NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పాడి రైతులకు రూ.7.20 కోట్ల బోనస్‌
కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌ పంపిణీ చేశారు.. రూ. 7.20 కోట్ల రూపాయల బోనస్‌ చెక్‌ను సీఎంకి అందజేశారు కర్నూలు మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ ఎస్‌.వి. జగన్‌ మోహన్‌ రెడ్డి… పాడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ. 27 కోట్లు లాభాలు గడించిందన్న చైర్మన్, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ సమగ్ర పనితీరును వివరించి, రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని సీఎంకి వివరించారు.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్‌లు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయడైరీ) ఛైర్మన్‌ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్‌, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్‌. సరళమ్మ తదితరులు పాల్గొన్నారు.

బాబు, పవన్‌ భేటీని పట్టించుకోవాల్సిన పనిలేదు
టీడీపీ, జనసేన చీఫ్‌ల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ భేటీని పట్టించు కోవాల్సిన పనిలేదన్నారు.. చంద్రబాబు సభలకు వెళ్లి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించే సమయం జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు లేదు.. కానీ, ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీస్ వైఫల్యమే కారణం అంటున్నారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మంది చనిపోయారు.. అది కూడా ప్రభుత్వ వైఫల్యమని ఒప్పుకుంటారా..? అని సవాల్‌ విసిరారు మంత్రి కాకాని.. మరోవైపు, చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంపై స్పందిస్తూ.. కర్ణాటకలో సిద్దేశ్వర స్వామి అంత్యక్రియలకు వచ్చిన ప్రజల ఫోటోలను, వీడియోలను చూపిస్తూ.. కుప్పంలో వచ్చినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

‘నాడు-నేడు’కు లారస్‌ ల్సాబ్స్‌ భారీ విరాళం
నాడు నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ భారీ విరాళం అందజేసింది.. లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్, ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ మరియు బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమం కింద రూ. 4 కోట్ల విరాళం అందజేసింది.. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన మరియు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో తెలిపారు. ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి.. రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించే ముఖ్యమంత్రి ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమానికి గాను రూ. 4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను అందజేశారు. నాడు – నేడు పథకం క్రింద లారస్‌ ల్యాబ్స్‌ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి కావడం విశేషం.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘నాడు-నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పటికే ఎన్నో పాఠశాలల రూపం మారిపోగా.. మౌలిక సదుపాయల కల్పనపై కూడా ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.. మరికొన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

చంద్రబాబు, పవన్‌ భేటీపై, పొత్తులపై టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత టీజీ వెంకటేష్‌.. ఆ ఇద్దరు నేతలు కలవడానికి వైసీపీ నేతలే కారణం అన్నారు.. రోజు దత్త పుత్రుడు అనే విమర్శలతో పవన్ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిశారన్న ఆయన.. పవన్‌కు ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అదే ఒక్కసీటు రాని పవన్.. చంద్రబాబును కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని నిలదీశారు. ఇక, ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అయినా సాధ్యమే… ఆరు నెలల ముందు మాత్రమే పొత్తులు ఖరారవుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్‌.. పొత్తులపై బీజేపీ అడిగితే తన అభిప్రాయాన్ని తెలియచేస్తానని తెలిపారు.. ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు. అయితే, ఎవరితో అయినా కలసి పనిచేయాలనుకుంటే బీజేపీ నిర్ణయం వేరుగా ఉంటుందన్నారు.. వైసీపీకి ఎలాగూ ఎవరితోనూ పొత్తు ఉండే విధానం లేదని చెప్పుకొచ్చారు.. ఇక, తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు బీజేపీ నేత టీజీ వెంకటేష్‌. కాగా, ఇటు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీతో పాటు.. ఎన్నికల్లో పొత్తులపై టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

బీఆర్‌ఎస్‌ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ
మోడీ సభ జన సమీకరణపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు, కార్పొరేటర్‌లతో ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంను బద్నాం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు అని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని ఆయన అన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని, కేటీఆర్ అయ్యను చర్చకు రమ్మను అంటూ.. బండి సంజయ్‌ సవాల్ చేశారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షన్‌లు నాలుగు పథకాలు ఇచ్చి ఎంతో చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ఊళ్లలో రొడ్లులేవు… జీతాలు ఇవ్వలేని వాడు అభివృద్ధి ఎలా చేస్తారు.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి… కార్పొరేటర్ లు కష్టబడి పని చేయాలి… అహంకారం తో ఉండొద్దు చెడ్డ పేరు రావొద్దు. పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది.. మోడీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి…. ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయింది .. ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చు.. బెంగాల్ లెక్క ఇక్కడ చేయాలి అంటే బీజేపీ కార్యకర్తలు భయపడరు ఊరికిచ్చి కొడతారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించేది లేదు… స్పందించక పోతే బీజేపీ కార్యకర్తలము కాదు.. గ్రేటర్‌లో బీజేపీకి అందుకోసమే ఓటు వేశారు.’ అని ఆయన అన్నారు.

