అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా నందరెడ్డి కేసులో.. సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా నిందితులను ప్రశ్నిస్తోంది.. మరోవైపు, కేసులో విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదన్నారు.. అవినాష్‌రెడ్డి ఫోన్‌ను ఆరోజే పోలీసులు చెక్ చేశారు. నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని.. కుట్ర కోణం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వడం కోసం సిబ్బందికి సర్వసాధారణం అన్నారు సజ్జల.. సీఎం జగన్‌కు లింక్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. నవీన్.. వైఎస్ జగన్ ఇంట్లో అటెండర్.. జగన్ దగ్గర ఫోన్ లేదు కాబట్టి నవీన్‌కి ఫోన్ చేశారని తెలిపారు.. కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్ ఈ రోజు కూడా జగన్ వద్దనే ఉన్నారు.. కానీ, ఇందులో ఏదో కుట్ర కోణం ఉందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తికి దారుణం జరిగిన తర్వాత.. సమాచారం చేరవేయడం కూడా తప్పే అవుతుందా? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఈ కేసులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలు చేయడంలో ముందుంటారు అని ఆరోపించారు సజ్జల..
అదే అఖిలప్రియ ప్రయత్నం.. ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి దిగజారలేదు..!
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తాజాగా సవాల్ విసిరిన విషయం విదితమే.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్న ఆమె.. ఆధారాలతో చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.. లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, శిల్పా రవి టీడీపీ వైపు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు భూమా అఖిల ప్రియ.. అయితే, భూమా అఖిల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. నా బాస్ జగన్.. జీవితమంతా జగన్ వెంటనే.. జగన్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదాన్ని అవకాశంగా తీసుకుని నాపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.. భూమా అఖిల ఆరోపణలు బాబు మార్క్ ట్రిక్స్ గా పేర్కొన్న ఆయన.. వైసీపీలో కలకలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నేను టీడీపీలో చేరాలని అనుకోవడం ఏమిటి..? ఇది సీఎం వైఎస్ జగన్‌ను నారా లోకేష్.. ఎమ్మెల్సీ లేదా ఏదైనా చైర్మన్ పోస్ట్ అడిగినట్లు ఉందంటూ కామెంట్ చేశారు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి.. నాపై పోటీ చేసే వారు ఎవరనే విషయంపై టిడిపి వారికే క్లారిటీ లేదన్న ఆయన.. అయినా.. ఆడపిల్లలపై కాలు దువ్వే స్థాయికి నేను దిగజారలేదన్నారు.. నన్ను ప్రశ్నించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిదని హితవుపలికారు.. అప్పు చెల్లించమని బ్యాంకర్లు, బంధువులు ఇళ్ళ ముందు ధర్నాలు చేసిన సంఘటనలు, హైదరాబాదులోని బోయిన్ పల్లి నాటకాన్ని మరిచారా? అంటూ ఘాటుగా స్పందించారు.. శిల్పా ఫ్యామిలీ ఇమేజ్, ప్రజాబలం అందరికీ తెలుసు, అందుకే 35 వేల మెజార్టీతో గెలిచామని గుర్తుచేశారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి.
విదేశాలకు తారకరత్న తరలింపు..! పరిస్థితి బట్టి నిర్ణయం
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను విదేశాలకు తరలించే ఆలోచనలో కుంటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ.. తారకరత్నను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు.. ఈరోజు తారకరత్న మెదడుకు సంబంధించిన స్కాన్ తీశారు.. ఈ రోజు వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్దితి అర్థం అవుతుందని.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. అయితే, ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు మొదట కుప్పంలో అందించారు.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ టీడీపీ నేతలు నారాయణ హృదయాలయ ఆస్పత్రి దగ్గర వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ హిందూపురం టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టారు. హిందూపురం టీడీపీ పార్లమెంటు స్థానం ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య.. మరోవైపు.. నందమూరి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు, రాజకీయ నేతలు కూడా ఆస్పత్రిలో పరామర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీస్తున్నారు.
అంబికాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబు ఏనాడు స్పందించలేదు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబికాకృష్ణ.. ఆనాడు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు.. కానీ, ఎన్నోసార్లు నంది అవార్డులు ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబును అడిగా.. కానీ, ఏనాడు స్పందించలేదని విమర్శించారు.. స్టూడియోల కోసం మంచి స్థలాలు ఉన్నా.. ముందుకు వెళనివ్వలేదన్న ఆయన.. ఎక్కడా చంద్రబాబు సహకరించలేదని మండిపడ్డారు.. మనం ఎన్ని ప్రయాత్నలు చేసిన పైనున్న వారికి ఆసక్తి ఉండాలి కదా? అని ప్రశ్నించారు. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అలా కాదు.. ఆయనకు ఆసక్తి ఉంది.. ఇక, పోసాని సమర్దుడు కావడంతో వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. విజయవాడలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇక, జగన్ మోహన్ రెడ్డి అభిమానులంతా పోసాని అభిమానులే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్నినాని.. జగన్ కోసం ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తి పోసాని.. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు.. వంద ఎకరాల్లో స్టూడియోల నిర్మాణం కోసం చేయడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనే విశాఖ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం అన్నారు. నాటక రంగాని ఆదర్శించే వారు లేరు.. కనీసం చప్పట్లు కొట్టే వారు కూడా లేరని మండిపడ్డారు.. ఇక, సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. పోసాని భాద్యతలు తీసుకోవడం సినీ పరిశ్రమకు శుభపరిమాణంగా అభివర్ణించారు.. జగన్ మోహన్ రెడ్డి ఆశ నెరవేరుతుంది.. ఇప్పటికే వైజాగ్‌లో ప్రభుత్వ భూమి కేటాయించిందని.. వైజాగ్ తనతో పాటు సినీ పరిశ్రమ రావాలని సీఎం కోరికగా చెప్పుకొచ్చారు.
ఏపీలో మరో కొత్త కార్యక్రమం.. జగనన్నకు చెబుదాం..
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ఎన్నో పథకాలతో సామాన్యులకు చేరువైన ప్రభుత్వం.. ఇక, జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సిద్ధమైంది.. ఇవాళ జగనన్నకు చెబుదాం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.. వినతులను సంతృప్తస్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు.. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర చర్చ సాగిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు.. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్ చేయాలి, అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయాలి. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలన్నారు. అలా అయితేనే.. కార్యక్రమం సవ్యంగా సాగుతుందని తెలిపారు.
కోటంరెడ్డికి వరుస షాక్‌లు..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై ఎదురుదాడికి దిగిన వైసీపీ.. ఆ తర్వాత పక్కన పెట్టేంది.. అయితే.. ఇప్పుడు కోటంరెడ్డికి కార్పొరేటర్లు షాక్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆయనకు మద్దతుగా నిలిచిన జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు, 23 డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీతోపాటు మరో కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలు.. కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. తాము వైయస్సార్ అభిమానులమని మొదటనుంచి వైఎస్ జగన్ కు మద్దతుగా ఉన్నామన్నారు. పార్టీ ప్రయోజనాలజిస్ట్రా ఆదాల వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కార్యాలయంలో కోటంరెడ్డి ఫ్లెక్సీలను కార్యకర్తలు చించి వేశారు.. ఈ విషయం తెలియడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పడారుపల్లిలోని విద్యా భాస్కర్ ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించినట్టు కార్యకర్తలు తెలిపారు ఈ సమాచారం తెలియడంతో ఆదాల వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు చేరుకొని విజయ్ భాస్కర్ రెడ్డి వద్ద వివరాలు సేకరించారు.. పోలీస్ స్టేషన్ కు పిలిచి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. కోటంరెడ్డి పై కేసు నమోదు చేయాలని విజయ భాస్కర్ అనుచరులు పోలీసులను కోరారు.
దేశమంతటా ఎలక్ట్రిక్ ఆటోలు.. రేస్ ఎనర్జీతో చేతులు కలిపిన రాపిడో
షేర్డ్ రైడ్ అగ్రిగేటర్ అయిన రాపిడో (Rapido), బ్యాటరీ మార్పిడి కోసం డీప్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న రేస్ ఎనర్జీ (RACEnergy) దేశమంతటా ఎలక్ట్రిక్ ఆటోలను (E-ఆటోలు) తీసుకువచ్చేందుకు చేతులు కలిపాయి. ఈ-ఆటోల విస్తరణ ముందుగా హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. అయితే.. డిసెంబర్ 2023 చివరి నాటికి ఇతర నగరాలకు కూడా విస్తరిస్తుంది. అధునాతన మార్పిడి సాంకేతికతతో అనుసంధానించబడి, స్వాప్ పాయింట్ల యొక్క బలమైన నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను అందిస్తాయి. రాపిడోకు ఇప్పటికే కస్టమర్లు ఉండటంతో రోజుకు మిలియన్ రైడ్‌లతో RACEnergy యొక్క అధునాతన టెక్-ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ ఆటోలు జీరో డౌన్‌టైమ్‌తో ప్రజలకు తెలివిగా మరియు శుభ్రమైన ప్రత్యామ్నాయాన్ని అందించడంలో సహాయపడతాయి. ఇది 100 శాతం క్లీన్ మరియు ఎలక్ట్రిక్‌గా మార్చడం ద్వారా చివరి-మైల్ మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చడానికి ఒక అడుగు.
పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు
దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్ తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. పదేళ్ల కనిష్టానికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. బుధవారం నాటికి ఫోరెక్స్ నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. రుణ చెల్లింపులకు 592 మిలియన్ డాలర్లు విదేశీమారక నిల్వలు క్షీణించాయి. ప్రస్తుతం ఆ దేశంలోని కమర్షియల్ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్ డాలర్లను కలుపుకుంటే మొత్తం పాక్ వద్ద 8.74 బిలియన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం జనవరి 2022లో 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీమారక నిల్వలు జనవరి 27, 2023 నాటికి 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పాకిస్తాన్ అప్పులు-జీడీపీ నిష్పత్తి 70 శాతం ప్రమాదకరంగా ఉంది. ఈ ఏడాది ప్రభుత్వ ఆదాయంలో 40-50 శాతం వడ్డీ చెల్లింపులకే పోతుందని రాయిటర్స్ వెల్లడించింది. పాకిస్తాన్ ద్వైపాక్షిక రుణాల్లో 27 బిలియన్ డాలర్లలో దాదాపుగా 23 బిలియన్ డాలర్లు చైనా రుణాలే ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వంటగ్యాస్ ఎల్పీజీ ధరను 30 శాతం పెంచింది. విద్యుత్ యూనిట్ ధరను రూ. 6 పెంచాలని యోచిస్తోంది.
గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా స్టార్ క్రికెటర్
విమెన్స్ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. టీమ్‌లో ఎవరిని తీసుకోవాలనే దానికంటే ముందు సపోర్ట్ స్టాఫ్‌పై దృష్టి సారించాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే టీమిండియా లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను టీమ్ మెంటార్‌గా నియమించిన గుజరాత్.. తాజాగా హెడ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ ఎవరన్నది వెల్లడించింది. ఈ జట్టు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రేచల్ హేన్స్‌ను నియమించింది. అదే విధంగా తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా గుజరాత్ ఎంపికచేసింది. కాగా, మొదటి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్ పని చేశాడు. అతడి నేతృత్వంలోనే భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇక ఈ ముగ్గురు గుజరాత్ జెయింట్స్ మెంటార్ మిథాలీ రాజ్‌తో కలిసి పనిచేయనున్నారు. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా కొనసాగింది రేచల్ హేన్స్. అదే విధంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్ భాగంగా ఉంది. ఆమె ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. హేన్స్ 77 వన్డేల్లో 2,585 పరుగులు చేసింది. అందులో 19 అర్ధ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?
తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కొంతమంది నటులను తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ముఖ్యంగా కామెడీ పంచిన కమెడియన్లను అయితే అస్సలు మరువరు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, బ్రహ్మానందం.. వీరి గురించి ఎప్పుడు మాట్లాడిన పెదాల్లో ఒక చిరునవ్వు వస్తోంది. ఇక ఒకప్పుడు ఎంతో బాగా బతికిన నటులు.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియాలో కొంతమంది నటులు చనిపోయారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక తాజగా కొన్నిరోజుల నుంచి లేడీ కమెడియన్ రమాప్రభ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తుంది అని, కొందరి దగ్గర అడుక్కు తింటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు అనే రేంజ్ లో మండిపడింది. “నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. కొందరి దగ్గర అడుక్కొని తింటున్నాను.. ఎవరైనా సాయం చేయండి అంటూ నాపై వార్తలు వచ్చాయి. వాటిని నేను కూడా చూసాను.. మొన్నీమధ్యనే నా సొంత యూట్యూబ్ ఛానెల్ లో నా ఇంటిని మొత్తం చూపించాను. ఇంతపెద్ద ఇల్లు పెట్టుకొని ఎవడైన అడుక్కుతింటాడా..? నేను అడుక్కుతింటే.. ఈ ఇల్లు ఎవరిది మరి.. చెప్పండి. ఈ వయస్సులో కూడా నేను బిజీగా పనిచేస్తున్నాను.. ఇండస్ట్రీలో నాగార్జున, పూరి జగన్నాథ్ లాంటివారు సాయం చేస్తున్నారు. అది భిక్ష ఎలా అవుతోంది.. వాళ్ళు నన్ను ఇంటిమనిషిలా చూస్తున్నారు. దాన్ని మీరెలా భిక్ష అంటారు. అది వారి ప్రేమ.. వారేదో భిక్ష వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మేము అంతా కుటుంబంలా కలిసి ఉన్నామని నేను అంటున్నాను.. నిజం చెప్పాలంటే అందరికంటే నేను రిచ్ గా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.