లోకేష్ పాదయాత్ర… టీడీపీకి పాడే యాత్రే..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్ గా సాగిందన్నారు.. లోకేష్ పాదయాత్రకు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా సంఘీభావం తెలపడం లేదని విమర్శలు గుప్పించారు.. ఆ పరిస్థితి చూస్తుంటే.. అసలు తెలుగుదేశం పార్టీ ఉందా? ఏపీలో అనే సందేహం కలుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడి పాదయాత్రకే ఈ పరిస్థితి ఉంటే.. పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు తోపుదుర్తి.
భుజాలపై భార్య మృతదేహంతో భర్త.. మానవత్వం చాటిన ఏపీ పోలీసులు
ఆస్పత్రిలో కన్నుమూసిన భార్యను ఇంటికి చేర్చడానికి ఓ భర్త దగ్గర డబ్బు లేదు.. ఇక చేసేది ఏమీ లేదు.. గమ్యం మాత్రం చాలా దూరం.. అయినా కట్టుకున్న భార్య మృతదేహాన్ని తన ఊరికి చేర్చాలనుకున్నాడు.. విజయనగరం జిల్లాలోని నీరుకొండ ఆస్పత్రి నుంచి తన భార్య మృతదేహాన్ని భూజాలపై వేసుకొని బయల్దేరారు.. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఇదిగురు అనే మహిళ అనిల్ నీరుకొండ ఆసుపత్రిలో మృతి చెందింది.. మృతదేహాన్ని ఒడిశాలోని తన స్వగ్రామానికి తరలించడానికి భర్త దగ్గర డబ్బులు లేవు.. దీంతో.. భర్త.. ఇదిగురు మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఒడిశా కోరాపుట్టి జిల్లా పొట్టంగి బ్లాక్ కోసాదికి బయల్దేరారు.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.. దీనిపై వెంటనే స్పందించిన విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్.. హుటా హుటిన బయల్దేరి శవాన్ని మోసుకుంటు వెళ్లిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి.. వివరాలు సేకరించారు.. ఆ తర్వాత ఒక అంబులెన్సును ఏర్పాటు చేసి శవాన్ని వాళ్ల స్వగ్రామైన ఒడిశాకు తరలించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ వ్యక్తి.. విజయనగరం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.. మొత్తంగా విజయనగరం పోలీసులు వెంటనే స్పందించి మానత్వం చాటడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే..!
2024 ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చమెత్తుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను పాదయాత్ర చేస్తుంటే.. జేసీ కరపత్రాలు పంచుతున్నాడని మండిపడ్డారు.. జేసీ సోదరులకు సవాల్ విసురుతున్నాను… నా మీద, నా కుటుంబసభ్యుల మీద అక్రమ కేసులు పెడితే, దానికి మ్యూల్యం మీ ఇంటి నుంచి మొదలు అవుతుందని హెచ్చరించారు.. ఇదే సమయంలో.. 2024 ఎన్నికలలో వ్తెసీపీ గెలిస్తే తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ బిచ్చమెత్తుకోవాలని వ్యాఖ్యానించారు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాను రౌడీ అని చెప్పుకుంటున్నాడు… ప్రతి వ్తెసీపీ కార్యకర్త, నాయకుడు కూడా రౌడీలే నంటూ చెప్పుకొచ్చారు.. జేసీ సోదరులపై ఉన్న కేసులపై చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు తాడిపత్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇక, పెద్దవడుగూరులో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటుందని ప్రశ్నించారు. పప్పుదినుసులను కూడా గుర్తు పట్టలేని లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత అసలు జేసీ బ్రదర్స్‌కు లేదన్నారు.. తాడిపత్రిలో రాజకీయం చేయాలంటే కత్తికి కత్తి పట్టాల్సిందేనని హాట్ కామెంట్లు చేశారు. మరోవైపు.. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ కరువు వస్తుందని విమర్శలు గుప్పించారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ఇవాళ ముగిసింది.. 11 రోజుల పాటు 110 కిలోమీటర్ల మేర పెద్దవడుగూరు మండలంలో ఈ యాత్ర కొనసాగింది.. యాత్ర ముగింపు సభ పెద్దవడుగూరులో నిర్వహించారు.
దృశ్యం సినిమా స్టోరీని మరిపించే ట్విస్ట్.. కొడుకును కొట్టి చంపిన తల్లి..!
