NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైఎస్సార్ సెంటిమెంట్‌ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా..
రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్‌ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి పల్లెకు, గూడేనికి చేరేలా కార్యక్రమం చేయాలని ఏఐసీసీ ఇంఛార్జి ఇచ్చిన ఆదేశాలతో ఈ యాత్ర ప్రారంభించినట్లు రేవంత్ వెల్లడించారు. రాచరిక వ్యవస్థకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పుడు సమ్మక్క సారలమ్మ చేసిన పోరాట స్ఫూర్తితోనే ఈ యాత్ర మేడారంలో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌లా చేవెళ్ల సెంటిమెంట్ లాగానే.. సీతక్క సెంటిమెంట్‌తో ఈ యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంత మంది వచ్చారు అంటే ఈ యాత్ర విజయావంతం అయినట్లేనన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే మళ్లీ రాచరిక వ్యవస్థ గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన 1200 మంది కుటుంబ సభ్యుల ఏడుపులు వినిపిస్తున్నాయని రేవంత్ అన్నారు. వారి బలి దానాలము మట్టిలో కప్పేసే ప్రయత్నాలు చేస్తుంటే.. బరిద్దామా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు. అబద్ధాలు చెప్పటం, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రతిరోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం మోడీని విమర్శించకుండా పూట గడవడం లేదన్నారు. ఆత్మస్తుతి, పర నింద అన్నట్లుగా తెలంగాణ బడ్జెట్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల కోసం పెట్టారా.. లేఖ కేంద్రాన్ని విమర్శించేందుకు పెట్టారా అర్థం కావటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పతకాలు అటకెక్కాయన్నారు. తమ వైపల్యాలను కేంద్రంపై రుద్దుతున్నారన్నారు. సీఎం చదివిన వేలాది పుస్తకాల పరిజ్ఞానాన్ని బడ్జెట్‌లో పెట్టరు.. కానీ మోడీని తిట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. బడ్జెట్‌లో సాహిత్యం ఎక్కువ, సమాచారం తక్కువ, కుటుంబ సందేశం మాత్రమే ఉందన్నారు. గతంలో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టలేదని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం సహకరించటం లేదని, మోడీ పథకాలు బాగా లేవని విమర్శలు చేస్తున్నారని, దేశానికి కేసీఆర్ దిక్కు అన్నట్లుగా చెప్తున్నారన్నారు. దళితులకు ఇస్తానన్న కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ విదేశాల నుంచి తెచ్చుకున్న క్యాపులు పెట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం అహంకారంతో మాట్లాడుతోందని.. 1200 మంది చనిపోయింది కల్వకుంట్ల కుటుంబం కోసం కాదన్నారు.

ఎల్లలు దాటిన ప్రేమ.. మయన్మార్‌ అమ్మాయితో లవ్‌.. ఆదిలాబాద్‌లో మ్యారేజ్‌..
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా, ఆదిలాబాద్‌ అబ్బాయి.. మయన్మార్‌ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లితో ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపించారు ప్రేమికులు.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌ మండలానికి చెందిన అబ్బాయి.. మయన్మార్ అమ్మాయికి పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. ఈ లవ్‌ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్‌కు మయన్మార్‌కు చెందిన కేథరిన్‌కు చింతగూడలోని చర్చిలో ఇవాళ వివాహం జరిగింది.. గొల్లపల్లి రవి కుమార్, మయన్మార్‌కు చెందిన జిన్ న్వేథెన్‌ల వివాహం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఘానంగా జరిగింది.. అయితే, రవి కుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్ న్వేథేన్ దోహా నగరంలోని హోటల్ మేనేజ్మెంట్‌లో పని చేస్తున్న సమయంలో.. ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది.. ఇక, వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.. దీంతో. ఇవాళ చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.. ఈ పెళ్లికి అమ్మాయి తరఫున ఆమె సోదరుడు క్యాహు క్యాహు థియేన్ హాజరుకాగా.. వరుడి తరపున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.

పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌పై కేంద్రం క్లారిటీ.. 2026 నాటికి పూర్తి..!
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై కూడా కేంద్రం క్లారిటీ వచ్చింది.. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఏపీ జెన్‌కో ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.. ఇవాళ రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన షెకావత్.. ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఏపీ ప్రభుత్వ సొంత నిధులతోనే అమలు చేస్తారని.. కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని వెల్లడించారు షెకావత్..

బాబీ సింహా ‘వసంత కోకిల’ ట్రైలర్ లాంచ్ చేసిన మెగాస్టార్
మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా హీరోగా రమణన్‌ దర్శకత్వం  వహిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ ‘వసంతకోకిల’ తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేసారు. కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు. ట్రైలర్ మొదటి నుండి చివరివరకు మంచి ఆసక్తికరంగా కట్ చేసారు. బాబీ సింహా-కశ్మీర పరదేశీ  లవ్‌ ట్రాక్‌ తో పాటు వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్ధమవుతుంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.ట్రైలర్ లో రాజేష్ మురుగేషన్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆసక్తిని పెంచాడు. రమణన్‌ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఈ వసంత కోకిల చిత్రం  తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీకి కళ్యాణ్ రామ్ అమిగోస్ నుంచి స్ట్రాంగ్ కంపిటీషన్ ఎదురవ్వనుంది.

