NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

మళ్లీ హైదరాబాద్ రోడ్డు ఎక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగనున్నాయి. మంగళవారం చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన ఫార్ములా ఇ-ప్రిక్స్‌తో, ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్ మరియు నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత, నగరానికి పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు చారిత్రక ఔచిత్యాన్ని కలిగి ఉన్నాయి మరియు నిజాం ప్రారంభించిన సంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. మంత్రి కేటీఆర్‌ డబుల్‌ డెక్కర్‌లో ప్రయాణించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్‌లో ఓ పౌరుడి అభ్యర్థన మేరకు డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొచ్చే అవకాశాలను అన్వేషించాలని అధికారులను గతంలో కేటీఆర్‌ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను మంగళవారం ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. HMDA ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సుల సంఖ్యను 20 కి విస్తరించాలని యోచిస్తోంది. ఒక్కో బస్సు ధర రూ.2.16 కోట్లు మరియు ఏడేళ్ల AMCతో వస్తుంది. బస్సులు 65 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌తో పాటు సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఒకే ఛార్జ్‌లో 150 కి.మీల పరిధిని కలిగి ఉంటాయి. 2 గంటల నుండి 2.5 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి.

పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష
పాతబస్తీ అభివృద్ధిపైన పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతూ వస్తున్నదని, ఇప్పటికే హైదరాబాద్ నగరం నాలుగు దిశల విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నదన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని నలు మూలల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటిదాకా ఇదే అలోచనతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, జలమండలి, విద్యుత్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హజరయ్యారు. పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో అందజేశారు. జిహెచ్ఎంసి చేపట్టిన ఎస్సార్డిపి కార్యక్రమంలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలోనూ భారీగా రోడ్డు నెట్వర్క్ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికీ పలు ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద దాదాపు వందల కోట్లతో నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిహెచ్ఎంసి సేపట్టిన సిఆర్ఎంపి కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ కూడా ప్రభావవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు వైడనింగ్ కార్యక్రమం కొంత సవాల్ తో కూడుకున్నదని, అయితే రోడ్డు వైడనింగ్ తప్పనిసరి అయినా ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. పాతబస్తీలో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్ లతోపాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట మూసీపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నదని తెలిపారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు.

పెరిగిన ఆన్‌లైన్ మెడికల్ అపాయింట్మెట్లు.. ఈ సమస్యలు ఉన్నవారే అధికం..
ఇండియాలో ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు పెరుగుతున్నాయి. 2022లో గతేడాదితో పోలిస్తే మెట్రో నగరాల్లో 75 శాతం ఆన్ లైన్ మెడికల్ అపాయింట్లు పెరిగినట్లు ప్రిస్టిన్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో 87 శాతం పెరిగింది. లైబ్రేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన 11.1 కోట్ల డాక్టర్-పేషెంట్ ఇంటారక్షన్ డేటాను పరిశీలించగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెంట్ కోరుతున్నట్లుగా తేలింది. 2021తో పోలిస్తే 2022లో 65 శాతం ఎక్కువ మంది మహిళలు ఆన్‌లైన్ అపాయింట్మెట్లను కోరారు. ఇలా ఆన్ లైన్ అపాయింట్మెంట్లు కోరుతున్నవారిలో గ్యాస్ట్రోఎంటరాజీ, ఈఎన్టీ సమస్యలు ఉన్నవారి సంఖ్య 150 శాతం పెరిగింది. చర్మసమస్యలు 125 శాతం, సైకియాట్రీ అండ్ పీడియాట్రిక్ 110 శాతం, గైనకాలజీ విభాగంలో 100 శాతం ఆన్ లైన్ అపాయింట్మెంట్లు పెరిగాయి. 25-45 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా పిల్లలకు లేదా లైంగిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల కోసం అపాయింట్మెంట్లు బుక్ చేసుకుంటున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారు డయాబెటిస్, బీపీ, కోవిడ్ అనంతర సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలకు, దీర్ఘకాలిక సమస్యలపై ఆల్ లైన్ మెడికల్ సంప్రదింపులను కోరుతున్నారు. పురుషుల్లో వయస్సుతో సంబంధం లేకుండా శృంగార సంబంధిత సమస్యలకు, మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్), గర్భం, ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వంటి వాటిని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.

