NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ముగిసిన కవిత ఈడీ విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన కవిత ఈడీ విచారణ రాత్రి 8 గంటల వరకు సాగింది. కవిత తన సొంత వాహనంలో ఈడీ ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లే సమయంలో ఎలాగైతే చిరునవ్వుతో వెళ్లారో బయటకు కూడా అలాగే వచ్చారు కవిత. ఇదిలా ఉంటే ఇన్ని గంటలపాటు కవితను ఏం విచారించదాన్నిపై సర్వత్ర ఆసక్తినెలకొంది. అయితే.. జాయింట్ డైరెక్టర్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఎమ్మెల్సీ కవితను విచారించింది. వంద కోట్ల హవాలా డబ్బుపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

16న మళ్లీ రండీ.. కవితకు ఈడీ నోటీసులు
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితను ఈ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు.. అయితే, విచారణ ఆలస్యం అవుతున్న కొద్దీ బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.. కవిత ఎప్పుడు బయటకు వస్తురు? అనే బీఆర్ఎస్‌ శ్రేణులు ఎదురుచూశాయి.. చివరకు 8 గంటల తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు కవిత.. మీడియా మాట్లాడకుండా.. కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.. ఇక, ఢిల్లీలోని కేసీఆర్‌ ఇంటికి చేరుకున్న ఆమెకు.. బీఆర్ఎస్‌ శ్రేణులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.. అయితే, కవిత విచారణ ఇవాళ్టితో ముగిసిపోలేదు.. ఈ నెల 16వ తేదీన మరోసారి ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాల్సింది.. 16వ తేదీన విచారణకు రావాలంటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ రోజు దాదాపు 9 గంటలుగా ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది ఈడీ.. రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు వేసింది.. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం.. అంటే జాయింట్‌ డైరెక్టర్‌, లేడీ డిప్యూటీ డైరెక్టర్‌ ముగ్గురు అసిస్టెంట్‌ డైరెక్టర్లతో కూడిన ఈడీ టీమ్‌ కవితను ప్రశ్నించింది. కవిత వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసింది ఈడీ.. ఇక, తాజా నోటీసులతో ఈ నెల 16వ తేదీన కవిత ఈడీ ముందు హాజరు కానుండగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది.

ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్‌.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం..!
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్‌ని తెరపైకి తెచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. జనసేన పార్టీ బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన.. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని అభిప్రాయపడ్డారు.. నేను కాపు నాయకుడిని కాదు.. నేను కుల ఫీలింగ్‌తో పెరగలేదు.. మానవత్వంతో పెరిగాను అన్నారు. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు.. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవ్వరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్న పవన్‌.. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు.. బీసీలంటేనే ఉత్పత్తి కులాలు.. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదన్నారు పవన్‌ కల్యాణ్.. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌ అన్న ఆయన.. బీసీలకు ఇన్ని ఇచ్చాం.. ఇన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ప్రశ్నించారు. బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం.. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత అన్నారు. పూలేను గౌరవించింది మనమే.. బీసీ సదస్సు అంటే ఇంత మంది వచ్చారు.. కానీ, బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? అని నిలదీశారు. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీపీఐ అడడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు… కానీ పరిస్థితి మీకు తెలిసిందే అన్నారు.

