NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. అంతకంటే ముందే.. సంక్రాంతి సెలవులు వస్తాయి.. దీంతో.. ముందుగానే స్కూల్స్‌, కాలేజీలు, విద్యాసంస్థల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేశారు.. అయితే, ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.. బాధిత విద్యార్థులను అమలాపురంలోని ‌శ్రీనిధి ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలోనే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.. గొల్లవిల్లిలోని విజడమ్ స్కూల్‌లో ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలైన ముగ్గురు విద్యార్థుల్లో.. ఇద్దరు చిన్నారులు మూడో తరగతి చదువుతుండగా.. ఓ యూకేజీ బాలుడికి కూడా గాయాలయ్యాయి.. పిల్లలు బోగిమంట దగ్గర ఉండగా.. మంటలపై పెట్రోల్‌ పోయడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యార్థులకు అంటుకున్నాయి.. ఇక, విద్యార్థుల విషయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించారంటూ స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు్న్నారు.. గాయపడిన విద్యార్థులు 1. వనిషా (8) మూడవ తరగతి.. 2. మధుర కీర్తన (8) మూడవ తరగతి.. 3. సామియల్ స్టీఫెన్ (6) యూకేజీగా గుర్తించారు.. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇక, సాధారణంగా సంక్రాంతి సందర్భంగా పాఠశాలల్లో ముగ్గుల పోటీలు, ఇతర పోటీలు పెడతారు. భోగి మంటలు వంటి కార్యక్రమాలకు మాత్రం అధికారులు అనుమతి ఇవ్వరని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు..

విశాఖలో వందే భారత్‌ ట్రైన్‌పై రాళ్ల దాడి..
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ప్రధాని తన పర్యటనను వాయిదా వేశారు.. అయితే, ఇండియన్ రైల్వేస్ 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది.. క్రమంగా.. వివిధ రూట్లలో ఈ రైళ్లను పట్టాలెక్కిస్తోంది.. అయితే, విశాఖలో వందే భారత్ ట్రైన్ బోగీలపై రాళ్లదాడి జరిగింది.. కంచరపాలెంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వందే భారత్‌ ట్రైన్‌పై రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసం అయ్యినట్టు తెలుస్తోంది.. ట్రయిల్ రన్‌లో భాగంగా చెన్నై నుండి విశాఖకు వచ్చింది వర్షన్‌ 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. దీనిపై దాడికి పాల్పడ్డారు దుండగులు.. ఈ ఘటనతో అప్రమత్తం అయిన రైల్వే అధికారులు ఆర్పీఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపారు.. వందేభారత్‌ ట్రైన్‌ పై రాళ్లదాడి నిజమేనని చెబుతున్నారు వాల్తేర్ డివిజన్ అధికారులు.. కాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో ప్రారంభం కానున్న వందే భారత్‌ ట్రైన్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌ ఎంట్రీతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు తగ్గిపోనుంది. అయితే, ఆదిలేనే.. అది కూడా ప్రారంభానికి నోచుకోకముందే.. రైలుపై రాళ్ల దాడి జరగడంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’పై లోకేష్‌ ట్వీట్.. చిచ్చు పెట్టే కుట్ర..!
సంక్రాంతి వేళ ప్రేక్షకులకు అసలు, సిసలైన పండుగను పంచేందుకు సిద్ధం అయ్యారు మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఒకేరోజు తేడాతో ఈ సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి.. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. మెగాస్టార్‌ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే.. 13వ తేదీన విడుదల కాబోతోంది.. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.. ఇక, సినిమాల కోసం అటు నందమూరి ఫ్యాన్స్‌, ఇటు మెగాఫ్యాన్స్‌ ఎదురుచూస్తోన్నారు.. ఇప్పటికే పాజిటివ్‌ రివ్యూస్‌ కూడా ఉన్నాయి.. అయితే, ఈ రెండు సినిమాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.. రెండు సినిమాలకు అభినందనలు తెలుపుతూనే.. చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోందని అనుమానాలను వ్యక్తం చేశారు. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపై ట్వీట్‌ చేసిన లోకేష్‌.. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు.. సంక్రాంతికి ప్రేక్షకుల‌కు వినోదం పంచేందుకు వీర సింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య, వాల్తేరు వీర‌య్యగా వ‌స్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు.. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను కోట్లాది ప్రేక్షకుల‌లో ఒక‌డిగా నేనూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నా.. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి.. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ స‌న్నద్ధమైంది.. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని వాడుకుని సోష‌ల్‌ మీడియాలో ఫేక్‌ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మ‌రో కులంపై విషం చిమ్మాల‌ని కుట్రలు ప‌న్నారని ఆరోపించారు.. విష‌ప్రచారాలు చేసి కుల‌, మ‌త‌, ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర కలిగినవారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దు అని సూచించారు. సినిమాలు అంటే వినోదం.. సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొడ‌దాం.. మ‌న‌మంతా ఒక్కటే. కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు నారా లోకేష్‌.

వైసీపీ, ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన నాగబాబు.. మీ తాత, అయ్యా ఇచ్చారా?
ఏపీలోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ)పై ఓ రేంట్‌లో ఫైర్‌ అయ్యారు మెగా బ్రదర్‌, జనసేన నేత నాగబాబు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ స్టార్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్‌లో అడుగుతున్నానన్నారు.. కానీ, అలా అనను.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ అవసరమా..? అని ప్రశ్నించారు. మీ లాగా లక్షలాది, కోట్లాది రూపాయలు మావద్ద లేవు.. మాకున్న కొద్ది పాటి డబ్బుని, రిసోర్స్ ను అందరికీ పంచుతున్నామని వెల్లడించారు.. ప్యాకేజీ అంటూ బావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ తాత, అయ్యా మాకు ప్యాకేజీ ఇచ్చారా? అని నిలదీశారు.. మేం అన్ని కులాలను గౌరవిస్తాం.. మాకు కుల పిచ్చి లేదని స్పష్టం చేశారు నాగబాబు. ఇక, రేపటి యువశక్తి సభ ఎక్స్ లెంట్‌గా ఉంటుంది అన్నారు నాగబాబు.. భయం లేకుండా యువత మాట్లాడేవిధంగా ప్లాట్ పాం ఏర్పాటు చేశాం.. యువత ఆలోచనలు, కోరికలు, రాష్ర్ట అభివృద్ధికి ఇచ్చే సూచనలు తీసుకుంటాం అన్నారు.. యువతను దిశా నిర్దేశం చేయటానికి మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. రేపు పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. మరోవైపు రాంగోపాల్‌వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.. రాంగోపాల్ వర్మ పెద్ద వెదవ.. సన్నాసి.. నీచ్ కమీన్‌ కుత్తె.. అలాంటి వారి గురించి నేను మాట్లాడబోను అన్నారు.. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని ఫైర్‌ అయ్యారు.. నేను కాపు కులంలో పుట్టాను.. కాపు కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తాను.. కానీ, కులపిచ్చి లేదన్నారు.. ఒక కులం గురించి మాట్లాడడం తప్పు అని హితవుపలికిన ఆయన.. కాపులకు ఆత్మాభిమానం లేదా..? అని ప్రశ్నించారు.. అసలు ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుంది.. అందరికీ ఆత్మాభిమానం ఉంటుందిగా? అన్నారు. ఎన్టీఆర్‌ని, చంద్రబాబుని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని, మళ్లీ చంద్రబాబును.. ఇప్పుడు సోకాల్డ్ అడ్డగాడిదలను కూడా గెలిపించింది కాపులే అని తెలిపారు.. అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకు ఎక్కడుందని నిలదీశారు నాగబాబు.

ఐపీఎల్‌ లవర్స్‌కు జియో గుడ్‌న్యూస్‌..
ఐపీఎల్‌ సీజన్‌కు సమయం దగ్గర పడుతోన్న వేళ.. క్రికెట్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పింది రిలయన్స్‌ జియో.. జియో సినిమా యాప్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2022ని ఉచితంగా ప్రసారం చేసిన తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ డిజిటల్ ప్రసారం కోసం రిలయన్స్ ఇదే మోడల్‌ను ప్రయత్నించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. రిలయన్స్ వెంచర్ అయిన వయాకామ్ 18, ఐపీఎల్ 2023-2027 సీజన్‌ల డిజిటల్ మీడియా హక్కులను గతేడాది రూ. 23,758 కోట్లకు కొనుగోలు చేసింది. లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ మార్కెట్‌కు అంతరాయం కలిగించే ప్రణాళికను అమలు చేయడానికి వయాకామ్‌ 18 బహుళ వ్యూహాలను అన్వేషిస్తోందని మూలాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. నగదు సమృద్ధిగా ఉన్న రిలయన్స్ మార్కెట్ వాటాను కార్నర్ చేయడానికి చౌక లేదా ఉచిత ఉత్పత్తులను అందించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఇది అత్యుత్తమ వీక్షణ అనుభవం కోసం సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలను అందించడం కొనసాగిస్తుందని పేర్కొంది. ఐపీఎల్ ప్రసారాన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని, జియో టెలికాం సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలతో ఉచిత ఐపీఎల్‌ వీక్షణను బండిల్ చేయడం లేదా ప్రత్యర్థి మొబైల్ ప్లాన్‌లు ఉన్న వినియోగదారులకు జియో సినిమాలో ఉచిత ప్రసారాన్ని యాక్సెస్ చేయడానికి కంపెనీ యోచిస్తోంది. జనాదరణ పొందిన క్రీడా కార్యక్రమాలను దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విభాగంలో దాని ప్రధాన ప్రత్యర్థి డిస్నీ+హాట్‌స్టార్‌గా మిగిలిపోయింది, ఇది ఐపీఎల్‌కి డీటీహెచ్‌ హక్కులను కలిగి ఉంది. వయాకామ్‌ 18 యొక్క ఉచిత ఐపీఎల్‌ ఆఫర్.. దాని పోటీదారుల వీక్షకుల సంఖ్యను ప్రభావితం చేయగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఉచిత స్ట్రీమింగ్ మరింత మంది వీక్షకులను తీసుకురాగలదు, ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు.. ఇది మాత్రం ఐపీఎల్‌, క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి.. మ్యాచ్ టైం అయిందంటే చాలు ఇట్టే టీవీలకు అతుక్కుపోయే ఫ్యాన్స్‌కు ఇది శుభవార్తగా చెప్పుకోవాలి..