ఒంటెను చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు.. నేరం ఏమిటో తెలుసా..?
రాజస్థాన్ బికనీర్ లో దారుణంగా ఓ ఒంటెను చంపేశారు. జంతువు చేసిన తప్పుకు మానవులే జంతువులుగా మారుతున్నారు. గ్రామస్తులంతా కలిసి ఒంటెను చనిపోయే దాకా చితకబాదారు. ఇంతకీ ఒంటె నేరం ఏమిటంటే.. ఒంటె తన యజమానిని చంపడమే. దీంతో కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు అంతా కలిసి ఒంటెను దారుణంగా చంపేశారు. ఈ ఘటన రాజస్థాన్ బికనీర్ లో చోటు చేసుకుంది. ఒంటె, దాని యజమాని మెడను కొరికింది.. ఇది జరిగిన కొద్ది సేపటికే అతను మరణించాడు. దీంతో ఒంటెను చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి చంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బికనీర్ జిల్లా నోఖా పట్టణంలోని పంచు గ్రామంలో యజమాని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒంటెను కొడుతుండటం కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం ఒంటె యజమాని సోహన్ రామ్ నాయక్ (45) ఒంటెల బండితో గ్రామానికి చేరుకున్నాడు. ఈ సమయంలో ఒంటెను పొలానికి తీసుకెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న సోహాన్ రామ్ నాయక్ మెడపై గట్టిగా కొరింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయి అతడు అక్కడికక్కడే మరణించాడు. 20 రోజుల క్రితమే సోహన్ రామ్ ఒంటెను కొనుగోలు చేసినట్లు అతని బంధువులు తెలిపారు. మచ్చిక చేసుకోకుంటే ఒంటే తీవ్రంగా ప్రవర్తిస్తుంది. మృతుడు సోహన్‌రామ్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒంటె బతికి ఉంటే మరింతమందికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే చంపినట్లు గ్రామస్తులు వెల్లడించారు.

జేఈఈ మొయిన్స్‌ ఫలితాలు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE మెయిన్) 2023, సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాన్ని చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 6న విడుదల చేయబడింది. జనవరి 24, 25, 28, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2023 మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇప్పుడు jeemain.nta.nic.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే.. అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతో జేఈఈ మొయిన్‌ సెషన్ 1 ఫలితాలు చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ పేపర్‌లో మొత్తం 20 మంది అభ్యర్థులు 100 శాతం మార్కులు సాధించారు. అందులో 14 మంది జనరల్ కేటగిరీ, నలుగురు OBC-NCL, మరియు gen-EWS మరియు SC కేటగిరీ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. 99.99 పర్సంటైల్ సాధించిన బాలికలు ఇద్దరు ఉన్నారు. అయితే.. జేఈఈ మెయిన్‌కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ కూడా ఇవ్వబడింది. ఈ సారి మొత్తం 8.6 లక్షల మంది అభ్యర్థులు పేపర్ 1, 46 వేల మంది అభ్యర్థులు పేపర్ 2 పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పేపర్‌కు మొత్తం 95.79 శాతం హాజరయ్యారు. అయితే.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజేన్సీ (NTA) ప్రవేశ పరీక్షను నిర్వహించడం ప్రారంభించినప్పటి నుండి ఇది అత్యధికం. జేఈఈ మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు.

వేలంలో మొత్తం 409మంది.. రూ.50లక్షల కేటగిరీలో మంధాన, హర్మన్
విమెన్స్ ఐపీఎల్‌కు సంబంధించిన వేలం ప్రక్రియపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 13న జరగబోయే ఈ మెగా వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలిపింది. ఈ వేలానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 1,525 మంది క్రికెటర్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకోగా.. 409 మంది ప్లేయర్లు తుది లిస్టులో చోటు సంపాదించారు. ఇందులో 246 మంది భారత ప్లేయర్లు, 163మంది విదేశీ ప్లేయర్లతో పాటు 8మంది అసోసియేట్ దేశాల వారు ఉన్నారు. అలాగే 202 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు ఇందులో చోటు దక్కించుకోగా.. 199 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వేలంలో భాగం కానున్నారు. ఈ వేలం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 13న మధ్యాహ్నం 2.30గం.కు ప్రారంభమవుతుంది. ఇక ఈ లీగ్ మొదటి సీజన్ మార్చి 4-26 వరకు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో జరగనుంది. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిపి 90 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఈ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైస్ అనేద ప్రథమ కేటగిరీ. ఈ కేటగిరీలో మొత్తం 24 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన, దీప్తి శర్మ, ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపిన సారథి షెఫాలీ వర్మ ఈ కేటగిరీలోనే ఉన్నారు. అలాగే ఎలిస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్, డియాండ్రా డాటిన్‌ వంటి స్టార్ విదేశీ ప్లేయర్లూ ఈ కేటగిరీలో చోటు సంపాదించారు. ఇక రెండోదైన రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌లో 30 మంది ప్లేయర్లకు అవకాశం లభించింది.

