NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

స్కూల్‌లో ఇక నో సార్‌.. నో మేడం.. ఓన్లీ టీచర్‌..
పాఠశాలల్లో పురుషు ఉపాధ్యాయులను సార్‌ అని.. మహిళా ఉపాధ్యాయులను మేడం అంటూ సంబోధిస్తుంటారు.. అయితే, పాఠశాలల్లో ఇక నో ‘సర్’.. నో ‘మేడమ్’.. ఓన్లీ ‘టీచర్’ అంటోంది కేరళ.. ఉపాధ్యాయులకు సర్ లేదా మేడమ్ వంటి గౌరవప్రదమైన పదాల కంటే లింగబేధం లేని తటస్థ పదం టీచర్‌ మంచిదని కేరళ చైల్డ్ రైట్స్ ప్యానెల్ నిర్దేశించింది. కేరళ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పాఠశాల ఉపాధ్యాయులను వారి లింగంతో సంబంధం లేకుండా ‘సర్’ లేదా ‘మేడమ్’ అని కాకుండా ‘టీచర్’ అని సంబోధించాలని ఆదేశించింది.. కేఎస్‌సీపీసీఆర్‌ ఆదేశాల్లో “సర్” మరియు “మేడమ్” వంటి పదాలను పిలవడాన్ని నివారించాలని పేర్కొంది.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్‌’ అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. సార్ లేదా మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం అన్ని పాఠశాలల పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని మరియు ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని కూడా పెంచుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపాధ్యాయులను వారి లింగం ప్రకారం ‘సార్’ మరియు ‘మేడమ్’ అని సంబోధిస్తూ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ ఆదేశాలు జారీ చేశారు.

2024లో కూడా జగనే సీఎం..
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. బాపట్ల పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌లు చెప్పే మోసపూరితమైన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.. పవన్ కల్యాణ్‌ ముఖ్యమంత్రిని పట్టుకొని మూడు ముక్కల ముఖ్యమంత్రి అని సంబోధించడం ఎంత వరకు సరైంది అని ఫైర్‌ అయ్యారు.. పవన్‌ కల్యాణ్ ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలని హితవుపలికారు వైవీ సుబ్బారెడ్డి.. ఎందరు విడిగా వచ్చినా.. అంతా కలిసి వచ్చినా.. 2024 ఎన్నికల్లోనూ గెలిచేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మరోసారి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

శ్రీశైలంలో కర్ణాటక సీఎం, మాజీ సీఎం పర్యటన.. పొరపాటు చేశారా..? కన్నడిగుల అసంతృప్తి..
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప ఇవాళ శ్రీశైలంలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. నేతల పర్యటనతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీఎం, మాజీ సీఎం.. భ్రమరాంబికాదేవిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.. ఎందుకంటే.. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు కన్నడిగులు.. కానీ, అమ్మవారిని దర్శించుకోకుండానే బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప తిరిగి వెళ్లడంపై కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ప్రత్యేక హెలికాప్టర్ సమయం కుదరదని ఫోన్ రావడంతో.. మల్లన్నను దర్శించుకుని వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది..

సీఎం జగన్‌ నివాసంలో ప్రత్యేక గోశాల.. నిత్య పూజలు..!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాసం దగ్గర ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. హైందవ సంస్కృతితో గో పూజకు ప్రత్యేక స్థానం ఉండగా.. సీఎం నివాసంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు అయ్యింది.. తెలుగుతనం ఉట్టిపడే డిజైన్లతో ఈ గోశాలను రూపకల్పన చేశారు.. గోవులు, గో పూజ అంటే ప్రత్యేక ఆసక్తి చూపించే ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. రేపు గోపూజలు పాల్గొనబోతున్నారు.. ముఖ్యమంత్రి జగన్ గోశాలలో పలు రకాలకు చెందిన గోవులను తీసుకొచ్చారు.. గిరి, పుంగనూరు, కపిల, హర్యానా ప్రాంతాలకు చెందిన గోవులను గోశాలలో ఉంచారు.. గోశాలలో నిత్య పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు.. ఇక, గోశాలలోని గోవులకు ప్రత్యేక పేర్లు పెట్టారు సీఎం సతీమణి వైఎస్‌ భారతి.. గోవుల ఆరోగ్యం చూసుకోవటానికి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.