ఒకే ఒక్కడు రోహిత్.. ఆ ఘనత సాధిస్తే సూపర్!
టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని అద్భుత రికార్డు రోహిత్ శర్మను ఊరిస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో హిట్‌మ్యాన్‌ ఓ సెంచరీ చేస్తే, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా జరిగే 4 టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ ఒక్క సెంచరీ చేసినా, దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. టెస్టుల్లో రోహిత్‌ 8 సెంచరీలు చేసినప్పటికీ, అవన్నీ ఆటగాడిగా సాధించినవే. కాగా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్‌, ఇటీవలే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్‌-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్టు మ్యాచ్‌ల్లో పోటీపడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్‌ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్‌ 12, భారత్‌ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అతడు కన్ఫర్మ్!
ఐపీఎల్-2022 తర్వాత టీమ్స్ అన్నీ కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి. వేలానికి ముందు కొందరు ప్లేయర్స్‌ను వదులుకున్న ఫ్రాంచైజీలు మినీ వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గతేడాది మెగావేలంలో ఎడాపెడా ప్లేయర్లను కొనుగోలు చేసి విమర్శల పాలైంది. కానీ ఈ సారి మాత్రం ఆచితూచి ఆడుగేసింది. హ్యారీ బ్రూక్ వంటి పవర్ హిట్టర్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ గత సీజన్ కంటే కూడా మెరుగ్గానే కనిపిస్తుంది. అయితే విలియమ్సన్ జట్టులో లేకపోవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ అభిమానుల్లో నడుస్తుంది. ఈ విషయంలో టీమ్ ఓనర్ కావ్య మారన్‌కు ఇప్పటికే ఒక ఆలోచన వచ్చిందని సమాచారం. సౌతాఫ్రికా ప్లేయర్ మర్క్‌రమ్‌ను హైదరాబాద్ కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మర్క్‌రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నీ ఆఖరి స్టేజ్‌కు చేరుకోగా.. ఈస్టర్న్ కేప్‌ను అతడు దాదాపు సెమీస్‌కు చేర్చాడు. వాస్తవానికి ఈ లీగ్‌ను సన్ రైజర్స్ పేలవంగా ఆరంభించింది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి నిరాశ పరిచింది. అయితే అనంతరం తన కెప్టెన్సీతో జట్టుకు హ్యాట్రిక్ విజయాలను సాధించి పెట్టాడు మర్క్‌రమ్. ఈ లీగ్‌లో మర్క్‌రమ్ ఈస్టర్న్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలబెడితే ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అలా జరగకపోయినా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే వారిలో అతడికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది.

టెలిగ్రాంలో సరి కొత్త ఫీచర్స్‌.. ఇక, వాట్సాప్‌కు చెక్‌..!
స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే వాట్సాప్‌ ఉండాల్సిందే అనేలా కోట్లాది మంది అభిమాన్ని పొందింది వాట్సాప్‌.. ఇక, ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో తన కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. ఈ సోషల్‌ మీడియా దిగ్గజం.. మరోవైపు.. టెలిగ్రామ్‌ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది.. వాట్సాప్‌కు చెక్‌ పెట్టేలా సరికొత్త ఫీచర్స్‌ను కస్టమర్లను అందుబాటులోకి తెచ్చింది.. కొత్త అప్‌డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్‌. ఇందులో భాగంగా వాట్సాప్‌ పోటీని తట్టుకునేందుకు టెలిగ్రామ్‌ సరికొత్త అప్‌డేట్స్‌తో లేటెస్ట్‌ ఫీచర్స్‌ను విడుదల చేసింది. వినియోగదారుల చాట్స్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసే ఫీచర్‌ను జోడించింది. ప్రొఫైల్‌ పిక్చర్‌, ఎమోజీ కేటగిరితో పాటు ఇతర ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది టెలిగ్రామ్‌.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో మొత్తం చాట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం లభించినట్లయింది. ఇక, ఈ ఏడాదిలో టెలిగ్రామ్ తీసుకొచ్చిన కొత్త 10 ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ప్రొఫైల్ ఫోటో మేకర్, పూర్తి చాట్‌లను అనువదించడం, ఎమోజి వర్గాలు మరియు మరెన్నో వంటి ఫీచర్లను జోడించింది. టెలిగ్రామ్ వార్షిక సభ్యత్వం కోసం ఒకేసారి చెల్లించాలనుకునే వినియోగదారుల కోసం ప్రీమియం సభ్యత్వంపై 40 శాతం వార్షిక తగ్గింపును అందిస్తోంది. టెలిగ్రామ్ మెసెంజర్, దాని తాజా అప్‌డేట్‌లో, వినియోగదారు చాట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇతర యుటిలిటీ-ఆధారిత ఫీచర్‌లతో పాటు ప్రొఫైల్ పిక్చర్ మేకర్ మరియు ఎమోజి కేటగిరీల వంటి ప్రధాన ఫీచర్లను జోడించింది.. అంతేకాకుండా, ప్లాట్‌ఫారమ్ దాని ప్రీమియం వినియోగదారుల కోసం మొత్తం చాట్‌ల అనువాదం వంటి కొన్ని ప్రత్యేక లక్షణాలను అందిస్తుంది.