ఓ హత్య కేసులో చుట్టూ తిరిగే దృశ్యం సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూపించారు దర్శకుడు.. ఈ తరహా ఘటనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి.. తాజాగా, కృష్ణ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ కసాయి త్లి.. రోకలిబండతో కొట్టి కొడుకు దీప్‌చంద్‌ను హత్య చేసిన ఆమె.. ఎవరూ చంపేశారంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు.. తల్లి ప్రవర్తనలో తేడాను గుర్తించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.. గన్నవరం ఏసీపీ విజయపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొడుకు చేసిన అప్పులు కట్టలేక ఈ దారుణానికి ఒడిగట్టింది దీప్ చంద్ తల్లి రమా.. అప్పులు చేయడమే కాదు.. తల్లిని డబ్బులు కావాలి ఇస్తావా? చస్తావని వేధించడంతో.. ఆ వేధింపులు తట్టుకోలేక.. కొడుకునే కాటికి పంపాలని ప్లాన్ చేసింది.. నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో కొట్టి చంపేసింది.. ఉదయం 5.30 గంటలకు మృతుడి తండ్రి లేచి పనికి వెళ్లిపోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో మోదీ చంపేసింది తల్లి.. అయితే, అనంతరం తలుపు వేసి తల్లి బయటికి వెళ్లి పశువుల దగ్గర పని చూసుకుంది.. ఉదయం 6:30 గంటలకు పాలు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది.. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి ఎవరో వచ్చి.. మన అబ్బాయిని కొట్టి వెళ్లిపోయారు.. రక్తం మడుగులో పడి ఉన్నాడు అని సమాచారం చేరవేసింది.. ఎవరో వచ్చి కొట్టి చంపినట్టు గ్రామస్తుల్ని, పోలీసుల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, తన కూతురు కుమార్తెను తానే చూసుకుంటున్న నిందితురాలు.. ఆ పిల్లలు రెడీ చేసి స్కూల్‌కి పంపించేసింది.. కొడుకు చనిపోతే.. మనవరాలిని ఎలా స్కూల్‌కు పంపించింది..? అనే విషయంలో పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో, ఆమెను తమదైన శైలిలో విచారించగా.. నేనే కొట్టి చంపానని అంగీకరించింది తల్లి.
ఒళ్లు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిది
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హాత్ సే హాత్ జోడో పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ యాత్ర ములుగు నియోజకవర్గంలో రెండు రోజులు కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి భవన్ పదెకరాల విస్తీర్ణంలో 110 గదులతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారని.. కానీ ప్రగతి భవన్ పేద ప్రజలకు ఉపయోగపడదన్నారు. ఆ భవనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని భవనాన్ని నక్సలైట్లు పేల్చేయాలన్నారు. గతంలో మావోలు దొరల గడీలను పేల్చి వేసినట్టు ప్రగతి భవన్ ను కూడా పేల్చివేయాలని.. నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ శిబిరంలోని నేతలకు కోపం తీసుకువచ్చింది. దీంతో.. బీఆర్‌ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ లైనా? అని ప్రశ్నించారు. నక్సలైట్లను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ.. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏంటి? అని ఆమె అన్నారు. అనర్హుడైన రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఇలాంటి గతి పడుతుందనడానికి ఇదే ఉదాహరణ అని ఆమె అన్నారు. ఇలానే రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ పోతే… భవిష్యత్ లో తిరగలేవని ఆమె హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి యాత్ర మానుకోట దాటదు అని అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. లేని నక్సలైట్లను ముందు పెట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏంటి అని ఆమె అన్నారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారు
రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయడమే కాంగ్రెస్ పార్టీకి ముప్పు అంటూ విమర్శలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ అది నాశనమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటమ్ సాంగ్ లెక్కనే చూస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు అంతా కిరాయి మనుషులు.. కాంగ్రెస్ నేతలు ఎవరూ రారని ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేస్తే బ్రేక్ లేకుండా చేయాలి… ములుగులో చేసి నర్సంపేటలో ఎందుకు చేయలేదని, రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి నా కింద పనిచేసినప్పుడు నేను తిట్టేవాన్ని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మద్దతుగానా? రెచ్చగొట్టినట్లా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తో మోడీ ఆఫీస్ ను పేల్చాలనే ప్రకటన చేయించు అని ఆయన సవాల్ విసిరారు. కారెక్కి పోయే యాత్రను..పాదయాత్ర ఎలా అంటారు? అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇలానే ఉంటే… చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక్కో లీడర్ కు ఒక్కో టైప్ పాలన ఉంటుందని, కేసీఆర్ ప్రజల మనిషి అని ఆయన అన్నారు. నక్సలైట్ల ఎజెండాలో చంపుడు ఉండదు.. వాళ్ళ ఎజెండా ప్రజల అభివృద్ధి కోసం ఉంటుందని, గడిలా పాలన కాదు.. ప్రజల పాలన నడుస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర చదువుతో పాటు దోపిడీలు, దొంగతనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రేపు హోంమంత్రికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ..