వారణాసిలో టెంట్ సిటీ.. ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. గంగా నది ఒడ్డున ఎంతో అందంగా నిర్మించిన ఈ సిటీని ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ప్రారంభించారు. గంగా ఘాట్ సమీపంలో 100 హెక్టార్లలో ఈ టెంట్ సిటీని నిర్మించారు. వారణాసి నుంచి రామ్ నగర్ వెళ్లే మార్గంలో ఇది కనిపిస్తుంది. ఇందులో ఒకే విడతలో 200 మంది ఉండగలిగే కెపాసిటీ ఉంది. ఈ టెంట్ సిటీలో గంగా దర్శన్ విల్లాస్, ప్రీమియం టెంట్స్, సూపర్ డీలక్స్ టెంట్స్ అనే మూడు విభాగాలున్నాయి. వీటిల్లో చిన్నపాటి ఫ్రిజ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్ తదితర వసతులన్నీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్‌తో ఇంటీరియర్ డిజైన్ చేయడం విశేషం. ప్రీమియం, డీలక్స్ టెంట్ రూమ్ కావాలంటే.. రూ.12,000-14,000 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ టెంట్ సిటీ భక్తులకు అందుబాటులోకి వస్తుంది. అంతర్గత జలమార్గాలను మరింత అధునాతనం చేసి.. నదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఈ టెంట్ సిటీని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ టెంట్ సిటీలో బస చేయాలనుకునేవారు.. ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (UPSTDC) ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాటేజీల్లో సౌకర్యవంతమైన బస కోసం వాటర్‌ప్రూఫ్ టెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డీలక్స్ టెంట్ లోపల 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. భారీగా తరలివచ్చే భక్తులు, పర్యాటకులకు వసతి సమస్య లేకుండా ఉండేందుకు ఈ టెంట్ సిటీకి ఏర్పాటు చేశారు. ఈ టెంట్ సిటీకి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. కాశీలో పర్యాటకానికి ఈ టెంట్ సిటీ పెద్ద ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.

100డేస్‎లో 101 సిటీస్.. రికార్డు సృష్టించిన జియో కంపెనీ
ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు జియో 5జీ సర్వీసులు (5g Services) దేశంలోని 101 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ట్రూ 5జీ సర్వీసులను గతేడాది అక్టోబర్‌లో రిలయన్స్ జియో లాంచ్ చేసింది. 5జీ నెట్‍వర్క్ రోల్అవుట్ మొదలుపెట్టిన 100 రోజుల్లోనే.. 101 నగరాల్లో ఈ కొత్త తరం నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా తమిళనాడులోని ఆరు నగరాల్లో 5జీని లాంచ్ చేయటంతో ఈ సెంచరీ మార్కును జియో అధిగమించింది. వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాల్లో రిలయన్స్‌ జియో ‘ట్రూ 5జీ’ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 6 పట్టణాల్లో 5జీ సేవల్ని జియో ప్రారంభించింది.  తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, సేలం, హోసూర్, వెల్లూరు నగరాల్లో 5జీ సేవల్ని ప్రారంభించింది. దీంతో దేశంలోని 101 పట్టణాలు, నగరాలు జియో 5జీ సేవల్ని పొందుతున్నాయి. ఈ ఘనతను కేవలం 100 రోజుల్లోనే సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జియో 5జీ సేవలు వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో జియో 5జీ వాడుతున్నారు.

రూ.58పెట్టుబడి పెడితే రూ.8లక్షలు మీ సొంతం
దేశంలోని అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ.. ఎల్ఐసీ మహిళలకు ఓ శుభవార్త తీసుకొచ్చింది. ఎల్ఐసీ ఆధార్ షీలా స్కీంలో రోజుకు రూ.58పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.7.9లక్షలను సొంతం చేసుకోవచ్చు. ఈ పాలసీ కింద 8 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసున్న మహిళలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు మరణించిన తర్వాత కూడా ఈ పథకం కింద మొత్తం డబ్బు నామినీకి ఇవ్వబడుతుంది.నేటికీ ఎల్ఐసీ అనేది ఒక నమ్మకమైన కంపెనీగా పేర్గాంచింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు నేటికీ ఎల్‌ఐసి, పోస్టాఫీసులో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. LIC కూడా కొత్త కొత్త ప్లాన్లను తెస్తూ తన కస్టమర్లను ఎప్పుడూ నిరాశపరచదు. తాజాగా LIC ఆధార్ శిలా ప్లాన్ ను తీసుకొచ్చింది. అలాగే, మెచ్యూరిటీ సమయంలో వెంటనే వారి డబ్బును తిరిగి చెల్లిస్తుంది కంపెనీ. 30 సంవత్సరాల వయస్సులో, మీరు ఈ పథకంలో వరుసగా 20 సంవత్సరాల పాటు ప్రతిరోజూ రూ. 58 డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు మీ మొదటి సంవత్సరంలో మొత్తం రూ. 21918 డిపాజిట్ చేయబడుతుంది. దానిపై మీరు కూడా 4.5 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత రెండో సంవత్సరంలో మీరు రూ. 21446 చెల్లించాలి. ఈ విధంగా, మీరు ఈ ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన జమ చేస్తారు. మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 429392 డిపాజిట్ చేస్తారు. దీని తర్వాత, మెచ్యూరిటీ సమయంలో, మీరు మొత్తం రూ. 794000 పొందుతారు.

‘లైగర్’ తరువాత కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమా పరాజయం నుంచి బయటపడడానికి రౌడీ హీరోకు చాలా సమయమే పట్టింది. మధ్యలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమానత హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇది ఇంకా సెట్స్ మీద ఉండగానే విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. జెర్సీ సినిమాతో నానికి బిగ్గెస్ట్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్.. VD12 చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో విజయ్ పోలీస్ దుస్తుల్లో మాస్క్ వేసుకొని కనిపించాడు. ” నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు” అని ఒక స్పై చెప్పిన వాక్యాన్ని రాసుకొచ్చారు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి సారి వీడీ స్పై గా, పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో మిగతా నటీనటుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.