బీజేపీ ముందు తల వంచేదే లేదు.. ఈడీ సోదాలపై లాలూ..
ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు. నిరాధారఐమన ఆరోపణ పేరుతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను చూశామని, ఈ యుద్ధంలో కూడా పోరాడుతామని ఆయన అన్నారు. నా కూతుళ్లు, చిన్న మనవరాలు, గర్భిణీ అయిన కోడళ్లను నిరాధారమైన ప్రతీకార కేసుల్లో బీజేపీ, ఈడీ 15 గంటల పాటు విచారించిందని ఆయన ఆరోపించారు. మాతో రాజకీయ యుద్ధం చేయడానికి బీజేపీ ఇంత తక్కువ స్థాయికి దిగజారాలా..? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా తాను సైద్ధాంతిక పోరాటం చేశానని.. ఇది కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ ముందు తాను తలవంచేది లేదని, మీ రాజకీయాల ముందు నా కుటుంబం, పార్టీ నుంచి ఎవరూ తలవంచరని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను సీబీఐ విచారించిన కొన్ని రోజుల తర్వాత ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ కుమార్తెలు రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్ కు సంబంధించి వారి కార్యాలయాల్లో తనిఖీ చేశారు. పాట్నా, ఫుల్వారీ షరీప్, ఢిల్లీ, రాంచీ, ముంబై లో సోదాలు నిర్వహించారు.

భారత్ ముద్దు.. చైనా వద్దు.. డ్రాగన్ కంట్రీని ముప్పుగా భావిస్తున్న కెనడియన్లు..
డ్రాగన్ కంట్రీ చైనాను ప్రపంచదేశాలు ముప్పుగా భావిస్తున్నాయి. కరోనా వైరస్ , చైనా దుందుడుకు వైఖరి, ఇతర దేశాలపై నిఘా, ఇతర దేశాల ఎన్నికలను ప్రభావితం చేస్తోంది చైనా. దీంతో చైనాతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇటీవల నిర్వహించిన ఓ పోల్ లో కెనడా ప్రజలు చైనాతో ముప్పు ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను కోరుకోవడం గమనార్హం. శుక్రవారం విడుదల చేసిన కొత్త సర్వే ప్రకారం.. మెజారిటీ కెనడియన్లు భారత్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. పబ్లిక్ ఓపీనియన్ రీసెర్చ్ ఏజెన్సీ ఏఆర్ఐ ఫిబ్రవరి చివరల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 1622 మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ కెనడియన్లు చైనాను ముప్పుగా భావిస్తున్నారు. ఏకంగా ఇది 40 శాతం ఉంది. అత్యంత ప్రమాదకమైన శత్రువుగా భావించే వారు 22 శాతం ఉన్నారు. కేవలం 12 మంది చైనాకు అనుకూలంగా ఉన్నారు. ఇక ఉక్రెయిన్ పై దాడి చేసిన రష్యా, చైనా కన్నా ఎక్కువ ముప్పు ఉందని కెనడా ప్రజలు ఓటేశారు. ఏకంగా 72 శాతం మంది కెనడా ప్రయోజనాలకు రష్యా ముప్పు అని తెలిపారు. ఇక భారత్ విషయానికి వస్తే 42 శాతం మంది భారత్ స్నేహపూర్వక దేశమని, 10 శాతం మంది విలువైన భాగస్వామి, మిత్రదేశంగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు. తైవాన్ పట్ట్ 62 శాతం కెనడియన్లు అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.

పెళ్లిలో తాగి పడుకున్న వరుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
పెళ్లవుతున్న సంతోషమో లేకపోతే పెళ్లి రద్దు కావాలన్న కోరికో తెలియదు కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తప్పతాగి పెళ్లికి వచ్చాడు. ఇది చూసిన బంధువులు అంతా షాక్ అయ్యారు. చివరకు ఎలాగొలా పెళ్లి చేయాలనుకున్నా కూడా మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు సహకరించలేదు. పెళ్లి మంటపంలోనే పడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. పెళ్లి కొడుకు చేసిన ఫీట్లకు నెటిజెన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. తప్పతాగి వచ్చిన పెళ్లి కొడుకు పేరు ప్రసేన్ జిత్ హలోయ్. అస్సాం రాష్ట్రం నల్బరి పట్టణ నివాసిగా గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి కొడుకును పీటలపై కూర్చోబెట్టి వివాహం చేద్దాం అని ఎంతగా ప్రయత్నించినా కూడా కుదరలేదు. వివాహ మంత్రాలు చదువుతున్న సమయంలో పెళ్లికొడుకు నేలపై పడుకోవడాన్ని చూడవచ్చు. పంతులు గారు అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. పెళ్లి ఆచారాలను వరుడు నిర్వహించలేకపోయాడు. చేసేదేం లేక వధువు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని, పెళ్లి పూర్తి చేయడానికి శాయశక్తుల ప్రయత్నించామని, పరిస్థితి విషమించడంతో పెళ్లి కూతురు పెళ్లిని రద్దు చేసుకుందని, 95 శాతం మంది పెళ్లి కొడుకు బంధువులు మద్యం తాగే ఉన్నారని, దీనిపై గ్రామపెద్దలకు చెప్పగా వారు పోలీసులను అలర్ట్ చేసినట్లు వధువు బంధువులు వెల్లడించారు. కనీసం వరుడు కారు నుంచి కూడా దిగలేకపోయాడని, అతడి తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నాడని వధువు బంధువులు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత పెళ్లి రద్దుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వధువు కుటుంబం నల్బరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

