క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్ కావాలని అడిగాం.. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.. కానీ, పే స్కేల్‌ విషయంలో స్పష్టత రాలేదన్నారు.. వైద్యారోగ్య శాఖ రేషనలైజేషన్ లో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం.. గత సమావేశంలో ఇతర సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేసినట్టు చెప్పారు.. ఏపీ జీఎల్ఐ గత ఆరు నెలలుగా క్రెడిట్ కాలేదని చెప్పామని తెలిపారు సూర్య నారాయణ. ఇక, హెల్త్ కార్డ్‌కు ఉద్యోగి వాటా చెల్లించినా ఉపయోగం లేదన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. 104 టోల్ ఫ్రీ నంబర్ అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు.. క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్ కావాలని అడిగినట్టు తెలిపారు.. మరోవైపు ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులతో చర్చ జరిగింది.. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులలో అనేక ఇబ్బందులు ఉన్నాయని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.. పీఆర్‌సీ అరియర్స్ ఇంకా లెక్క కట్టలేదు అని చెప్పారు. పీఆర్‌సీ కమిషన్ రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఇవ్వలేదు. కరెస్పాండెన్స్ పే స్కేల్స్ ఇస్తున్నారు.. పలు అంశాలపై అవగాహనకు మాత్రమే ఈ మీటింగ్ పెట్టారని.. డీఏ అరియర్స్, పీఆర్‌సి అరియార్స్ ను వేరుగా చూడాలి.. మా ఉద్యమం యథావిథిగా కొనసాగుతుంది.. వచ్చే నెల 5వ తేదీన మరో సారి సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు .

నయా హిట్లర్‌లాగా నరేంద్రమోడీ
నరేంద్రమోడీ నయా హిట్లర్‌ లాగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం చూస్తే వణికిపోతున్నాడని ఆయన విమర్శించారు. అదానీ కుంభకోణం నుండి బయటపడటానికి రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకున్నాడని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ గతంలో మన్మోహన్‌ సింగ్‌ను పేరుపెట్టి అనేక రకాలుగా అవమానాలు చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం, వారి తండ్రి గురించి వ్యాఖ్యానం చేస్తూ రాహుల్‌ గాంధీ నెహ్రు పేరు ఎందుకు పెట్టుకొలేదని కామెంట్స్‌ చేసిన నరేంద్రమోడీ అదానీ కుంభకోణం నుండి బయటపడటానికే ఈ పద్ధతులకు పాల్పడుతున్నాడని సాంబశివరావు ధ్వజమెత్తారు. నెలరోజుల సమయం వుండగానే ఇంత హడావుడిగా రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటన చేయడమంటే ప్రజాస్వామ్యం అనే పదం పలికే అర్హత నరేంద్రమోడీ కోల్పోయాడని విమర్శించారు. ఇది నరేంద్రమోడీ కుట్రనేని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవిడ్ సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలి
యావత్‌ ప్రపంచాలని కొవిడ్ మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. కరోనా నాటి రోజులు గుర్తొస్తేనే గుండెల్లో వణుకుపుడుతుంది. కఠినమైన లాక్‌డౌన్‌లు, భౌతిక దూరాలు, వ్యాక్సిన్‌లతో కరోనా నుంచి ప్రపంచం బయటపడగలిగింది. ఆ సమయంలో జైళ్లు కూడా నిండిపోయాయి, దీంతో జైళ్లలోని ఖైదీలు కరోనా బారినపడకుండా.. తీవ్ర నేరాలు చేయనివారిని సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జైళ్ల నుంచి విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఆ ఖైదీలపై స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా కొవిడ్-19 కాలంలో హై పవర్డ్ కమిటీ ద్వారా అత్యవసర పెరోల్‌పై విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అత్యవసర పెరోల్ / మధ్యంతర బెయిల్‌పై విడుదలైన అండర్ ట్రయల్ ఖైదీలు, ఖైదీలు అందరూ 15 రోజుల్లో సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఖైదీలు అధికారుల ముందు లొంగిపోయిన తర్వాత మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. వారి దరఖాస్తులను చట్టం ప్రకారం పరిగణించాలని బెంచ్ స్పష్టం చేసింది. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత కోర్టుల్లో కూడా పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన అత్యున్నత కమిటీ సిఫారసుల మేరకు తీవ్ర నేరాలు చేయని వారిని, విచారణ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు.

ఆమెను అలా చూస్తుంటే అయ్యగారి వలన అయితలేదంట
అక్కినేని నట వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. దాదాపు రెండేళ్లు తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్.. ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలోని రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “ఏందే.. ఏందే.. ఏట్నో అయితాందే” అంటూ సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. ఇక ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ అందించాడు. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ సంజిత్ హెగ్డే, పద్మలత ఈ సాంగ్ ను ఆలపించి ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. అచ్చంగా తెలంగాణ యాసలో ఈ సాంగ్ ఉండడం విశేషం. ఇక విజువల్స్ అయితే అద్భుతమని చెప్పాలి. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లలో ఈ సాంగ్ ను షూట్ చేయడంతో రిచ్ లుక్ వచ్చేసింది. ఇక అఖిల్- సాక్షి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మొదటిసారి ప్రేమలో పడిన హీరో.. తన ప్రేయసికి తనలోని ప్రేమ భావాలను తెలుపుతున్నట్లు లిరిక్స్ వింటుంటే అర్ధమవుతోంది. అఖిల్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టగా.. సాక్షి సైతం అందాలను ఆరబోసి మెప్పించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అయ్యగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది. కన్నడ పరిశ్రమను కెజిఎఫ్ ఓ రేంజ్ లో నిలబెడితే .. కాంతార ఆ రేంజ్ ను సుస్థిరంగా మార్చింది. ఈ సినిమా తరువాత కన్నడ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక కాంతార సీక్వెల్ ఉంది అని చెప్పిన దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు సీక్వెల్ మొదలుపెడతారా..? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఉగాది నాడు రిషబ్ ఒక తీపి కబురు చెప్పుకొచ్చాడు. కాంతార 2 స్క్రిప్ట్ పనులు మొదలు అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు ఈ ఏడాది లోనే షూటింగ్ ముగించేస్తారు అనే ధీమా వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సీక్వెల్ కు రిషబ్ తీసుకుంటున్న పారితోషికమే ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తోంది. కాంతార సినిమాకు రిషబ్ కేవలం రూ. 5 కోట్లు మాత్రమే తీసుకున్నాడని టాక్ వినిపించింది. చిన్న సినిమా.. అంత పెద్ద సక్సెస్ అవుతుంది అని ఉహించక ఆ రేంజ్ రెమ్యూనిరేషన్ అందుకున్నాడని సమాచారం.ఇక దర్శకుడిగా, నటుడిగా కూడా ఒకే రెమ్యూనిరేషన్ తీసుకున్న రిషబ్.. కాంతార 2 కోసం కళ్ళు చెదిరే రెమ్యూనిరేషన్ పట్టేశాడని టాక్. ఒకట్లలో కాదు వందల్లో ఈసారి పారితోషికం డిమాండ్ చేశాడట. అందుతున్న సమాచారం ప్రకారం కాంతారా 2 కోసం రిషబ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. రూ 50 కోట్లు పారితోషికం రూపంలో.. మారో రూ. 50 కోట్లు బిజినెస్ లో షేర్ లాగా తీసుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం రిషబ్.. యష్ ను మించిపోయాడనే చెప్పొచ్చు. రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ సామి అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments