NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్‌ దాటింది..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. గత ఏడాది కూడా వరుసగా ప్రతి నెల రూ.100 కోట్ల మార్క్‌ దాటుతూ వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్‌ అవుతోంది.. 2023 జనవరి మాసంలో వంద కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం 123 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, జనవరి 2వ తేదీన శ్రీవారికి టీటీడీచరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం లభించింది.. 2వ తేదీన ఏకంగా రూ.7.68 కోట్లు శ్రీవారి హుండీలో సమర్పించారు భక్తులు.

రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!
సీఎం జగన్‌ కామెంట్లపై స్పందించనంటూనే హాట్‌ కామెంట్లు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. రాజధానిపై ఏం చేసినా చట్టబద్దత ఉండాలన్న ఆయన.. రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడను.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైన అంశం.. కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను స్పందించను అన్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టుపై కేవీపీ దాఖలు చేసిన పిల్‌లో నేను ఇంప్లీడయ్యాను.. 2017 నుంచి విచారణకు కోర్టులో రాలేదన్నారు.. చీఫ్ జస్టిస్ నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్నారని తెలిపారు ఉండవల్లి.. ఛత్తీస్‌గడ్ తరపున అడ్వకేట్ జనరల్‌గా పోలవరం ప్రాజెక్ట్ తరపున వాదనలు వినిపించానని బెంచ్ నుంచి తప్పుకున్నారు. వేరే బెంచ్ కి బదిలీ చేస్తున్నట్లు సీజే చెప్పారన్నారు.. అయితే, మేం దాఖలు చేసిన పిటిషన్ పై వినడానికి ఏడేళ్లు సమయం పట్టిందని.. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. మరోవైపు, పొలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. సెక్షన్ 90 ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న ఆయన.. 2014 రేట్ల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయం భరిస్తామని కేంద్రం చెబుతోంది.. 2014 రేట్లతో 2023లో ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం అవుతుందా…? అని ప్రశ్నించారు.

సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..
రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, దీనిపై విపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి.. సీబీఐ కేసుతో.. విశాఖ రాజధానికి లింక్‌ పెడుతున్నాయి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌.. సీఎం వైఎస్‌ జగన్ స్టేట్‌మెంట్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడా సీఎం జగన్‌ మాట్లాడలేదన్నారు. ప్రజల ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్న ఆయన.. అసెంబ్లీ సాక్షిగా రాజధానులపై మా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించామని తెలిపారు. అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.. బీజేపీ కోరినట్లే కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది అన్నారు మంత్రి జోగి రమేష్‌.. అసలు, సీబీఐ కేసుకు, విశాఖ రాజధాని అంశానికి ఏంటి సంబంధం? అని నిలదీశారు. బోడి గుండుకు, మోకాలికి ముడి పెట్టినట్లు ఉంది టీడీపీ నేతల ధోరణి అంటూ దుయ్యబట్టిన ఆయన.. బురద వేయటమే ప్రతిపక్షాల పని అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. ముఖ్యమంత్రి ఇల్లు మా ప్రాంతంలోనే ఉంటుంది అని తెలిపిన ఆయన.. అసలు చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్ ఉందా? అని ఎద్దేవా చేశారు.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుంది.. ఈ ప్రాంత నేతలుగా మేం విశాఖ నుంచి పాలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు మంత్రి జోగి రమేష్‌.