ఏం అక్కా.. రెండు నెలల్లో ఇంత విధ్వంసమా..
బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చూస్తే ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవని చెప్పేస్తారు. కొన్ని రోజులు పెళ్లి అంటుంది.. ఇంకొన్ని రోజులు విడాకులు అంటుంది.. మరొకరితో ప్రేమ.. అతడి కోసం ఎదురుచూపులు.. ఇక ఇవన్నీ ఆగిపోయి చక్కగా పెళ్లి చేసుకుంది అని ఆనందించేలోపు. తన భర్త తనను వేధిస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హిందీ బిగ్ బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్న రాఖీ.. జనవరిలోనే అదీల్ దురానీని వివాహమాడింది. అతనితో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ అప్పుడు కూడా పెద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. ఎయిర్ పోర్టులో అతని రాక కోసం నిద్రాహారాలు మానేసి ఎదురుచూసింది.అతను నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టింది. ఇక ఆ తరువాత రోజు అతను రావడంతో హాగ్ చేసుకోని ముద్దు పెట్టి.. అతడే నా ప్రేమికుడు అని చెప్పుకొచ్చింది. అసలు ఈమె ప్రేమ ఏంటో.. పెళ్లి ఏంటో అనుకొనేలోపు సీక్రెట్ గా అదీల్ దురానీని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. హమ్మయ్య.. ఎలా అయినా పెళ్లి అయిపోయింది. ఇక ఈ సమస్యలేమీ ఉండవులే అనుకున్నంత సమయం పట్టలేదు.. పెళ్లి అయ్యి రెండో నెల కూడా ఇంకా ముగియలేదు.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి మరోసారి షాక్ ఇచ్చింది. అదీల్ దురానీ.. వేరే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడని, తన వద్ద ఉన్న డబ్బు మొత్తం తీసుకొని తనను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన తల్లి మరణానికి అదీల్ దురానీనే కారణమని, బిగ్ బాస్ షో కోసం తన తల్లిని అతని వద్ద విడిచిపెట్టి వెళ్లి తప్పుచేసానని, వచ్చేసరికి తన తల్లిని చంపేశాడని ఆరోపణలు చేసింది. అందుకే అతడికి బయట ఉండే అర్హత లేదని. పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం విన్న అభిమానులు ఏం అక్కా.. రెండు నెలలో ఇంత విధ్వంసమా.. వామ్మో అని కొందరు.. ఇకనైనా ప్రేమ పెళ్లి అని కాకుండా సైలెంట్ గా ఉండు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

బోయింగ్‌లోనూ ఉద్యోగాల కోత.. 2000 మందికి ఉద్వాసన!
ఉద్యోగాల కోత ఇప్పట్లో ముగిసేలా లేదు. టాప్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాట పడుతున్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకంగా రెండు, మూడుసార్లు ఉద్యోగాల కోతకు రెడీ అంటున్నాయి. తాజాగా ఇదే బాటలో చేరింది ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్. దాదాపు 2000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసుకునే ఆలోచన చేస్తుందట. ఫినాన్స్, హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. ఈ లేఫ్స్‌లోని మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్)కు అప్పగించినట్లు మీడియా నివేదించింది. బోయింగ్ ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,500 మంది ప్రత్యక్ష ఉద్యోగులను కలిగి ఉంది. భారతదేశంలో టాటా గ్రూప్‌తో సహా దాని సరఫరాదారుల వద్ద మరో 7,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది దాదాపు 15000 మందిని ఉద్యోగులను నియమించుకున్నట్లు చెప్పిన బోయింగ్.. ఈ సంవత్సరంలో మరో 10,000 మందిని రిక్రూట్‌ చేసుకుంటామని తెలిపింది. మరోవైపు గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలోనే బోయింగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 అక్టోబరులో లైయన్‌ ఎయిన్‌ ఫ్లైట్‌ 610 టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 2019లో జరిగిన మరో ఘటనలో ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం టేకాఫ్‌ ఆయిన ఆరు నిమిషాలకే క్రాష్‌ అయ్యింది. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు భారీ సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విమాన తయారీలో లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రధానంగా ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపం కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే తయారీపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన బోయింగ్‌.. ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

Show comments