సీఎం అయితేనేం.. వృతి అంటే ప్రేమ.. 10 ఏళ్ల బాలుడి ఆపరేషన్‌ విజయవంతం..
డాక్టర్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ.. రాజకీయాల్లో అడుగుపెట్టి ఉన్నత పదవులు అలంకరించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పటికే రాణిస్తూనే ఉన్నారు.. అయితే, వారు అవసరం వచ్చినప్పుడు, అత్యవసరం అయినప్పుడు.. వారి వృత్తికి కూడా న్యాయం చేస్తూనే ఉంటారు.. తాజాగా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఓ బాలుడికి విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు.. ఏడు నెలల క్రితం రాజ్యాంగ పదవిని స్వీకరించిన తర్వాత కూడా తన వృత్తి పట్ల అతని నిబద్ధతను చాటుకున్నారు.. ఈరోజు ఉదయం 9 గంటలకు హపానియాలోని తన పాత కార్యాలయమైన త్రిపుర వైద్య కళాశాలలో 10 ఏళ్ల బాలుడి నోటి సిస్టిక్ గాయం ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగారు.. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చిరునవ్వుతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు.

అత్యంత బలహీనమైన పాస్‌పోర్టు పాకిస్థాన్‌దే.. మరి భారత్‌ సంగతేంటి?
2023లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టుతో వీసా లేకుండానే 193 ప్రపంచ దేశాల్లో ప్రయాణించవచ్చు. తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. జపాన్‌ దేశం వరుసగా ఐదో సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది.  ర్యాంకింగ్‌లో సింగపూర్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ రెండో స్థానంలో నిలిచిన ఆ రెండు దేశాల ప్రజలు పాస్‌పోర్టుతో 192 దేశాల్లో వీసా-రహిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత జర్మనీ, స్పెయిన్, ఆపై ఇతర యూరోపియన్ దేశాలు ఉన్నాయి. జర్మనీ, స్పెయిన్‌ దేశాల పాస్‌పోర్ట్‌లు మూడో స్థానంలో ఉండగా.. ఫిన్లాండ్, లక్సెంబర్గ్‌, ఇటలీ దేశాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌ దేశాల పాస్‌పోర్టులు ఐదో స్థానంలో.. ఫ్రాన్స్‌, ఐర్లాండ్, పోర్చుగల్‌, బ్రిటన్‌ దేశాలు ఆరో స్థానానికి పరిమితమయ్యాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో వీసా లేకుండా 187 దేశాల్లో పర్యటించవచ్చని హెన్లీ పాస్‌పోర్ట్ నివేదికలో పేర్కొంది. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ మరియు నార్వే వంటి వాటితో సరిపోలే 186 ప్రదేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో అమెరికా టాప్ 22లో ఉంది. బొలీవియా మాదిరిగానే చైనా 80కి యాక్సెస్‌ని అనుమతిస్తుంది. రష్యా మెరుగైనది, 118 గమ్యస్థానాలకు అవాంతరాలు లేకుండా ప్రవేశాన్ని అందిస్తోంది, అయితే ఆఫ్ఘనిస్తాన్ బలహీనంగా ఉంది, కేవలం 27 మాత్రమే అందుబాటులో ఉంది.