కోటంరెడ్డిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు..
నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. తాజాగా, నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు కోటంరెడ్డి.. అయితే, కోటంరెడ్డికి కౌంటర్‌ ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… అసలు అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనుకున్న వాళ్లే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. కోటంరెడ్డిని బతిమాడాల్సిన అవసరం మాకులేదన్న ఆయన.. మాకు ఎందరో నాయకులు వున్నారు.. టీడీపీ నుంచి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.. కానీ, మా దగ్గర ఖాళీలు లేవన్నారు. ఇక, మంత్రి పదవుల కోసం చాలా మంది సీనియర్లు వున్నారు.. అందరికీ అవకాశం రాదు.. ఒక్కరికే వస్తుందన్నారు మాజీ మంత్రి బాలినేని.. నన్ను మంత్రిగా కొనసాగించలేదు.. కానీ, పదవులు ముఖ్యం కాదు.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.. ముందుగా టీడీపీ నాయకులతో మాట్లాడుకుని ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని.. అసలు ఈ విషయాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదని డిమాండ్‌ చేశారు. అసలు వాళ్లు మాట్లాడుకున్నది రికార్డు చేసి.. వారే బయటపెట్టి అది ఫోన్‌ ట్యాపింగ్‌ అంటున్నారని ఆరోపించారు.. మరోవైపు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఇంఛార్జి్‌ని నియమిస్తాం.. ఎన్నికల తర్వాత శ్రీధర్ రెడ్డి బాధపడతారని వ్యాఖ్యానించారు.. వెంకటగిరిలో కూడా ఇంచార్జిని నియమిస్తాం అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ చేస్తామని వెల్లడించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

సీఎం ముందే ఎలా ప్రకటిస్తారు.. సుప్రీంకోర్టును వెక్కిరించినట్లే..
విశాఖపట్నం రాజధానిపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి విపక్షాలు.. ఆ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. సీఎం జగన్‌ వాఖ్యలు వివాదంగా మారాయన్నారు.. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.. రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు రావాల్సి ఉంది.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ ముందే ఎలా ప్రకటిస్తారు? అని నిలదీశారు.. విశాఖ రాజధాని కానుంది.. నేను అక్కడికి షిఫ్ట్ అవుతున్నా అని ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును వెక్కిరించినట్లే అవుతుందని విమర్శించారు జీవీఎల్‌.. కాగా, ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. విశాఖలో పెట్టుబడులకు మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాం. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్‌ అవుతున్నాను. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను విశాఖలో మార్చి 3,4 తేదీలలో నిర్వహించబోతున్నామని ఆయన ఢిల్లీలో చెప్పుకొచ్చారు.. నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాను. సదస్సుకు హాజరు కావడంతో పాటు ఇక్కడ పెట్టుబడులకు కూడా ముందుకు రావాలి. మీతో పాటు మీ సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలని విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా.. వికారాబాద్ కలెక్టర్‌గా నారాయణ రెడ్డి. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది. హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతును నిజామాబాద్‌కు బదిలీ చేసింది. అమయ్‌కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడంతో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పంపింది. వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు, మెదక్‌ కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్‌ హరీశ్‌రాను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్‌ కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ తేజ ఎస్‌ పవార్‌ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రూప్‌-I అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..
గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్‌మెంట్) రాత (మెయిన్) పరీక్ష హైదరాబాద్‌లో జూన్ 5 నుంచి జూన్ 12 మధ్య నిర్వహించబడుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) మంగళవారం నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రధాన గ్రూప్-I పరీక్షల షెడ్యూల్ జూన్ 5న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్), జూన్ 6న పేపర్-I జనరల్ ఎస్సే, జూన్ 7న పేపర్-II-హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, పేపర్-III-ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం జూన్ 8న మరియు గవర్నెన్స్, జూన్ 9న పేపర్-IV-ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, జూన్ 10న పేపర్-V-సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్ మరియు జూన్ 12న పేపర్-VI తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు. పరీక్ష సమయం షెడ్యూల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఒక్కో పేపర్‌కు గరిష్టంగా 150 మార్కులు ఉంటాయి. మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలో జనరల్ ఇంగ్లీషు మినహా పేపర్‌లకు అభ్యర్థులు ఎంచుకున్నట్లు ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇవ్వాలి. అయితే, ఒక అభ్యర్థి పేపర్‌లో కొంత భాగాన్ని ఇంగ్లీషులో మరియు కొంత భాగాన్ని తెలుగు లేదా ఉర్దూలో వ్రాయడానికి అనుమతించబడరు. జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ ఒకటి మరియు ఈ పేపర్ యొక్క ప్రమాణం సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మరియు ఈ పేపర్‌లో పొందిన మార్కులు ర్యాంకింగ్ కోసం లెక్కించబడవు. ప్రధాన పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా వ్రాత పరీక్షలో అన్ని పేపర్‌లకు హాజరు కావాలి.