గవర్నర్‌ ప్రసంగంపై సీఎం అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి వాకౌట్
తమిళనాడు గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన లేదా దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ఒరిజినల్ ప్రసంగాన్ని మాత్రమే రికార్డ్ చేయాలని అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి స్పీకర్ అనువదించింది. RN రవి జాతీయ గీతం కోసం కూడా వేచి ఉండకుండా, కొద్ది క్షణాల తర్వాత ఆలపిస్తూ హఫ్‌గా వెళ్లిపోయారు. తమిళనాడును శాంతి స్వర్గంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ దాటవేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార డీఎంకే ప్రచారం చేస్తున్న ‘ద్రవిడ మోడల్’ ప్రస్తావన కూడా ఆయన చదవలేదు. గవర్నర్ చర్య అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని తీర్మానంలో ఎంకే స్టాలిన్ అన్నారు.

ఏపీలో మరో 2 నగరాల్లో.. దేశవ్యాప్తంగా 10 చోట్ల జియో ట్రూ 5జీ సేవలు షురూ..
5 జీ సేవల్లో దూకుడు చూపిస్తోంది రిలయన్స్‌ జియో.. ఇవాళ దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.. ఏపీలోని తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను లాంచ్‌ చేసిన విషయం విదితమే కాగా.. ఇవాళ మరో రెండు నగరాలకు విస్తరించింది.. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కేరళలోని కోజికోడ్, త్రిసూర్‌తో పాటు నాగ్‌పూర్ వంటి మొత్తం 10 నగరాల్లో ఇవాళ జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభించింది. అహ్మద్‌నగర్ (మహారాష్ట్ర). రిలయన్స్ జియో ఈ నగరాల్లో అత్యధికంగా 5G సేవలను ప్రారంభించిన మొదటి మరియు ఏకైక ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్‌ను అధిగమించింది.

ఢిల్లీ వాసులు అలర్ట్.. బీఎస్3, బీఎస్4 కార్లు నిషేధం!
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో శుక్రవారం వరకు బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించారు. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్వాన్నమైన గాలి నాణ్యత దృష్ట్యా మంగళవారం నుంచి దేశ రాజధానిలో బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను ఉపయోగించడంపై తాత్కాలిక నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శీతల గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం తీవ్ర స్థాయికి దిగజారింది. కాలుష్య నిరోధక నియంత్రణలను మరింత శక్తివంతంగా అమలు చేయాలని అన్ని ఎన్సీఆర్ రాష్ట్రాలను ఆదేశించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ను ప్రేరేపించింది. తీవ్రంగా గాలి నాణ్యత క్షీణించినందున బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై నిషేధం మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని ఓ రవాణా శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పర్యావరణ శాఖతో కలిసి తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. శుక్రవారం వరకు నిషేధం అమలులో ఉందన్నారు. గాలి నాణ్యత మెరుగుపడితే శుక్రవారం లోపు నిషేధాన్ని ఎత్తివేయొచ్చన్నారు. దేశ రాజధానిలో 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక సోమవారం సాయంత్రం 4 గంటలకు 434 వద్ద ఉంది. ఆదివారం 371 నుంచి మరింత దిగజారింది.

ఉద్యోగులకు ఒకేసారి నాలుగేళ్ల బోనస్‌..
ఉద్యోగులకు పండుగలకు, ఇతర సందర్భాల్లో బోనస్‌లు ఇస్తుంటాయి ఆయా సంస్థలు.. అయితే, ఓ సంస్థ ఏకంగా నాలుగేళ్ల బోనస్‌ ఒకేసారి ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.. తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ ఒక అద్భుతమైన సంవత్సరాన్ని జరుపుకోవడానికి సగటున 50 నెలల జీతం లేదా నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతంతో సమానమైన సంవత్సరాంత బోనస్‌లను అందజేస్తోంది. తైవాన్ యొక్క ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ తన సిబ్బందిలో కొంతమందికి స్టెల్లార్ బోనస్‌లను ప్రదానం చేయనుంది.. తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్‌లను 50 నెలల జీతం లేదా సగటున నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతంతో అందజేయనున్నట్టు ప్రకటించింది.. అయితే, ఉద్యోగి గ్రేడ్ మరియు పనితీరుపై ఆధారపడి ఇది మారుతూ ఉంటుంది.. అంతేకాదు, తైవాన్ ఆధారిత ఒప్పందాలు కలిగిన సిబ్బందికి మాత్రమే ఈ బోనస్‌లు వర్తిస్తాయని ఓ ఉద్యోగి తెలిపారు.

వీరసింహారెడ్డి సెన్సార్ టాక్.. సీట్లు చిరిగిపోవడం ఖాయమే
నందమూరి నట సింహం జూలు విప్పింది. ఏడాది నుంచి ఆల్కలీతో ఉన్న సింహ సంక్రాంతికి వేట మొదలుపెట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ- శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో సైతం వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హీట్ ఎక్కించేస్తున్నారు.కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సెన్సార్ టాక్ ను బట్టి సినిమా పాజిటివ్ గానే సాగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తాయని అంటున్నారు. నందమూరి అభిమానులు ఒక్కరు కూడా సీట్లలో కూర్చోరని, బాలయ్య డైలాగ్స్ కు అరిచిఅరిచి గొంతులు పోతాయని అంటున్నారు. మొత్తానికి సెన్సార్ సభ్యులే సినిమా వీర లెవల్ అని చెప్పుకొచ్చారట. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే థమన్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అఖండ తరువాత అంతటి పవర్ ఫుల్ మ్యూజిక్ ను అందించాడు థమన్. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.