భారీ భూకంపాల ధాటికి టర్కీ కుదేలైంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 11,200 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇండియా కూడా తన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఇతర వైద్య సహాయాన్ని టర్కీకి పంపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంభవించిన భూకంపం ధాటికి టెక్టానిక్ ప్లేట్ మూడు అడుగులు(10మీటర్ల) వరకు కదిలి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని మాట్లాడుతూ.. సిరియాతో పోలిస్తే టర్కీ పశ్చిమం వైపు 5-6 మీటర్లు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే రాజుల్లో శాటిలైట్ చిత్రాలు వచ్చిన తర్వాత మరింత సమాచారం వస్తుందని తెలిపారు. 190 కిలోమీటర్ల పొడవు 25 కిలోమీటర్ల వెడల్పుతో భూమిపై పగుళ్లు ఏర్పడి, భూమి తీవ్రంగా కదిలినట్లు ఆయన వెల్లడించారు. తొమ్మిది గంటల వ్యవధి రెండు శక్తివంతమైన భూకంపాలతో పాటు వందకు పైగా భూకంపాలు టర్కీ ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వెల్లడించారు.
వైస్ కెప్టెన్‌నే పక్కన పెట్టేశాడు.. హర్భజన్ ఫైనల్ ఎలెవన్ ఇదిగో!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే తొలి టెస్టు గురువారం (ఫిబ్రవరి 9) ప్రారంభంకానుంది. ఇప్పటికే రెండు జట్లు నెట్స్‌లో చెమటోడ్చాయి. ముఖ్యంగా భారత్ స్పిన్ పిచ్‌లకే మొగ్గు చూపుతుందన్న కారణంతో ఆసీస్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. ఇక టీమిండియా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్క సిరీసే మిగిలి ఉంది. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిస్తే రోహిత్‌సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ చాంపియన్ షిప్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. అందుకే తుదిజట్టుపై ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ ఎలెవన్‌పై పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. కెప్టెన్ రోహిత్ కూడా మ్యాచ్‌కు ముందే తుది జట్టుపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపాడు. ఈ క్రమంలో పలువురు మాజీలు జట్టుపై కొన్ని సూచనలు చేస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్ కూడా తన టీమ్ ప్రకటించాడు. ఇందులో ఈ సిరీస్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్‌తో పాటు యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు భజ్జీ. ఇటీవల ఫామ్ చూసుకుని రాహుల్ కంటే గిల్ వైపే మొగ్గు చూపాడు. ఇక తర్వాతి స్థానాల్లో పుజారా, కోహ్లీ, సూర్యకుమార్‌ను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా తెలుగోడు కేఎస్ భరత్‌కు చోటిచ్చాడు. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్‌ను స్పిన్ కోటాలో తీసుకుని కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి చూపాడు. ఇక షమీ, సిరాజ్‌లను పేసర్లుగా ఎంపిక చేశాడు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి
ట్రాన్స్‌జెండర్‌ల పెళ్లి ఎలా ఉన్నా వారికి మాతృత్వ, పితృత్వ ఆనందం మాత్రం దక్కే అవకాశం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని, జీవితంలో పిల్లలు పుడితే కలిగే ఆనందాన్ని పొందింది ఓ ట్రాన్స్‌జెండర్ జంట.కేరళకు చెందిన జియా, జహద్ దంపతులు పండంటి బిడ్డను కన్నారు. దీంతో వీరు దేశ చరిత్రలోనే బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జంటగా నిలిచారు. దేశంలో తొలిసారిగా వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి సృష్టికి భిన్నంగా తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన ఈ ట్రాన్స్ జెండర్ జంట బుధవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగా మారిన అతడు వెల్లడించాడు. ఇటీవలే జియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో జహద్ 8 నెలల గర్భవతి అని.. మార్చి 4న బిడ్డకు జన్మనిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు జహద్కు సిజేరియన్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని జియా తెలిపారు.