విజయ్ Vs KGF విలన్… పాన్ ఇండియా సంభవం లోడింగ్
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. దాదాపు 90 రోజుల్లోనే ‘లియో’ షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తూ ఒక్కొక్కరి పార్ట్ ని పూర్తి చేస్తున్నారు. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ కనగరాజ్ లు KGF విలన్ ని రంగం లోకి దించారు. KGF సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లియో సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సంజయ్ దత్ ని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి విజయ్ ని సంజయ్ దత్ కలిసే వరకూ ఈ వీడియోలో ఉంది. ఊహించని ఈ అప్డేట్ బయటకి రావడంతో విజయ్ ఫాన్స్, సంజయ్ దత్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. $LEO ట్యాగ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఇద్దరి మధ్య ఉండబోయే ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో, విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్, విక్రమ్ సినిమాలో సూర్య క్యారెక్టర్ లే ఇందుకు ఉదాహరణ. సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా అదే రేంజులో ఉంటే లియో సినిమా బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ.

ఇలాంటి నానిని ఇప్పటివరకూ చూసి ఉండరు…
నాని అనగానే క్యూట్ లుక్స్ తో, అద్భుతమైన టాకేటివ్ స్కిల్స్ తో బ్యూటీఫుల్ లవ్ స్టొరీలో పక్కింటి కుర్రాడిలా నటించే అబ్బాయి గుర్తొస్తాడు కానీ కత్తులు పట్టుకోని, గొడ్డలి పట్టుకోని విలన్స్ పైన ఎటాక్ చేసే మాస్ హీరో గుర్తు రాడు. ఈసారి మాత్రం పక్కింటి కుర్రాడు కాదు పాన్ ఇండియా హీరో అనిపించే రేంజులో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్న నాని, ఈ మూవీలో రా అండ్ రస్టిక్ రోల్ ప్లే చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్న నాని, మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ దసరా సినిమాకి హ్యుజ్ హైప్ తెచ్చి పెట్టింది. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ దసరా ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మార్చ్ 14న ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని… రెండు గొడ్డళ్ళు పట్టుకోని దహనం అవుతున్న రావణుడి ముందు నిలబడి ఉన్నాడు. నానిని ఇంత ఫియర్స్ లుక్ లో చూడడం ఇదే మొదటిసారి. పోస్టర్ అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. టీజర్ కట్ చేసిన రేంజులో ట్రైలర్ కూడా ఉంటే మార్చ్ 30న నాని దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసినట్లే. అయితే ఇదే రోజున హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘భోలా’ సినిమా కూడా రిలీజ్ అవ్వనుంది. ఖైదీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీపై బాలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమా, పైగా భారి అంచనాలు ఉన్న యాక్షన్ సినిమా కాబట్టి ‘భోలా’ మూవీ నుంచి నాని ‘దసరా’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.