పేరుమారింది.. డీఎన్‌ఏ మారలేదు..
నేడు మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్‌స్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పేరు మాత్రమే మారింది కానీ డీఎన్‌ఏ, పార్టీ గుర్తు మారలేదు అని అన్నారు. 14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించారని, రూ.3వేల పింఛను ఇస్తామన్నారు, హోం మంత్రి అమిత్‌ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామని ఆరోజు ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ 14 నెలల్లో హుజూరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగిందని, 2004లో టీఆర్‌ఎస్‌ టికెట్ కోసం 33 మంది పోటీపడితే ఈటలకు టికెట్‌ ఇచ్చారని, ఈటలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్‌ అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు.. తండ్రి లాంటి కేసీఆర్‌ను పట్టుకుని కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల మాట్లాడుతున్నారు.. ఇది తగునా? అని ఆయన మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఎట్టి పనికైనా.. మట్టి పనికైనా మనోడే ఉండాలే అంటరు.. మన పార్టీకే ఈ గడ్డపై ప్రేమ ఉంటుందని, గుజరాత్ గులాముల పార్టీ బీజేపీ కాదన్నారు. అంతేకాకుండా.. విస్తార్‌ల మీటింగట అంటూ బీజేపీ మీటింగ్‌లపై వ్యాఖ్యాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మారింది తప్ప మా డీఎన్ఏ మారలేదని. జెండా, గుర్తు మారలేదని, నాయకుడు మారలేదన్నారు. దేశంలో కేసీఆర్‌ నాయకత్వం అవసరముందని ఆయన అన్నారు. చంపుకుంటరో సాదుకుంటరో అనే సెంటి మెంట్ డైలాగులకు పడి పోయి మరోసారి హుజురాబాద్ ప్రజలు తప్పు చేయవద్దన్నారు. హుజురాబాద్‌కు ఇంకా చేయాల్సి ఉందని, చేస్తామని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొందాలంటూ… పరోక్షంగా హుజురాబాద్ టికెట్ పై హామీ ఇచ్చారు కేటీఆర్.

వైట్ షార్క్‌ను వండి తిన్న పుడ్ బ్లాగర్..శిక్ష విధించిన అధికారులు
చైనాకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్‌కు అక్కడి ప్రభుత్వం దాదాపు రూ.15 లక్షల జరిమానా విధించింది. గ్రేట్ వైట్ షార్క్‌ను అక్రమంగా కొనడమే కాకుండా దానిని వండి తిన్నందుకు ఈ బ్లాగర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారని సమాచారం. సోషల్ మీడియాలో ‘తిజి'(Tizi) పేరుతో పాపులర్‌గా మారిన ఈ బ్లాగర్ పేరు జిన్ మౌమౌ. గతేడాది ఏప్రిల్‌లో ఆమె గ్రేట్ వైట్ షార్క్‌ను కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ షార్క్‌ను వండి, దానిని తిన్న వీడియోను ఆమె జూలైలో చైనాలోని ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్టు చేసింది. దీంతో సీరియస్ అయిన అధికారులు వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ లా ప్రకారం గ్రేట్ వైట్‌షార్క్‌ను కొనడం, వండడం నేరమని ఆమెకు జరిమానా విధించారు. కాగా, వైట్‌షార్క్‌ను అక్రమంగా కలిగి ఉంటే చైనాలో కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఆ వీడియోలో ఆ బ్లాగర్ దాదాపు ఆరడుగుల పొడవున్న షార్క్‌తో ఓ స్టోర్‌లో పోజిస్తూ కనిపించింది. ఆమె దాని తలను వండేయగా, దానిని శరీరాన్ని సగానికి చీల్చేసి కాల్చి తినేసింది. ఆ వీడియోలో తిజి మాట్లాడుతూ.. “ఇది మీకు దుర్మార్గంగా అనిపించొచ్చు. నిజానికి దీని మాంసం మృదువుగా, అద్భుతంగా ఉంటుంది” అని చెబుతూ వండిన షార్క్‌ ముక్కలను తింటూ కనిపించింది. దీంతో ఆమెకు ఆ షార్క్‌ను అమ్మిన వ్యాపారి, దానిని పట్టుకున్న జాలరి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రేట్ వైట్ షార్క్‌ను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. దీంతో 2020లో చైనా ఈ షార్క్‌ కొనుగోలు, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది.

అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు.. చెక్‌ చేసుకోండి..
వాట్సాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ ఫోన్‌ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాట్సాప్‌ వాడేస్తున్నారు.. చాటింగ్‌, వాయిస్‌ మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌.. ఒక్కటేంటి.. ఫొటోలో, వీడియోలు, ఫైల్స్‌ ఇలా ఎన్నో సులువుగా షేర్‌ చేసుకునే అవకాశం ఉండడంతో.. తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఈ యాప్‌.. ఇక, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది.. ఇదంతా ఎందుకంటే.. వాట్సాప్‌ యూజర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1, 2023 నుండి వాట్సాప్ కొన్ని మోడల్స్‌ మొబైల్‌ ఫోన్లలో అసలు పనిచేయదు.. కాబట్టి మీరు కలిగి ఉన్న మోడల్ వాటిలో ఉందా? లేదా? అనే విషయాన్ని మీరే చెక్‌ చేసుకోండి.. ఆండ్రాయిడ్ 4.1, iOS 12 లేదా ఐఫోన్‌లు వెర్షన్ KaiOS 2.5.0తో పని చేసే మోడల్‌లు, 8 మరియు 10 సంవత్సరాల మధ్య పాత మోడల్‌లు, కానీ, ఈ మెసేజింగ్ యొక్క కొత్త వెర్షన్‌ను ఆపరేట్ చేయగల మోడల్‌లు సాధ్యం కాదని మెటా ప్రకటించింది.

అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడట్లేదు..సీక్రెట్ బయటపెట్టిన స్మిత్
ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది కంగారూ జట్టు. అయితే, ప్రతి టెస్టు సిరీస్ ముందు ఆతిథ్య మైదానాల్లో వార్మప్ మ్యాచ్‌లు ఆడటం ఆనవాయితీ. కానీ ఈ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్‌ ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడట్లేదు. నేరుగా సిరీస్‌లో భారత్‌ను ఢీకొననుంది. పిచ్‌లలో వ్యత్యాసం ఉంటుందని భావించి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్ మద్దతు పలికాడు. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడకపోవడమే బెటర్ అని చెప్పాడు. “ఇంతకుముందు ఇక్కడ మేము ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాం. అసలు ఆ మ్యాచ్‌ల్లో ఆడాల్సిన అవసరం లేదు. మేము మా నెట్‌ ప్రాక్టీస్‌లో వీలైనంత ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా సరైన నిర్ణయం తీసుకున్నామని నేను భావిస్తున్నాను” అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్‌ కంటే ముందు ఆసీస్ మరో బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.

పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.. ఏ శుభకార్యం జరిగినా.. బంగారం కొనసాల్సిందే.. వివాహాది శుభకార్యాలు, పండగలకు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుంగా వారి పసిడి కొనుగోలు చేస్తుంటారు.. అయితే, ఈ మధ్య బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇది బంగారం వినియోగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి… 2022లో భారతదేశం యొక్క బంగారం వినియోగం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 3 శాతం పడిపోయింది, ఎందుకంటే డిసెంబర్ త్రైమాసికంలో స్థానిక ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్ల పసిడికి డిమాండ్ తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం ప్రకటించింది.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా ఉన్న భారత్‌లో తక్కువ వినియోగం ప్రపంచ ధరలపై ప్రభావం చూపుతుంది, అయితే భారతదేశం యొక్క వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది మరియు రూపాయి బలపడేందుకు మద్దతు ఇస్తుందని అంచనా వేస్తున్నారు.. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 20 శాతం తగ్గి 276.1 టన్నులకు చేరుకోవడంతో గతేడాది భారత్‌లో బంగారం వినియోగం 774 టన్నులకు తగ్గిందని డబ్ల్యూజీసీ ఒక నివేదికలో పేర్కొంది. మార్చి 2023 త్రైమాసికంలో, వేసవిలో విత్తిన పంటల ధరలు పెరగడం మరియు వివాహాలకు ఎక్కువ శుభ దినాల మధ్య గ్రామీణ డిమాండ్ పెరగడం వల్ల బంగారం వినియోగం మెరుగుపడుతుందని కౌన్సిల్ తెలిపింది. భారతదేశంలో మూడింట రెండు వంతుల బంగారం డిమాండ్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి వస్తుంది. దేశంలో వధువు కట్నంలో బంగారం ఒక ముఖ్యమైన భాగం.. అంతే కాదు వివాహాలలో కుటుంబ సభ్యులు మరియు అతిథుల నుండి కూడా పసిడి బహుమతిగా ఇస్తుంటారు.. అయితే దేశీయంగా బంగారం ధరలు పెరగడం, గ్రామీణ ద్రవ్యోల్బణం ఎదురుగాలిని ఎదుర్కొంటున్న సమయంలో పసిడికి డిమాండ్‌ తగ్గిందని డబ్ల్యూజీసీ తెలిపింది. స్థానిక బంగారం ధరలు జనవరిలో 10 గ్రాములకు 57,149 రూపాయలు ($699.63) ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధరల పెరుగుదల కొంతమంది పెట్టుబడిదారులను బంగారాన్ని విక్రయించడానికి ప్రేరేపించింది, అయితే, కొంతమంది వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో మార్చుకున్నారు, ఇది 2022లో భారతదేశంలో బంగారం రీసైక్లింగ్‌ను 30 శాతం పెరిగి 97.6 టన్నులకు పెంచిందని డబ్ల్యూజీసీ నివేదక పేర్కొంది.

నీచుడు.. ప్రైవేట్ పార్ట్ లని కూడా చూడకుండా..
మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడున్నా తప్పడం లేదు. సాధారణ మహిళలే కాదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది రిస్క్ చేసి బయటపడుతున్నారు.. ఇంకొంతమంది వారి చేతుల్లో బలవుతున్నారు. ఇక తాజాగా నటి ఫ్లోరా షైనీ.. ఆ నరకం నుంచి బయటికి వచ్చినట్లు చెప్పి షాకిచ్చింది. ఫ్లోరా షైనీ అంటే తెలుగువారికి తెలియకపోవచ్చు.. లక్స్ పాప ఆశా షైనీ అంటే టక్కున గుర్తుపడతారు. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తోనూ మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఫ్లోరా ఒక నిర్మాత ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకొంది. అతడి కోసం ఇంట్లో వారిని కాదనుకొని పారిపోయి పెళ్లి చేసుకొంది. అయితే చాలామంది అమ్మాయిల జీవితాలలానే.. ఆమె జీవితం కూడా అంధకారంలో కూరుకుపోయింది. పెళ్ళైన కొద్దిరోజులకే అతడు నరకం చూపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇష్టం వచ్చినట్లు కొట్టి.. నటన మానేయమని ఆంక్షలు పెట్టేవాడిని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. “14 నెలలుగా నరకం చూసాను. అతడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించా.. కానీ కుదరలేదు.నన్ను అనరాని మాటలు అన్నాడు.. నటిస్తే చంపేస్తానని బెదిరించాడు. పచ్చి బూతులు తిడుతూ.. శరీరం మొత్తం రక్తం వచ్చేలా కొట్టాడు. నీచుడు.. కనీసం ప్రైవేట్ పార్ట్ లని కూడా చూడకుండా.. వాటిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు. అతడు పెట్టే టార్చర్ ను భరించలేక చచ్చిపోదామనుకున్నా.. చివరికి అతడి నుంచి రిస్క్ చేసి తప్పించుకొని పారిపోయి వచ్చా.. ఆ దెబ్బలు నుంచి కోలుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది.. ఇప్పుడు ఇష్టమైన వారితో ఉంటున్నా.. నా కుటుంబమే ఇప్పుడు నాకు అన్ని” అని చెప్పుకొచ్చింది. దేవుడి దయవల్ల ఆ నరకం నుంచి బయటపడ్డావ్.. సంతోషంగా ఉండు అని కొందరు.. కొత్త జీవితం ప్రారంభించు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.