ఢీ కావాలో.. పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకో అన్నాడు
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నటుల్లో హైపర్ ఆది ఒకడు.. కామెడీ టైమింగ్ కేరాఫ్ అడ్రెస్స్.. పంచ్ డైలాగ్స్ కు పర్మినెంట్ అడ్రెస్స్ గా ఆది పేరు మారుమ్రోగిపోతోంది. ఇక జబర్దస్త్ నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చాడు ఆది. కమెడియన్ గానే కాకుండా మాటల రచయితగా కూడా మారాడు. ధమాకా సినిమాకు డైలాగ్స్ ఇచ్చింది హైపర్ ఆదినే అంట. ఇక ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న ఆది.. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఆది మొదటి కోలీవుడ్ మూవీ వాతి. అదేనండీ తెలుగులో సార్. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. ఫిబ్రవరి 17 న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పై పంచ్ లు వేశాడు. ” మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు.. పైకి ప్రొడ్యూసర్ లా కనిపిస్తాడు కానీ ఆయనలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆయన లోపాలు అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంటుంది.. అల్లు అర్జున్ గారంత యాక్టివ్ నెస్ ఉంటుంది. త్రివిక్రమ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి చిన్న రైమింగ్, టైమింగ్ ఉంటుంది. వీటన్నింటి మధ్యలో ఆయనకెప్పుడైనా నిజాయితీగా అనిపించి ఒక మాట అంటే అది మీకు వేరేలా అనిపించి ఏదేదో రాసేస్తారు. నిజం చెప్పాలంటే..పాపం ఆయన చాలా నిజాయితీగా మాట్లాడతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను భీమ్లా నాయక్ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశాను. ఆ సమయంలో ఒకరోజు ఆయనకు ఫోన్ చేసి సార్.. ఒక హాఫ్ డే కావాలి సార్.. ఢీ షూటింగ్ కు అడుగుతున్నారు అని చెప్పా.. అలా అడిగితే ఏ నిర్మాత అయినా ఏం చెప్తాడు.. అమ్మోమ్మో కుదరదమ్మా.. ఇది చాలా ముఖ్యం.. కానీ ఆయన స్ట్రైట్ గా ఏం చెప్పారో తెలుసా.. ఢీ కావాలా.. పవన్ కళ్యాణ్ గారు కావాలా అని అడిగారు. ఆ ఒక్క మాటతో నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ భీమ్లా నాయక్ షూటింగ్ కు వెళ్ళాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హైపర్ ఆది వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతోంది.. ఏం చెప్పారు ‘సార్’
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అవుతోంది. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడిన సార్ ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ప్రభుత్వ విద్యను.. కొంతమంది ప్రైవేట్ కాలేజీలు ఎలా మోసం చేస్తున్నాయి.. వాటిని ఒక జూనియర్ లెక్చరర్ ఎలా అడ్డుకున్నాడు అనేది సార్ కథ అని టీజర్ లోనే చూపించేశారు. ఇక ట్రైలర్ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ మేళవించి కట్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. “ఎవరు సార్ ఆయన.. నా గురు బాలు సార్” అని ఒక వ్యక్తి ఎమోషనల్ గా చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఈ దేశంలో చదువు అనేది ఒక నా ప్రాఫిటబుల్ సర్వీస్ అని సముద్ర ఖని బేస్ వాయిస్ తో చెప్పడంతోనే ఆయనే విలన్ అని తెలిసిపోతోంది. సింపుల్ గా కథ విషయానికొస్తే.. త్రిపాఠీ ఇన్స్టిట్యూషన్స్ తరుపున రాష్ట్రంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజ్ లను సముద్ర ఖని దత్తత తీసుకుంటాడు. అక్కడికి జూనియర్ లెక్చర్లను చదువు చెప్పడానికి పంపిస్తాడు. అలా ఒక గ్రామంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్ కు లెక్చరర్ గా వెళ్లిన సార్.. బాలు. ఆ కాలేజ్ లో అతనికి మీనాక్షి అనే బయోలజీ టీచర్ తో ప్రేమలో పడతాడు. పేరుకు ప్రభుత్వ కాలేజే కానీ, ఆ ఊర్లో విద్యార్థులు కాలేజ్ కు రావాలంటే ఫీజ్ కట్టాల్సిందే. అందుకని హాజరు పత్తిలో పేర్లు ఉన్నా కాలేజ్ కు మాత్రం ఎవరు రారు. ఇక బాలు సార్ వచ్చిన దగ్గరనుంచి ఈ విధానం మారుతుంది. విద్య అనేది వ్యాపారం కాదని చెప్పి విద్యార్థులందరికీ ఫ్రీగా చదువు చెప్తూ ఉంటాడు. అది నచ్చని త్రిపాఠీ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మెన్ సముద్ర ఖని, బాలును చంపడానికి ప్లాన్ చేస్తాడు.. ఇక వారికి ఎదురు తిరిగి సార్ ఏం చేశాడు..? చివరికి విద్యను వ్యాపారం కాకుండా అడ్డుకున్నాడా..? అనేది కథ. ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా విద్య గురించి ధనుష్ చెప్పిన డైలాగ్స్ అయితే దుమ్ము రేపడం ఖాయమని చెప్పాలి. ” డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. కానీ, మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతోంది.. అనే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఇక జీవి ప్రకాష్ సంగీతం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.