సిగరెట్‌ కంటే చుట్ట మంచిది.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
అఖండ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. ఈసినిమాలో అందాల తార శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే..ఈ సినిమా ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మైత్రీ మేకర్స్‌. ఈ సినిమాలోని కీలకమైన పాత్రతో హనీ రోజ్ పరిచయమవుతోంది. అయితే.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు చుట్ట తాగే అలావాటు ఉందని, రోజు ఉదయం లేచిన వెంటనే చుట్ట తాగుతానని అన్నారు. వీరసింహారెడ్డి సినిమాలో చుట్ట తాగడం స్టైల్‌ కూడా అందరినీ ఆకర్షిస్తుందని వివరించారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్‌ కోసం చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని డైరెక్టర్‌ గోపీచంద్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే చుట్టు కూడా పెట్టామన్నారు. అయితే.. చుట్ట తాగడం వల్ల గొంతు క్లీన్‌గా.. ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం పోయి.. గొంతు గంభీరంగా వస్తుందని, డైలాగ్‌ చెప్పేటప్పుడు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు చుట్ట తాగుతుంటానని బాలకృష్ణ తెలిపారు. అదే సమయంలో.. చుట్టను సిగరెట్‌లా లోపలికి పీల్చుకోకుండా.. కేవలం నోట్లోకి మాత్రమే పీల్చుకుంటామని.. సిగరెట్‌ కంటే చుట్ట మంచిదని బాలయ్య వివరించారు.

హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.. చిరు సూటి ప్రశ్న
ఆమధ్య ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లపై రగడ జరిగినప్పుడు.. హీరోల రెమ్యునరేషన్‌పై కూడా నానా రాద్ధాంతం జరిగిన వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు హీరోలు కోటానుకోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, సినిమా బడ్జెట్‌లో పెట్టే మొత్తంలో సగం డబ్బులు వారికే ఇవ్వాల్సి వస్తోందంటూ అప్పట్లో తెగ చర్చలు జరిగాయి. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే.. సినిమాల బడ్జెట్ కూడా తగ్గుతుందని, ఫలితంగా టికెట్ రేట్లను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కేటాయించవచ్చని కొందరు మేధావులు విశ్లేషించారు. ఇప్పటికీ ఈ పారితోషికం విషయం అనేది హాట్ టాపిక్‌గానే ఉంది. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందేనని డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఈ రెమ్యునరేషన్ విషయంపై ఓ ప్రశ్న ఎదురైనప్పుడు.. అసలు హీరోలు ఎందుకు తమ పారితోషికం తగ్గించుకోవాలని ఆయనే సూటిగా ప్రశ్నించారు. తన వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో.. సినిమాల బడ్జెట్ గురించి చిరు ప్రస్తావించారు. ఈ సమయంలోనే యాంకర్ జోక్యం చేసుకొని.. ‘‘బడ్జెట్‌లో సగం మొత్తం హీరోల రెమ్యునరేషన్‌కే పోతోందని, వాళ్లు ఎందుకు తమ పారితోషికం తగ్గించుకోకూడదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయని, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటని’’ ప్రశ్నించారు. అప్పుడు చిరు వెంటనే అందుకొని.. ‘‘ఎందుకు తగ్గించుకోకూడదు’’ అంటూ వెంటనే నిలదీశారు. తనకంటూ ఒక పెద్ద మార్కెట్ ఉన్న హీరో వల్లే ఒక సినిమాకి భారీ బిజినెస్ జరిగినప్పుడు.. తన లైన్ షేర్‌ని హీరో తీసుకోవడంలో తప్పేంటని అన్నారు.

చరిత్ర సృష్టించిన సూర్య.. ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్
టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా దూసుకెళ్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఒక అర్థశతకం, ఒక శతకంతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున ఏ ఒక్కరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు తేలింది. దీంతో.. పొట్టి ఫార్మాట్‌లో అతని అగ్రస్థానం మరింత పదిలం అవ్వడమే కాదు, 900 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్‌ పాయింట్స్‌ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లో సెంచరీ చేయడం వల్లే.. అతడు 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని అందుకోగలిగాడు. ఇంతకుముందు టీ20 ర్యాంకింగ్స్‌ చరిత్రలో కేవలం ఇద్దరు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని చేరుకోగలిగారు. ఇప్పుడు లేటెస్ట్‌గా సూర్యకుమార్ 900 మార్క్‌ని అందుకొని, వారి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య తర్వాత పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ అల్లంత దూరాన ఉన్నాడు. 836 రేటింగ్ పాయింట్లతో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్‌ కాన్వే, బాబర్‌ ఆజమ్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మలాన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రిలీ రొస్సో, ఆరోన్‌ ఫించ్‌, అలెక్స్‌ హేల్స్‌ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ జాబితాలో 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇప్పటివరకూ 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్‌ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.